సార్ మూవీ రివ్యూ

రివ్యూ : సార్
తారాగణం : ధనుష్‌, సంయుక్త మీనన్, సముద్రఖని, సాయికుమార్, తినకెళ్ల భరణి, ఆడుకాలం నరేన్
సినిమాటోగ్రఫీ : జె యువరాజ్
సంగీతం :
జివి ప్రకాష్‌ కుమార్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : వెంకీ అట్లూరి

కొన్ని సినిమాల విషయంలో కాంబినేషన్స్ ఆసక్తిని పెంచుతాయి. ట్రైలర్స్, లేదా టీజర్స్ చూసిన తర్వాత కంటెంట్ కూడా ఇంట్రెస్ట్ పెంచుతుంది. అన్నీ దాటుకుని ఆడియన్స్ ముందుకు వస్తే కానీ ఆ సినిమాల్లో దమ్మెంత అనేది ప్రేక్షకులకు తెలియదు. దానికంటే ముందు అంచనాలు పెంచడం ఇంపార్టెంట్ కదా..? ఆ విషయంలో మరీ బెస్ట్ అని చెప్పలేం కానీ.. చాలామందిలో ఈ సినిమా చూడాలి అన్న ఆసక్తిని పెంచింది సార్ మూవీ. ధనుష్ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ కావడం, సితార బ్యానర్ లో రూపొందడంతో పాటు ఇదే బ్యానర్లో అంతకు ముందు రంగ్ దే అనే చిత్రం తీసిన వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో కొంత వరకూ అంచనాలున్నాయి. మరి వాటిని ఈ సార్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం.

కథ :
2022 .. ఓ కార్పోరేట్ కాలేజ్ లెక్చరరల్ స్టూడెంట్స్ కు ఓ లెసన్ చెప్పి.. హోమ్ వర్క్ కూడా ఇస్తాడు. అసలు పాఠమే అర్థం కాని వారికి హోమ్ వర్క్ అంటే చిరాకు పడతారు. కట్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కాలేజ్ ఫీజ్ కట్టడానికి అతని తండ్రి తన తండ్రి నుంచి వచ్చిన ఓ వీడియో షాప్ ను అమ్మేస్తున్నాడు అని తెలిసి దాన్ని క్లీన్ చేసేందుకు వెళతారు. అలా వెళ్లిన వారికి అక్కడ కొన్ని వీడియో క్యాసెట్స్ దొరుకుతాయి. మొదట అవి అడల్ట్ కంటెంట్ అనుకున్నవారికి తీరా చూస్తే అందులో ఎమ్సెట్ పాఠాలు చెబుతోన్న ఓ సార్ కనిపిస్తాడు. అతని గురించి ఆరా తీస్తూ వెళితే కర్నూలు కలెక్టర్ వద్దకు వెళితే తెలుస్తాయి అని తెలుసుకుని.. అక్కడికి వెళ్లి.. ఈ సార్ గురించి ఆరా తీస్తారు. అప్పుడు ఆ కలెక్టర్.. అతను మా సార్.. నేను కలెక్టర్ గా ఉన్నానంటే కారణం ఆయనే అంటూ ఆ సార్ గురించి చెప్పడం మొదలుపెడతాడు. మరి ఆ సార్ ఎవరు..? ఈ కలెక్టర్ కు ఆ సార్ కు ఉన్న సంబంధం ఏంటీ..? అసలు ఎమ్సెట్ పాఠాలు వీడియో క్యాసెట్స్ లో ఉండటం వెనక కారణం ఏంటీ అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ఓ మంచి దర్శకుడి లక్షణం కథను ఎత్తుకోవడంలోనే తెలుస్తుంది. ఆ విషయంలో వెంకీ అట్లూరి సార్ ను సరిగ్గానే స్టార్ట్ చేశాడు. ఆ సార్ గురించి తెలుసుకోవాలన్న తపన ఆ పావుగంటలోనే ప్రేక్షకులకూ చాలాసార్లు అనిపించేలా చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాతే ఆ కథను అంతకు మించిన ఆసక్తిగా చెప్పడంలో తడబడ్డాడు. అలాగని ఇదేమీ తీసి పారేసే సినిమా కాదు. చాలా చాలా అంశాలను టచ్ చేస్తూ కథనం రాసుకున్నాడు. చాలా బలమైన చర్చకు సంబంధించిన ఆ అంశాలను చాలా చాలా లైటర్ వే లో తీయడంతో కథనంలో చిక్కదనం కొరవడింది. దీంతో సినిమా కూడా లైట్ గా మారిపోయింది. ఇక ఈ సార్ కథను చాలా గొప్పగా మొదలుపెట్టాడు వెంకీ. 1990ల్లో ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి చాలా దేశాలు సరళీకృకృత ఆర్థిక విధానాలకు గేట్లు తెరిచాయి. అన్ని రంగాల్లోనూ ప్రైవేటైజేషన్ మొదలైంది. దాని ఫలితంగా అప్పటి వరకూ ప్రజలకు ఉచితంగా లభించిన విద్య, వైద్యం ప్రైవేట్ పరం అయ్యాయి. దర్శకుడు విద్యను ఎంచుకున్నాడు. ఆర్థిక మాంద్యం ఫలితంగా వచ్చిన అవకాశాన్ని వ్యాపారంగా మార్చుకునేందుకు త్రిపాఠి(సముద్రఖని) లాంటి వ్యక్తులు సిండికేట్ గా మారతారు. తద్వారా ప్రభుత్వ విద్య కుంటుపడుతుంది.

