తారాగణం : అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శతృ, శరత్ లోహితాస్వ తదితరులు
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ జే
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ : తూం వెంకట్
మాటలు : అబ్బూరి రవి
దర్శకత్వం : విజయ్ కనకమేడల

కామెడీ హీరోగా అల్లరి నరేష్ కు ఓ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు వచ్చిన నాంది అతనిలోని కొత్త కోణాన్ని గొప్పగా ఆవిష్కరించింది. అందుకే అదే దర్శకుడితో మరోసారి ఉగ్రం అంటూ వచ్చాడు. ట్రైలర్ చూడగానే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యం కూడా కనిపించింది. అంతేకాక నరేష్‌ ఫస్ట్ టైమ్ బ్లడ్ షెడ్ తో కనిపించాడు. రిలీజ్ కు ముందు ఆసక్తిని పెంచిన ఉగ్రం.. ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూద్దాం..

కథ :
శివకుమార్(నరేష్‌) ఓ సిన్సియర్ పోలీస్. ట్రెయినింగ్ లో ఉన్నప్పుడే అపర్ణను ప్రేమించి పోస్టింగ్ రాగానే ఆమె పేరెంట్స్ ను ఎదురించి పెళ్లి చేసుకుంటాడు. వారికి లక్కీ అఏ ఓ కూతురు ఉంటుంది. వీరిది హ్యాపీ ఫ్యామిలీ. కానీ శివ కుమార్ ఫ్యామిలీ కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడని భార్య కంప్లైంట్ ఉంటుంది. శివకుమార్ ఓ సారి అమ్మాయిలను ఏడిపిస్తోన్న గంజాయ్ బ్యాచ్ ను పట్టుకుని జైలుకు పంపిస్తాడు. వాళ్లు బయటకు వచ్చి శివకుమార్ డ్యూటీలో ఉన్న టైమ్ లో అతని ఇంటికి వెళ్లి భార్యను అవమానిస్తారు. ఆ టైమ్ లో శివకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఇంటికి వచ్చాక విషయం తెలియడంతో కోపంతో వెళ్లి వాళ్లందరినీ ఎన్ కౌంటర్ చేస్తాడు. తమను సరిగా పట్టించుకోవడం లేదు అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోవాలని రాత్రిపూట బయలుదేరుతుంది అపర్ణ. బతిమాలినా వినకపోతే తనే డ్రాప్ చేస్తానని బయలుదేరతాడు శివ. కార్లో వెళుతుండగా ప్రమాదం జరుగుతుంది. అతని తలకు బలమైన గాయం అవుతుంది. భార్య, కూతురును హాస్పిటల్ లో జాయిన్ చేశా అనుకుంటాడు కానీ.. అతను హాస్పిటల్ కు ఒక్కడే వచ్చాడనేది సిసిటివి లో రికార్డ్ అవుతుంది. మరి అతని వైఫ్‌, డాటర్ ఏమయ్యారు..? ఎవరైనా కిడ్నాప్ చేశారా..? దీని వెనక ఎవరున్నారు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
అల్లరి నుంచి తన పేరు ముందు నాంది వచ్చేలా చేసుకున్నాడు నరేష్‌. ఇప్పుడు ఉగ్రం చూస్తే అది కూడా యాడ్ అయ్యేలా ఉంది. ఓ సిన్సియర్ పోలీస్. మంచి ఫ్యామిలీ. సడెన్ గా కుటుంబ సభ్యులు మాయం కావడం.. అంతకు ముందే సిటీలో వరుసగా చాలామంది మనుషులు అదృశ్యం అవుతుండటం.. ఆ లిస్ట్ లో తన భార్య పిల్లలు ఉండటంతో పాటు తనకు మెదడు బలమైన దెబ్బ తగలడం వల్ల వచ్చే సమస్య.. ఇవన్నీ ఓ మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సినన్ని దినుసులే. అయితే ఆ దినుసులను ఎలా వండారు అనేదాన్ని బట్టే వంట టేస్ట్ తెలుస్తుంది. ఈ విషయంలో దర్శకుడు విజయ్ కనకమేడల మరింత స్టడీ చేయాల్సింది అనిపిస్తుంది. తను ప్రధానంగా ఏం చెప్పాలనుకున్నాడు అనేది కన్ఫ్యూజింగ్ గా ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ వెనక ఒక మాఫియా ఉందనేది చివర్లో చూపించాడు. కానీ దానికి సరైన ఎలివేషన్ లేదు. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ స్టోరీ మరీ లాగ్ అయింది. ప్రేమకథ నుంచి మొదలుపెట్టి కూతురు పుట్టే వరకూ లాగడం అంత అవసరం కూడా లేదు. సింపుల్ గా వారిది అన్యోన్య దాంపత్యం అనేందుకు ఓ మాంటేజ్ సాంగ్ సరిపోయే రోజులివి. అలాగని ఇది వృథా అని చెప్పడం లేదు. బట్ ఈ స్థానంలో ప్రధాన కథపై కసరత్తు చేయడం.. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిష్‌ మెంట్స్ పై దృష్టి పెడితే ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండేది. అయితే సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ నుంచి కథనం కాస్త ఊపందుకుంటుంది. కానీ ఎప్పుడైతే అసలు పాయింట్ రివీల్అవుతుందో అప్పటి నుంచి సమంత యశోద చిత్రాన్నే గుర్తుకు తెస్తుంది. నరేష్‌ ఆ డెన్ లోకి వెళ్లడం.. వారిని కాపాడటం అంతా యశోద కథలానే కనిపిస్తుంది. అయినా ట్రాన్స్ జెండర్స్ కు సంబంధించిన పాయింట్ తో సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల ఎంగేజింగ్ గా నడిపించాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో చాలా కథలు వచ్చినా.. ఈ పాయింట్ కాస్త కొత్తగా కనిపిస్తుంది. నకిలీట్రాన్స్ జెండర్స్ తో ఫైట్ అదిరిపోయింది. ఓ రకంగా అసలు పాయింట్ కు దూరంగా ఉంటూ కొసరు కథనంతో మెప్పించాలని చూశారేమో అనిపిస్తుంది.


