వివాహ భోజనంబు- రివ్యూ
Latest Movies OTT Reviews

వివాహ భోజనంబు- రివ్యూ

నటీనటులు – సత్య, ఆర్జావీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి తదితరులు

సాంకేతిక నిపుణులు – సంగీతం – అనివీ, సినిమాటోగ్రఫీ – మణికందన్, ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్, కథ – భాను భోగవరపు, మాటలు – నందు ఆర్ కె, నిర్మాతలు – కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం – రామ్ అబ్బరాజు.

విడుదల – ‘సోని లివ్’ ఓటీటీ

కమెడియన్ సత్య హీరోగా నటించిన సినిమా “వివాహ భోజనంబు”. ఈ సినిమా ‘సోని లివ్’ ఓటీటీ లో శుక్రవారం విడుదలైంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి పెళ్లి కొడుకు కథతో దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో సందీప్ కిషన్ నిర్మించి, నటించిన “వివాహ భోజనంబు” ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

మహేష్ (సత్య) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనిది పిసినారి వ్యక్తిత్వం. మహేష్ కు డెంగ్యూ వచ్చి బ్లడ్ ప్లేట్ లెట్స్ పడిపోయినప్పుడు అనిత (అర్జావీ రాజ్) బ్లడ్ ఇచ్చి ప్రాణం పోస్తుంది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రేమించడం మొదలుపెడతాడు. మహేష్ నిజాయితీ నచ్చి పెద్ద అందగాడు, ఆస్తిపాస్తులు లేకున్నా అతని ప్రేమను అంగీకరిస్తుంది అనిత. మహేష్ అనిత పెళ్లికి రెడీ అయినప్పుడు అనిత ఫాదర్ రాధా కృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) ససేమిరా అంటాడు. తమ స్థాయితో మహేష్ కుటుంబం ఎక్కడా సరిపోదనేది అతని అభ్యంతరం. రాధా కృష్ణ తండ్రి మహేష్ తో అనిత పెళ్లికి అందర్నీ ఒప్పించి పెళ్లి జరిపిస్తాడు. కరోనా టైమ్ కాబట్టి పరిమిత అతిథులతో మహేష్ ఇంట్లో పె‌ళ్లి వేడుక జరుగుతుంది. పెళ్లైన తర్వాత లాక్ డౌన్ రావడంతో మొత్తం అతిథులంతా మహేష్ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ టైమ్ లో అయ్యే ఖర్చులను ప్రతి రూపాయి లెక్కించే మహేష్ ఎలా భరించాడు. వాళ్లను ఎలా వదిలించుకున్నాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

హీరో పిసినారి అవడం మనం చాలా సినిమాల్లో చూశాం. అతని పిసినిగొట్టు పనుల్లోనే చాలా కామెడీ జెనరేట్ అవుతుంది కాబట్టి ఇదొక సక్సెస్ ఫుల్ ఫార్ములా. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ పాయింట్ నే నమ్ముకుని సినిమా రూపొందించాడు. కరోనా టైమ్ లో పెళ్లి అనేది ఈ కథకు రామ్ అబ్బరాజు ఎంచుకున్న కొత్త నేపథ్యం. ప్రతి రూపాయి లెక్కపెట్టి ఖర్చు చేసే హీరో…ఈ చుట్టాల గ్యాంగ్, వాళ్ల ఆతిథ్యానికి అయ్యే ఖర్చులు భరించేందుకు పడిన పాట్లు నవ్వించాయి. ప్రతి సీన్ లో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులున్నారు. సత్య, అతని మామ, తండ్రి శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ కాసేపు బాగున్నా, మొత్తం వీళ్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ తోనే కామెడీ చేయించాలనుకున్నాడు దర్శకుడు. అల్లుడిని ఏడిపించే మామ పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పర్మార్మెన్స్ బాగుంది. కూతురు మాట కాదనలేక, అల్లుడు మీద కోపంతో అతను చూపించే ఎక్స్ ప్రెషన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. మహేష్ క్యారెక్టర్ సత్యకు టైలర్ మేడ్. సత్య పాత్రే కథను నడిపిస్తుంది. అర్జావీ రాజ్ నాయికగా మెప్పించింది. ఆంబులెన్స్ డ్రైవర్ నెల్లూరి ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఉన్నంత సేపూ నవ్విస్తుంది. సందీప్ కిషన్ ఈ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రెండు మూడు పాత్రల మధ్య కామెడీనే నమ్ముకోవడంతో మిగతా సినిమా అంతా విసిగించేలా సాగుతుంది. కొన్ని సీన్స్ నవ్వించడం మినహాయిస్తే మిగతా అంతా బోర్ కొడుతుంది. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు పెద్ద మైనస్. ఒక్క పాట బాగా లేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద డ్రాబ్యాక్. నందు ఆర్కే డైలాగ్స్ సీన్స్ కు బలాన్నిచ్చాయి.

ఫ్లస్ పాయింట్స్

సత్య, శ్రీకాంత్ అయ్యంగార్ పర్మార్మెన్స్
సినిమాటోగ్రఫీ
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్

విసిగించే సెకండాఫ్
రొటీన్ ట్విస్ట్స్
మ్యూజిక్

రేటింగ్ – 2/5

Post Comment