అంతా ప్రైవేట్ పరం కావడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. దాని వల్ల ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనుకుంటుంది. దానికంటే ముందే ఈ ప్రైవేట్ విద్యాసంస్థల వాళ్లు సిండికేట్ గా మారి “ఎయిడెడ్”(దర్శకుడు ఈ విషయాన్ని నేరుగా చెప్పే ధైర్యం చేయలేకపోయాడు) విద్యా విధానాన్ని తెస్తారు. దీంతో తామే కొందరు లెక్చరర్స్ ను ఆ కాలేజ్ లకు పంపించి.. అక్కడ రిజల్ట్స్ లేకుండా చేయడం ద్వారా పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకుంటారు. అలా సిరిపురం అనే కాలేజ్ కు మ్యాథ్స్ లెక్చరర్ గా పంపించబడతాడు బాలగంగాధర తిలక్ అలియాస్ బాలు(ధనుష్‌). ఆదర్శ భావాలున్న బాలు.. అస్తవ్యస్తంగా ఉన్న ఆ ఊరి కాలేజ్ ను బాగు చేస్తాడు. సహజంగానే మన సౌత్ హీరోల్లాగా చిన్న లెక్చర్స్ తో అందరినీ మారు్స్తాడు. కట్ చేస్తే అసలెవరూ లేని ఆ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ లో అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా చేస్తాడు. ఇది నచ్చని త్రిపాఠి వచ్చి వార్నింగ్ ఇస్తారు. ఎవరూ పాస్ కావొద్దు అని. అందుకు ప్రతిగా.. అందరినీ ఎమ్సెట్ లో కూడా ర్యాంక్ లు తెప్పిస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. మరి ఆ ఛాలెంజ్ లో హీరో ఎలా నెగ్గాడు అని సగటు తెలుగు సినిమాలు చూసే ఎవరికైనా సులువుగా ఊహించేలానే కథనం రాసుకున్నాడు దర్శకుడు.


ఇక కథనం పరంగా చూస్తే ఇదేమంత కొత్తదనం లేని సినిమా. మ్యాథ్స్ లెక్చరర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ పాఠాలు చెప్పడం వరకూ ఓకే. కానీ అతని పాఠాల వల్లే మెడిసిన్ లో కూడా సీట్స్ రావడం ఏంటో అర్థం కాదు. ఒకవేళ బయాలజీ టీజర్(సంయుక్త మీనన్)ఉన్నా.. ఆమెకు పాఠాలు చెప్పే ఆస్కారం ఇవ్వలేదు దర్శకుడు. పైగా ఇంగ్లీష్ లో వీక్ అని చెప్పుకున్న హీరో.. ఇంగ్లీష్ లోనే విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాడు. నిజానికి ఇప్పటికీ చాలా గవర్నమెంట్ కాలేజెస్ లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్‌ పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. కానీ 2002లోనే చెప్పినట్టు చూపించాడు దర్శకుడు. ఇదో పెద్ద మైనస్. ఒక్కోసారి బాలీవుడ్ సూపర్ 30ని గుర్తుకు తెస్తూ.. ఒక్కోసారి చాలా సినిమాల్లోని సీన్స్ ను గుర్తుకు తెస్తూ.. అప్పుడప్పుడూ హీరోయిజం.. మరోకొన్నిసార్లు హీరోను పూర్తి నిస్సహాయుడుగా చూపిస్తూ కథనం అంతా కంగాళీగానే కనిపిస్తుంది. నిజానికి ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడిని గురించిన సినిమాలు ఇప్పటికే అనేకం వచ్చాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏంటీ అంటే.. ఈ విషయం 20యేళ్ల క్రితమే చెప్పాము అని చెప్పడం. బట్ అది ఇప్పటికే అవుట్ డేటెడ్ అయిపోయింది. ప్రైమరీ స్కూల్స్ కే ఆస్తులు అమ్ముకుంటున్న రోజుల్లో ఈ విషయం చెప్పడం వల్ల కథలోయిన మెయిన్ పాయింట్ ఏ మాత్రం కనెక్ట్ కాకపోగా.. హీరో ప్రయత్నమంతా సిల్లీగా అనిపిస్తుంది. ఇక ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ కనిపించకుండా చేసే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఎయిడెడ్ విద్యావ్యవస్థ గురించి దర్శకుడుకి కనీస అవగాహన ఉంటుందని కూడా అనుకోలేం.


