పుష్పరాజ్ కు వచ్చే రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా – అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందింది. అయితే.. పుష్ప ఫ‌స్ట్ పార్ట్ ను డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ పుష్ప గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.

ఇంత‌కీ అల్లు అర్జున్ ఏం చెప్పారంటే.. పుష్పరాజ్‌ అనేది ఓ కల్పితమైన పాత్ర. కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్‌గా… ఇలా మూడు కోణాల్లో కనిపిస్తాను. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్‌కే రెండు గంటల సమయం పట్టింది. తొలగించడానికి అర గంట పైనే పట్టేది. ఈ స్థాయి మేకోవర్‌తో నేను ఏ సినిమా చేయలేదు. హాలీవుడ్‌లో ప్రాస్థెటిక్‌ మేకప్‌ ఎలా చేస్తారు? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమాతో నాకు తెలిసొచ్చింది. ఇక‌ యాస గురించి చాలా కసరత్తులే చేశాను. స్క్రిప్ట్‌లో ఉన్న సంభాషణల్ని పలకడమే కాదు. సహజంగా ఓ మాటని రాయలసీమ యాసలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేంత పట్టు వచ్చేలా నేను కసరత్తులు చేశాను.

ముఖ్యంగా ఒక భుజం పైకి లేపి కనిపిస్తూ నటించాల్సి వచ్చింది. 2005, 2011లో నా భుజానికి గాయమైంది. శస్త్రచికిత్స జరిగింది. మళ్లీ ఈ సినిమా కోసం అదే భుజం పైకి లేపి నటించాల్సి రావడంతో చాలా నొప్పి వచ్చేది. పుష్ప చిత్రానికి నా కెరీర్‌లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాని చూసి ఎవరెలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత నాలో ఉంది. అలా అనిపించ‌డం నా కెరీర్‌లో తొలిసారి అంటూ అల్లు అర్జున్ పుష్ప గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు.

Related Posts