ఈ రెండు సినిమాలతో శ్రుతి హాసన్ కు ఒరిగిందేంటీ..?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ తో నటించే అవకాశం రావడం గొప్పైతే.. ఆ రెండు సినిమాలూ ఒకేసారి విడుదల కావడం ఓ రేర్ ఫీట్. ఆ ఫీట్ లో “కనిపించింది” శ్రుతి హాసన్. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య, నందమూరి బాలయ్యతో వీర సింహారెడ్డి సినిమాల్లో నటించింది. బట్ ఈ రెండు సినిమాల్లో తన పాత్ర గురించి చెబితే మాత్రం ఏమీ లేదనే చెప్పాలి. ముఖ్యంగా వీర సింహారెడ్డిలో కేవలం పాటలకు మాత్రమే పరిమితమైన ఉత్సవ విగ్రహం లాంటి పాత్ర అది.

ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. అయినా ఈ రోల్ కు ఓకే చెప్పడానికి కారణం దర్శకుడు గోపీచంద్ మలినేని అనుకోవచ్చు. ఇతని దర్శకత్వంలో గతంలో బలుపు, క్రాక్ వంటి హిట్ మూవీస్ లో యాక్ట్ చేసింది. శ్రుతి హాసన్. ఆ రెండు సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. క్రాక్ లో అయితే ఏకంగా ఓ మాస్ ఫైట్ కూడా పెట్టాడు. కానీ ఈ వీర సింహారెడ్డిలో అస్సలే మాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చి ఓ రకంగా శ్రుతి హాసన్ ను అవమానించాడనే అనుకోవచ్చు. ఈ చిత్రం గురించి చెప్పుకోవడానికి కూడా శ్రుతికి ఏమీ మిగల్లేదు.


బాలకృష్ణ సినిమాతో పోలిస్తే చిరంజీవి మూవీ కాస్త బెటర్. ఇందులో ‘రా’ ఏజెంట్ గా నటించింది. ఆ విషయం రివీల్ అయినప్పుడు పవర్ ఫుల్ గానే అనిపించినా.. తర్వాత ఆ పాత్ర కూడా తేలిపోయింది. కాకపోతే కాస్త ఎక్కువ లెంగ్త్ ఉంది. అయినా శ్రుతి హాసన్ కు పాత్రగా ఈ చిత్రం ఏ మాత్రం ఉపయోగపడేది కాదు. కేవలం తన అకౌంట్ లో మరో రెండు సినిమాలు పడ్డాయి తప్ప.. ఈ రెండు పెద్ద సినిమాలతో ఆమె కెరీర్ కు ఏ మాత్రం ప్లస్ కాలేదు. ఇంకా చెబితే మైనస్ అని కూడా అనొచ్చు.

అసలు సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదంటే.. వచ్చినవారికి ప్రాధాన్యత లేని పాత్రలు ఇవ్వడం దర్శకులకు మంచిది కాదు. రాబోయే రోజుల్లో ఈ సీనియర్స్ తో యాక్ట్ చేయాలంటే ఇంకా ఇబ్బంది పడతారు హీరోయిన్లు. ఎలాగూ కొత్తవారిని తీసుకోలేరు. వచ్చినవారికైనా ఇంపార్టెన్స్ ఉంటే కనీసం చేయడానికి ముందుకు వస్తారు. ఏదేమైనా వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యలో చాలా పాత్రల్లాగే శ్రుతి హాసన్ కూడా ఉంది తప్ప.. తనకు ప్రత్యేకంగా ఈ రెండు సినిమాల వల్ల కనీసం ఒరిగింది కూడా ఏం లేదు.

Related Posts