అయితే నటన పరంగా చూసుకుంటే ఇది నరేష్‌ ఒన్ మేన్ షో. లవర్ నుంచి సిన్సియర్ పోలీస్ గా, మెదడులో వ్యాధితో పాటు భార్య,పిల్లలు కనిపించడం లేదు అనే వేదనకు సంబంధించి వివిధ దశల్లో భిన్నమైన ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. ఫైట్ సీన్స్ లో అయితే ఇన్నాళ్లు మనం చూసింది ఈ అల్లరోడినేనా అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో కనిపించిన రక్త ప్రవాహం, కత్తి పోట్లు మాత్రం హారిబుల్. ఆ సీన్ కు అక్కడ అంత వయలెన్స్ కూడా అవసరమే కావడంతో ఆ బ్లడ్ షెడ్ మరీ ఇబ్బందిగా ఏం ఉండదు. కాకపోతే కావాల్సిన దానికంటే ఎక్కువే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు.

నరేష్‌ భార్యగా మిర్నా, కూతురుగా లక్కీపాత్ర చేసి పాప బాగా చేశారు. సపోర్టింగ్ రోల్ లో అందరి ఊహలకు భిన్నంగా శతృ పాత్ర సెటిల్డ్ గా ఉంది. అతను బాగా చేశాడు. డాక్టర్ గా ఇంద్రజ ఓకే. ఇక నరేష్‌ ముందు ఇంకే పాత్రా పెద్దగా రిజిస్టర్ కాదు అంటే అతను ఏ రేంజ్ లో చెలరేగిపోయి నటించాడో అర్థం చేసుకోవచ్చు.

టెక్నికల్ గా ఈ చిత్రానికి నేపథ్య సంగీతం పెద్ద హైలెట్. తన ఆర్ఆర్ తో అద్భుతమైన ఎలివేషన్స్ ఇచ్చాడు. పాటలు పెద్దగా రిజిస్టర్ కాలేదు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. ఫైట్స్ బావున్నాయి. మాటలు ఓకే. ఫస్ట్ హాఫ్‌ లో నిడివి తగ్గించి ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా విజయ్ కనకమేడల మోస్ట్ సక్సెస్ ఫుల్ గా ద్వితీయ విఘ్నాన్ని దాటాడు అని చెప్పలేం కానీ.. ఫెయిల్ అయితే కాలేదు. అతన్నుంచి ఇంకాస్త ఎఫెక్టివ్ గా మరిన్ని ఇంటెన్స్ డ్రామాస్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

ఫైనల్ గా : నరేష్‌ నట ఉగ్రం

రేటింగ్ : 2.75/5

                - బాబురావు. కామళ్ల.

Related Posts