ఇండస్ట్రీకి వర్మ డిమాండ్ ..

సాధారణంగా కాంట్రవర్శీస్ తో ఎక్కువగా కనిపించే రామ్ గోపాల్ వర్మ నిజానికి ఓ మేధావి. అతనికి తెలియని అంశాలంటూ ఉండవు అని అనేక సార్లు నిరూపించుకున్నాడు. మామూలుగా తన పనేదో తను చేసుకునే వర్మ.. కొన్నాళ్లుగా ఏపి ముఖ్యమంత్రి జగన్ కు ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. దీంతో వాళ్లు వర్మ కూడా జగన్ కు ఫ్యాన్ అని భ్రమించారు. బట్ ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో రామ్ గోపాల్ వర్మ ఏపికి చుక్కలు చూపిస్తున్నాడు. వరుస ట్వీట్స్ తో పాటు వీడియోస్ తోనూ ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. అతని ప్రశ్నలకు ఏపి వద్ద సమాధానం ఉంటుందని భావించలేం. రీసెంట్ గా కూడా వోడ్కా తాగుతూ.. ఉత్పత్తి దారుడు, వినియోగదారుడు మధ్య ప్రభుత్వానికేం పని అని ప్రశ్నించాడు. ఇది పూర్తిగా సహేతుకమైన ప్రశ్న అని చెప్పలేం కానీ.. అతను దాన్ని వివరించాడు. అతని వివరణ చూసిన తర్వాత ఎవరికైనా ఏపి ప్రభుత్వం టికెట్ రేట్ల వ్యవహారంలో గుడ్డిగా ఉందని లేదా కక్ష సాధింపే అని నిర్థారించుకోవచ్చు. ఇక గత మూడు నాలుగు రోజులుగా ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న వర్మ.. లేటెస్ట్ గా ఇండస్ట్రీని కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
‘నేను ఇండస్ట్రీలో ఉన్న నా సహచరులందరినీ విజ్ఞప్తి కాదు డిమాండ్ చేస్తున్నాను. ప్రతి టికెట్ రేట్ వ్యవహారంపై మాట్లాడండి. ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పుడూ తెరవలేరు. తర్వాత మీ ఖర్మ’ అంటూ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు వర్మ. అదే టైమ్ లో వరుసగా ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పిస్తూనే ఉన్నాడు. మొత్తంగా వర్మ వోడ్కాలో ఉండి వీడియో చేసినా.. ఇప్పుడు మాత్రం అతని ప్రశ్నలు నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి. మరి వీటికి ఏపి మంత్రి స్పందిస్తాడా లేదా అనేది చెప్పలేం కానీ.. వర్మ గట్స్ ను మాత్రం పొగడాల్సిందే.

Related Posts