రివ్యూ :- మాచర్ల నియోజకవర్గం
తారాగణం :- నితిన్, కృతిశెట్టి, సముద్రఖని, వెన్నెల కిశోర్, ఇంద్రజ, మురళీశర్మ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
సంగీతం :- మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ :- ప్రసాద్ మూరెళ్ల
నిర్మాతలు :- సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి
దర్శకత్వం :- ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి

ఫ్రైడే వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాల సందళ్లతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. ఆ కళ ఈ మధ్య కాస్త తగ్గినా.. లాస్ట్ వీక్ ఇచ్చిన బూస్టప్ తో ఈ వారం సినిమాలపై అంచనాలు పెరిగాయి. ఈ మధ్య వరుస ఫ్లాపులు చూస్తోన్న నితిన్ మాస్ ఆడియన్స్ టార్గెట్ గా మాచర్ల నియోజకవర్గం సినిమాతో వచ్చాడు. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :-
మాచర్ల నియోజకవర్గం కథగా చూస్తే.. 1990ల కాలంలో మొదలవుతుందీ కథ. తండ్రి మరణంతో ఆ సీట్ ను ఆశించిన సిద్ధప్పకు అధిష్టానం సీట్ ఇవ్వదు. దీంతో పోటీలో ఉన్నవారిని చంపి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ.. ముప్ఫైయేళ్లుగా అక్కడ ఎలెక్షనే లేకుండా యూనానిమస్ గా గెలుస్తుంటాడు. కట్ చేస్తే కథ 2022లోకి వస్తుంది. సిద్ధార్థ్ అనే యంగ్ స్టర్ ఐఏఎస్ టాపర్. పోస్టింగ్ కోసం చూస్తుంటాడు. ఆ టైమ్ లో వైజాగ్ లోని బంధువుల ఇంటికి వచ్చిన స్వాతితో ప్రేమలో పడతాడు. ప్రేమను ఒప్పుకోదు కానీ.. అతనితో వైజాగ్ లో తన పనులు చేసుకుంటుంది. ఓ రోజు తను సిద్ధార్థ్ కు చెప్పకుండా వెళ్లిపోతుంది. తన కోసం మాచర్ల వెళ్లిన సిద్ధార్థ్ కు స్వాతిని చంపేందుకు ప్రయత్నిస్తోన్న రాజప్ప కొడుకును అడ్డుకుంటాడు. అదే టైమ్ తనకు కలెక్టర్ గా గుంటూర్ కు పోస్టింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అసలు రాజప్ప ఎందుకు స్వాతిని చంపాలనుకుంటాడు. 30ఏళ్లుగా ఎన్నికలు లేని మాచర్లలో కలెక్టర్ గా సిద్ధార్థ్ ఎలెక్షన్స్ జరిపించాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :-
అస్సలే మాత్రం కొత్తదనం లేని కథ, కథనాలతో వచ్చిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ఎప్పుడో 80, 90ల నాటి కథాంశం. తర్వాతి సీన్ ఏంటో ఎవ్వరైనా సులువుగా ఊహించేయొచ్చు. అంత నాసిరకమైన స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. రక్తపాతం సృష్టిస్తోన్న ఎదురేలేని ఓ రౌడీ. అతన్ని ఎదుర్కొనేందుకు వచ్చే హీరో. హీరో ఫ్యామిలీనీ లేదంటే అతనికి కావాల్సిన వారిని చంపేయడం.. చివరగా ఇతగాడు కక్ష తీర్చుకోవడం. ఈ ఫార్ములాకు కాలం చెల్లి దశాబ్ధం దాటింది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం హీరో కూడా అప్రజాస్వామికంగా వెళ్లడం హాస్యాస్పదం. తెరంతా రక్తపాతం. మాట్లాడితే ఫైట్ అన్నట్టుగా ఉంటుంది సిట్యుయేషన్. హీరో విలన్ ఇంటికి వెళ్లినా.. విలన్ హీరోకు ఎదురు వచ్చినా ఫైటే. అయినా ఈ కథలో ఏ కొత్తదనం ఉందని నితిన్ ఒప్పుకున్నాడో కానీ.. అతనికి మరో ఫ్లాప్ తప్పదు అనేలా ఉంది. హీరోయిన్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తోనే కనిపించింది. సముద్ర ఖని డ్యూయొల్ రోల్ కేవలం క్లైమాక్స్ లో చిన్న “ఊరేగింపు”కు పనికొచ్చింది తప్ప.. ఏం కొత్తదనం లేదు. బట్ ఆయన బానే నటించాడు. వెన్నెల కిశోర్ కామెడీ ఓ దశ దాటాక ఇరిటేట్ చేస్తుంది. మిగతా పాత్రలన్నీ వెరీ రొటీన్.

టెక్నికల్ గానూ వీక్ గానే ఉందీ చిత్రం. సినిమాటోగ్రఫీ మాత్రమే బావుంది. నేపథ్య సంగీతం కూడా కాపీ కొట్టినట్టు తెలుస్తుంది. పాటలూ పెద్దగా రిజిస్టర్ కాలేదు. పైగా ప్లేస్ మెంట్ సరిగా లేదు. నితిన్ సొంత బ్యానర్ లోనే వచ్చిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బానే ఉన్నాయి. దర్శకుడిలో అసలు విషయమే లేదు. ప్రతి పాత్రకూ ఓ క్యారెక్టరైజేషన్ ఉంటుందన్న మినిమం అవగాహన కూడా లేదు. టేకింగ్, మేకింగ్, షాట్ డివిజన్ లో కూడా తనదైన టాలెంట్ ఏం కనిపించదు. బలమైన కథలు, లేదంటే సరికొత్త కథనం ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్స్ రాని రోజుల్లో అస్సలే మాత్రం కొత్తదనం లేని ఈ సినిమాను నితిన్ ఎలా యాక్సెప్ట్ చేశాడనేదే పెద్ద ప్రశ్న.
ఏదేమైనా ఇప్పటికే నితిన్ మార్కెట్ చాలా డౌన్ అయింది. ఇంకా ఇలాంటి కథలతో వస్తానంటే ఇంక కెరీరే ఖతమైపోతుంది. “హోప్ హీ అండర్ స్టాండ్స్”.

ఫైనల్ గా :- డిపాజిట్స్ కూడా దక్కేలా లేవు.

రేటింగ్ :- 1.5/5

            - యశ్వంత్ బాబు. కె
, , , , , , , , ,