స్టార్స్ కోసం స్టార్ విలన్స్

ఒకప్పుడు ఇండియన్ సినిమాకు ముఖచిత్రంగా కనిపించింది బాలీవుడ్ మాత్రమే. ఆ ముఖ చిత్రాన్ని రాజమౌళి మార్చాడు. ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమానే అన్నట్టుగా చేశాడు. అతనికి తోడుగా వరుసగా వచ్చిన కెజీఎఫ్, ఆర్ఆర్ఆర్ తో పాటు కాంతార వంటి చిత్రాలు కూడా సత్తా చాటడం.. అదే టైమ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా స్లంప్ లో పడిపోవడంతో ప్రపంచం అంతా ఇండియన్ సినిమా అంటే మనవైపే చూసింది. దీంతో అనివార్యంగా బాలీవుడ్ కూడా ఇప్పుడు సౌత్, నార్త్ అన్న బారికేడ్స్ ను తొలగించి ఇండియన్ సినిమా అన్న ట్యాగ్ కు ఫిక్స్ అయిపోయింది.

అలా వచ్చిన పఠాన్ ను మనవాళ్లు కూడా హిట్ చేశారు. అయితే ప్రస్తుతం సౌత్ లో రూపొందుతోన్న సినిమాలకు నార్త్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. ఆ కారణంగానే మన స్టార్ హీరోలతో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం రజినీకాంత్ నటించిన పేటా అనే సినిమాలో బాలీవుడ్ టాప్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ గా నటించాడు. అంతకు ముందు అతన్ని చాలామంది ట్రై చేసినా కుదర్లేదు. బట్ పేటాలో విలన్ గా అదరగొట్టాడు. ప్రస్తుతం తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నాడు నవాజుద్దీన్. వెంకటేష్‌ 75వ సినిమాగా వస్తోన్న సైంధవ్ లో అతనో కీలక పాత్ర చేస్తున్నాడు.

ఇది విలనా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక కెజీఎఫ్ రెండో చాప్టర్ కు యశ్ తర్వాత బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచింది డౌటే లేకుండా సంజయ్ దత్ అని చెప్పాల్సిందే. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోగా వెలిగిన సంజయ్ దత్ కెజీఎఫ్ 2లో భయంకరమైన విలన్ గా నటించి ఈ మూవీ సక్సెస్ లో మేజర్ షేర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా వస్తోన్న ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు. చెప్పడానికి బాలీవుడ్ మూవీ అంటున్నా.. హీరో మనోడే కదా.. అందుకే అతను మన హీరోకు విలన్ అనొచ్చు. క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతోన్న హరిహర వీరమల్లుతో బాబీ డియోల్ తెలుగులోకి విలన్ గా వస్తున్నాడు.

ఒకప్పుడు బాబీ డియోల్ బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా ఆకట్టుకున్నాడు. అలాంటి తను విలన్ గా మారాడంటే కారణం కంటెంటే కదా..? ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. మనం సినిమాలో గెస్ట్ గా కనిపించాడు.

సైరా నరసింహారెడ్డిలో ఓ కీలక పాత్ర చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే లోనూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. చాలామంది అది విలన్ రోల్ అంటుండటం విశేషం.

ఇదే టైమ్ లో అభిషేక్ బచ్చన్ సైతం సౌత్ లో విలన్ గా నటించేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అనే టాక్ ఉంది. మొత్తంగా బాలీవుడ్ స్టార్స్.. మన సౌత్ స్టార్స్ ను విలన్స్ గా ఢీ కొట్టేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారన్నమాట.

Related Posts