అయితే ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ కు సంబంధించిన సీన్స్, కాలేజ్ లో క్యాస్ట్ గురించిన క్లాస్ లు, ఇంటర్వెల్ బ్యాంగ్, పిల్లలు తమ లెక్చరర్ కు బాసటగా నిలిచే సన్నివేశాలు బావున్నా.. వీడియో క్యాసెట్స్ ద్వారా పాఠాలు చెప్పి సినిమా థియేటర్స్ లో ప్రదర్శించడం అనేది అత్యంత కృతకంగా, పూర్తి అసంబద్ధంగా కనిపిస్తుంది.
కొన్ని డైలాగ్స్ బావున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసి అమెరికా పంపిస్తాం అని సాయికుమార్ పాత్ర అంటే.. ఎవరో తీసుకువెళితే కాదు.. మేం చదువుకుని మా శక్తితో అమెరికా వెళతాం అని అతని కూతురుతో చెప్పించిన మాట అమ్మాయిల స్థైర్యాన్ని పెంచుతుంది. ఓవరాల్ గా చాలాసార్లు చూసిన కథనే ధనుష్‌ అనే పెద్ద స్టార్ తో చెప్పించాలని చేసిన ప్రయత్నం అస్సలు బాలేదు అని చెప్పలేం కానీ.. చాలా అంశాలను లైట్ తీసుకుని.. సినిమాటిక్ లిబర్టీస్ ను అత్యధికంగా వాడేసుకుంటూనే.. అనవసరంగానూ వాడుకున్నారు అనిపిస్తుంది. అయినా బోర్ లేకుండా ఓ సారి చూసేయొచ్చు.


నటన పరంగా బాలు పాత్రలో ధనుష్‌ ఒదిగిపోయాడు. బయాలజీ టీచర్ మీనాక్షిగా సంయుక్త హుందాగా కనిపించింది. ఆది పాత్ర అర్థాంతరంగా ముగించారు. సముద్రఖని, ఆడుకాలం నరేన్ కు మాత్రమే కాస్త పెద్ద పాత్రలు దక్కాయి. సాయికుమార్ ది రొటీన్ రోల్. గెస్ట్ పాత్రలో సుమంత్, భారతీరాజా సరిగ్గా సరిపోయారు. మిగతా పాత్రలన్నీ వెరీ రొటీన్.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. 2002 నాటి కాలాన్ని చూపించేలా ఆర్ట్ వర్క్, సెట్స్ చాలా బావున్నాయి. కాస్ట్యూమ్స్ సైతం మెప్పిస్తాయి. ఎడిటింగ్ ఇంకా ట్రిమ్ చేయొచ్చు. అది దర్శకుడు ఛాయిస్ కాబట్టి ఎడిటర్ ను ఏమీ అనలేం. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా రాజీపడ్డట్టు కనిపించలేదు. ఇకదర్శకుడుగా వెంకీ అట్లూరి ఎంచుకున్న కథలో సరళీకృత ఆర్థిక విధానాలు భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత విద్యావ్యవస్థ ఎలా వ్యాపారంగా మారింది అని చెప్పాలనేది ప్రధాన పాయింట్ గా కనిపిస్తుంది. కానీ దాన్ని అంతే ప్రభావవంతంగా చెప్పడంలో పాతికశాతమే సక్సెస్ అయ్యాడు.

ఫైనల్ గా : సార్ సబ్జెక్ట్ బావుంది. పాఠమే ఇంకా బాగా చెప్పి ఉండొచ్చు.

రేటింగ్ : 3/5

                        - యశ్వంత్ బాబు. కె

Related Posts