తెలుగులోనే కాదు.. ఇండియాలోనే సీక్వెల్స్ కు పెద్దగా విజయాలు లేవు. రీసెంట్ గా వచ్చిన దృశ్యం వరకూ మన దగ్గర సీక్వెల్స్ కూడా పెద్ద విజయాలు సాధించిన సినిమాలు చాలా తక్కువ. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలనుకున్నారేమో.. మన మేకర్స్ ఇప్పుడు పార్ట్స్ అంటూ మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటున్నారు. అంటే రెండు పార్ట్స్ కు మధ్య సంబంధాలు పూర్తిగా ఉండాల్సిన పనిలేదు.

దీంతో ఇవి సీక్వెల్స్ కావు అంటున్నారు. అలా వస్తోన్న పార్ట్స్ మూవీనే హిట్. ఫస్ట్ పార్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకుడు. హీరో నాని నిర్మాత. ఇప్పుడీ దర్శక నిర్మాతలు హీరోను మార్చి సెకండ్ కేస్ గా హిట్2 అంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ఈ ట్రైలర్ చూస్తే ఈ పార్ట్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.


మామూలుగా ఈ మధ్య వచ్చే చాలా పోలీస్ కథలు ఏదైనా మిస్టరీని ఛేదించడం అనే నేపథ్యంలోనే సాగుతున్నాయి. హిట్ అలాంటిదే. ఇప్పుడీ సెకండ్ పార్ట్ కూడా అలాగే కనిపిస్తోంది. చాలా దారుణంగా హత్యకు గురైన ఒక అమ్మాయి కి సంబంధించి మొదలైన ఇన్వెస్టిగేషన్ లో ఒళ్లు గగుర్పొడిచేలా.. కేవలం ఆ శవంలో తల మాత్రమే వారు వెదుకుతున్న అమ్మాయిదనీ.. మిగతా భాగాలన్నీ ఒక్కో అమ్మాయికి సంబంధించినవి అని తెలుస్తుంది. మరి ఇలాంటి వరుస హత్యలు చేస్తున్నది ఎవరు.. వారి మోటివ్ ఏంటీ అనేది హీరో తేల్చాల్సిన మేటర్. సో.. ఓ థ్రిల్లర్ సినిమాకు సరిపడా మెటీరియల్ ఈ ట్రైలర్ లోనే కనిపిస్తుంది. కథనం ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. హిట్2 .. హిట్ కావడం పెద్ద మేటర్ కాదు.


అయితే ట్రైలర్ ఆరంభంలో ఓ కేస్ ను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో డికే పాత్రలో నటించిన అడవి శేష్‌ ఆ హంతకుడికి ఉద్దేశిస్తూ.. వీళ్లు చాలా ఈజీగా దొరికిపోతారు.. “కోడిబుర్ర” వెధవలు అంటాడు. ఆ మాటను వరుస హత్యల తర్వాత ట్రైలర్ చివర్లో శేష్‌ ఇంట్లోనే రాస్తాడు హంతకుడు. ఇది అదిరిపోయింది. సో.. హీరో విలన మధ్య రేసీగా సాగే స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను అలరించబోతోంది అనుకోవచ్చు.


శేష సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఈ మూవీలో రావు రమేష్‌, కోమలి ప్రసాద్, తనికెళ్ల భరణి ఇతర కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీత దర్శకులు. డిసెంబర్ 2న విడుదల కాబోతోన్న హిట్ 2 ట్రైలర్ తోనే అంచనాలు పెంచిందని చెప్పాలి.