సుధీర్ బాబు.. ఈ సారైనా మాయ చేస్తాడా మశ్చీంద్రా..

ఎప్పుడో ఒక హిట్ కొడుతూ.. ఎప్పుడూ ఫ్లాపులే చూసే హీరోలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. అందులో సుధీర్ బాబూ ఉంటాడు. అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమకథా చిత్రం హిట్ తో ఫేమ్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఏకంగా ఆరు ఫ్లాపులు. ఈ మధ్యలో భలే మంచి రోజు అనే ఫర్వాలేదు అనిపించే సినిమా ఒకటుంది.

అటుపై ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సమ్మోహనంతో మంచి విజయం అందుకున్నాడు. మరి ఇదైనా కంటిన్యూ అవుతుందా అనుకుంటే మళ్లీ వరుసగా ఐదు ఫ్లాపులు. వీటిలో నన్ను దోచుకుందువటే కాస్త ఫర్వాలేదనిపించే చిత్రం. రీసెంట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వచ్చాడు. బట్ అదేమంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో అతను ఎంత చెప్పినా ఎవరూ వినలేదు.

ఇక ఇప్పుడు మరో ప్రయోగంతో వస్తున్నాడు. అదే ‘మాయా మశ్చీంద్రా’. నటుడుగా విభిన్న పాత్రలతో మెప్పించి.. రచయితగానూ విజయాలు చూసిన హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకుడు. రచయితగా అతని గురించి తెలిసిన వారికి ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం కలిగితే ఆశ్చర్యం లేదు. అది నిజమే అన్నట్టుగా ఉంది లేటెస్ట్ గా విడుదల చేసిన టీజర్.


మాయా మశ్చీంద్రా.. అనే టైటిల్ కు తగ్గట్టుగానే కొత్తగా ఉంది ఈ టీజర్. సుధీర్ బాబు మూడు భిన్నమైన గెటప్స్ లో ఉన్నాడు. అందులో ఒకటి వయసు మళ్లిన పాత్ర, మరోటి బొద్దుగా ఫ్యామిలీ ప్యాక్ తో కనిపించే పాత్రా కావడం విశేషం. ఈ మూడు పాత్రల మధ్య కనెక్టివిటీని కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు టీజర్ లో. ముఖ్యంగా వయసు మళ్లిన పాత్రలోని వ్యక్తి మిగతా ఇద్దరినీ చంపాలనుకుంటాడు.

ఇది చాలా ఆసక్తిగా ఉంది. సుధీర్ సరసన మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. వీళ్ల పాత్రలకూ మంచి ప్రాధాన్యమే ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే దర్శకుడు హర్షవర్ధన్ కూడా పెద్దాయన అసిస్టెంట్ లాంటి పాత్రలో కనిపిస్తున్నాడు. ఎలా చూసినా ఈ టీజర్ ఆకట్టుకునేలానే ఉందని చెప్పొచ్చు. మరి ఈ మూవీతో అయినా సుధీర్ బాబు ఓ మంచి హిట్ కొడతాడేమో చూడాలి.

Related Posts