కొందరు హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేస్తూనే నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో మెరుస్తుంటారు. వీరు స్టార్డమ్ ను కూడా పెద్దగా కోరుకుంటున్నట్టు కనిపించరు. ఇలాంటి వారు ఏ ఇండస్ట్రీలో అయినా అరుదుగానే కనిపిస్తారు. నటిగానే కాక సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన గార్గి అనే ఓ మంచి సినిమా ఇబ్బందుల్లో ఉంటే నిర్మాతగానూ ఆకట్టుకున్న ఐశ్వర్య లక్ష్మి ఈ అరుదైన హీరోయిన్ల జాబితాలో చేరేలా కనిపిస్తోంది. ఎందుకంటే అమ్మడు పెద్దగా లైమ్ లైట్ లో కనిపించడం లేదు కానీ.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది ఐశ్వర్య లక్ష్మి. తన పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. ఆ వెంటనే నవీన్ చంద్రతో కలిసి అమ్ము అనే సినిమా చేసింది. ఇది ఓటిటిలో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా టైటిల్ పాత్రలో ఐశ్వర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాల్లో తన నటన గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు మరోసారి ఆ తరహా సినిమాతోనే ఆడియన్స్ ముందుకు రాబోతోందీ మళయాలీ బ్యూటీ.


ఐశ్వర్య లక్ష్మి చేస్తోన్న సినిమాలు మాత్రమే కాదు.. ఎంచుకుంటోన్న కథలు కూడా ఆకట్టుకుంటున్నాయి. అమ్ము తర్వాత ఇప్పుడు తను ‘కుమారి’గా వస్తోంది. అయితే ఇదో మైథలాజికల్ ఫాంటసీ మూవీ కావడం విశేషం. మామూలుగా ఇలాంటి చిత్రాల్లో ఎక్కువగా హీరోలే నటిస్తుంటారు. వారితోనే ఓపెనింగ్స్ సాధ్యమవుతాయి. అందుకేనేమో ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రగా వస్తోన్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు.

నిర్మల్ సహదేవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తనతో పాటు షైన్ టామ్ చాకో, సురభి లక్ష్మి ఇతర కీలక పాత్రలు చేశారు. ద ఫ్రెష్ లైమ్ సోడాస్ బ్యానర్ రూపొందిన కుమారి మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఈ శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోన్న కుమారితో అమ్ము ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. అమ్మడి సైలెంట్ దూకుడు మాత్రం చాలామందిని సర్ ప్రైజ్ చేస్తోంది.