కండలతో కాలేదని.. ఒళ్లు పెంచిన సుధీర్ బాబు

ఏ పనిలో అయినా.. పరిశ్రమలో అయినా ఒళ్లొంచి(అఫ్‌ కోర్స్ బుర్ర కూడా వాడాలనుకోండి) కష్టపడితేనే అనుకున్న ఫలితం వస్తుంది. అయితే సినిమా హీరోలకు సంబంధించి పాత్రలను బట్టి ఒళ్లు వంచాల్సి ఉంటుంది. అంటే పోలీస్ లేదా ఆర్మీ రోల్ అంటే చాలు.. బాడీ స్టిఫ్ గా ఉంచేందుకు జిమ్ కు చెమటలు చిందిస్తారు. కొందరైతే సిక్స్ ప్యాక్ లు చేసి ఆ పాత్రను పర్ఫెక్ట్ గా పోట్రే చేస్తారు.

ఇలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి రకరకాల సినిమాలతో తనదైన దారిలో వెళుతున్న హీరో సుధీర్ బాబు. ఉండటానికి సూపర్ స్టార్ కృష్ణగారి అల్లుడు, మహేష్‌ బాబు బావ అనే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. తనదైన రూట్ లోనే హీరోగా సెట్ అయ్యే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే సక్సెస్ కోసం సిక్స్ ప్యాక్ లు చేశాడు. ఓ రేంజ్ లో డ్యాన్స్ లు నేర్చుకున్నాడు.

అయితే ఇవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా అతని సిక్స్ ప్యాక్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ మధ్య అతని సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన హంట్ దారుణంగా బాల్చీ తన్నేసింది. అందుకే ఈ సారి రూట్ మార్చాడు. కండలు పెంచే పని పక్కన బెట్టి బాడీ పెంచే పనిలో పడ్డాడు.


ప్రస్తుతం సుధీర్ బాబు “మామా మశ్చీంద్రా” అనే సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ లుక్ చూసిన చాలామంది షాక్ అయిపోతున్నారు. మొన్నటికి మొన్న సిక్స్ ప్యాక్‌, ఎయిట్ ప్యాక్ వరకూ వెళ్లిన సుధీర్ బాబు సడెన్ గా బోండాంలా మారిపోయాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన అల్లరి నరేష్ మూవీని గుర్తుకు తెచ్చేలా గెటప్ మార్చేశాడు.

ఇక మొహమైతే తరచి చూస్తే తప్ప గుర్తు పట్టలేని విధంగా బుగ్గలు పెంచాడు. ఈ మూవీలో అతను దుర్గా, పరశురామ్, డిజే అనే మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని టాక్. ప్రస్తతుం ఇదైతే దుర్గా పాత్ర లుక్. మరి మిగతా పాత్రలకు సంబంధించిన స్టిల్స్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తారట.

అతని లుక్ ఎలా ఉన్నా.. ఈ టైటిల్ తో పాటు అతని పేరు చూస్తే ఇదీ మాస్ మూవీయే అనిపిస్తోంది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేసేలా ఉన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తారట. మరి మారిన లుక్ అయినా సుధీర్ బాబుకు ఓ హిట్ ఇస్తుందేమో చూడాలి.

Related Posts