బస్ స్టాప్ కైనా, రైల్వే స్టేషన్ కైనా.. మనం ఎక్కడికి వెళ్లాలో తెలిసే వెళ్లాలి. ఆ టికెట్ తీసుకున్న తర్వాత అందుకు తగ్గ బస్సో, రైలో వస్తేనే ఎక్కాలి. ముందుగా వచ్చింది కదాని ఏదిపడితే అది ఎక్కితే.. గమ్య స్థానం సంగతి అటుంచి ఎక్కడ ఎప్పుడు దింపేస్తారో తెలియదు. ఆ రెండు వాహనాల్లో చేసేది టికెట్ కలెక్టర్స్ అయితే.. సినిమా ఇండస్ట్రీలో ఆ పనిచేసేది ప్రేక్షకులు.

ప్రస్తుతం తెలుగులో ఇద్దరు కుర్రాళ్లు పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. స్వయంకృషితో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వీరిలో ఆరాటం కనిపిస్తోంది తప్ప.. మంచి అవుట్ పుట్ తో రావాలన్న ఆలోచన కనిపించడం లేదు. ఆ ఇద్దరూ ఎవరో తెలుసు కదా.. సంతోష్ శోభన్, కిరణ్‌ అబ్బవరం. ఈ ఇద్దరూ హడావిడీగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు తప్ప అందులో కంటెంట్ ఏం కనిపించడం లేదు. దీంతో సినిమా సినిమాకూ విపరీతంగా బోర్ కొట్టేస్తున్నారు. బలమైన కంటెంట్ లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలనే పట్టించుకోని పరిస్థితి ఇప్పుడు. మరి వీళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి.


నటులుగా మారి స్టార్డమ్ తెచ్చుకోవాలన్నదే ఎవరికైనా ఇక్కడ ఉండే టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మంచి కథలతోనే అవుతుంది తప్ప.. నంబరింగ్ లో ఎక్కువగా కనిపించే సినిమాలతో అవదు. మొదటి రెండు సినిమాలతో ఓ మోస్తరుగా మెప్పించిన కిరణ్ అయితే స్పీడ్ గా వస్తున్నాడు.. అంతే స్పీడ్ గా బోర్లా పడిపోతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ వచ్చాడు. ఈ మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి.

ప్రస్తుతం అతని చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఆల్రెడీ వినరో భాగ్యము విష్ణుకథ అనే మూవీ రెడీగా ఉంది. మరి వస్తోన్నవిమర్శలు చూసి ఆగారో ఏమో కానీ.. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నాడు.


ఇక సంతోష్‌ శోభన్ కు కొంతలో కొంత బ్యాక్ గ్రౌండ్ ఉండేది. అతని తండ్రి దర్శకుడు శోభన్. శోభన్ చనిపోయినా.. అతని వల్ల సంతోష్‌ కు కొంత ఆదరణ అయితే ఉంది. మంచి టాలెంటెడ్ అని ప్రతి సినిమాకూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ ఆ సినిమాల్లో కంటెంట్ విషయంలో పూర్ గా ఉంటున్నాడు. ఈ కారణంగానే వరుసగా మూవీస్ వస్తున్నా.. విజయాలు రావడం లేదు.

ఆ మధ్య వచ్చిన ఏక్ మినీ కథ అనే సినిమా ఓటిటి ఆడియన్స్ ను మెప్పించింది. ఆ తర్వాత మారుతితో చేసిన మంచి రోజులొచ్చాయి పోయింది. లేటెస్ట్ గా వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. ప్రస్తుతం ప్రేమ్ కుమార్, అన్నీ మంచి శకునములే చిత్రాలు చేస్తున్నాడు. అన్నీ మంచి శకునములే చిత్రానికి నందినీ రెడ్డి దర్శకురాలు. దీనిపైనే అతని ఆశలన్నీ ఉన్నాయి.


ఏదేమైనా ఈ కుర్రాళ్లిద్దరూ టాలెంటెడ్ అనిపించుకున్నారు. కానీ ఇండస్ట్రీలో నిలబడి స్టార్స్ కూడా అనిపించుకోవాలంటే ఇదొక్కటే సరిపోదు. బలమైన కథలు సెలెక్ట్ చేసుకునే టాలెంటూ ఉండాలి. ఆ విషయంలోనే ప్రస్తుతం ఇద్దరూ రాంగ్ ట్రాక్ లో ఉన్నారు.