కాంపిటీషన్ ఉన్నప్పుడే ఖలేజా తెలుస్తుంది అంటారు. ఒక్కోసారి కాంపిటీషన్ లేకపోవడం వల్ల కూడా ఖలేజా పెరుగుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాస్ మహరాజ్ రవితేజ ధమాకా సినిమా. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ బాక్సాఫీస్ షేక్ చేస్తూనే ఉంది. ఫస్ట్ వీకెండ్ లోనే ట్రేడ్ ను ఆశ్చర్యపరిచిన ధమాకా.. వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఊహించిన కలెక్షన్స్ సాధిస్తోంది.

ఇక ఇయర్ ఎండింగ్ లో ఎన్నో సినిమాలు వచ్చినా.. ఆడియన్స్ మాత్రం అదే పనిగా ధమాకాకే ఓటు వేస్తున్నారు. దీంతో రవితేజ రొటీన్ మూవీ అనిపించుకున్న ధమాకా ఏకంగా వంద కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది..

మాస్ మహరాజ్ రవితేజ మూవీస్ కు ఓ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ లోనే వరుసగా సినిమాలు చేయడంతో కొన్నాళ్ల క్రితం ఓ మొనాటనీ వచ్చేసింది. దీంతో ఇక రవితేజ పని ఐపోయిందీ అనుకున్నారు కూడా. ఓ దశలో అతను మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అన్నారు. అలా అన్నవారి ఆలోచనను మార్చుకునేలా చేసింది క్రాక్ మూవీ. క్రాక్ బ్లాక్ బస్టర్ తో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అన్నారు. బట్ మళ్లీ వరుసగా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ అంటూ రెండు ఫ్లాపులు.

మరోసారీ అవే కమెంట్స్ చేశారు. ఈ సారి వారికి సమాధానం చెప్పింది ధమాకా మూవీ. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి విమర్శకుల నుంచి నెగెటివ్ టాకే వచ్చింది. చాలా రొటీన్ రవితేజ మార్క్ మూవీ అన్నారు. బట్.. కొన్నాళ్లుగా సీరియస్ మూవీస్ తో వస్తోన్న రవితేజకు ఈ సారి అదే ప్లస్ అయింది. అంటే ఫ్యాన్స్ అంతా సీరియస్ సినిమాలతో ఇబ్బంది పడుతోన్న టైమ్ లో మళ్లీ అతని మార్క్ ఎంటర్టైనర్ కావడంతో పాటు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన సినిమాలూ లేకపోవడంతో ధమాకాకు అనుకోకుండా కలిసొచ్చింది.

మరోవైపు వస్తోన్న సినిమాలన్నీ డిజాస్టర్ టాక్స్ తెచ్చుకుంటున్నాయి. డిసెంబర్ 30,31న ఏకంగా డజను సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటీ ఆకట్టుకోలేదు. దీంతో న్యూ ఇయర్ లో కూడా రవితేజ సినిమానే జనాలను ఎంటర్టైన్ చేస్తోంది. అందుకే ఈ మూవీ ఇప్పటికే పది రోజుల్లో 89 కోట్లు కలెక్ట్ చేసింది. రవితేజ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ ఇవి.

ఇక ఈ ఊపు చూస్తోంటే సంక్రాంతి వరకూ మరో పెద్ద సినిమా లేదు కాబట్టి.. ఈజీగా వంద కోట్ల మార్క్ ను టచ్ చేయొచ్చు అనిపిస్తోంది. అంటే రవితేజకు ఫస్ట్ టైమ్ వంద కోట్ల సినిమాగా ధమాకా నిలవబోతోంది అనుకోవచ్చు. అయితే యావరేజ్ కంటెంట్ తో వస్తేనే ఈ కలెక్షన్స్ వస్తే.. కాస్త మంచి కథలపై కూడా శ్రద్ధ పెడితే రవితేజకు మరిన్ని కలెక్షన్స్ వస్తాయి కదా..? అనిపిస్తోంది కదూ. మరి ఇకనైనా అతను మంచి కంటెంట్ తో వస్తాడేమో చూద్దాం.