రజాకార్‌ మూవీ రివ్యూ

రజాకార్.. ఈ మూవీ ఈ మధ్య కాలంలో రిలీజ్‌కు ముందే చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ వైపు కాంట్రవర్శీతో పాటు ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. యాటా సత్యనారాయణ డైరెక్షన్‌లో గూడూరు నారాయణరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది ? ప్రమోషనల్ వీడియోస్‌తో క్రియేట్ చేసి బజ్‌ కు తగ్గట్టే ఉందా లేదా అనేది ఈ సినిమాలో చూద్దాం.

కథ : భారత స్వాతంత్ర్యం తర్వాత నిజాం సంస్థానాన్ని స్వంత దేశంగా ఏర్పాటు చేసుకుని తుర్కిస్తాన్ పేరుతో పాలించాలని నిజాం ఏడవ రాజు ప్రయత్నిస్తాడు. అందుకు అంతా ఒకే కమ్యూనిటీగా ఉండాలనే నియమం ఉండటంతో బలవంతంగా హిందువులను మతం మార్పించడానికి రజాకార్ల వ్యవస్థను ఉపయోగిస్తాడు. వారు చేసే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. శిస్తు కట్టనివారిని కొట్టి చంపడం, మతం మారని లేడీస్‌ని మానభంగాలు చేయడం, హత్యలు చేయడం చెప్పలేని దారుణాలు చేస్తుంటారు. ఆగడాలు పెచ్చుమీరుతున్న తరుణంలో వారికి ఐలమ్మ(ఇంద్రజ) రాజిరెడ్డి (బాబీసింహ) గూడూరు నారాయణ వంటి విప్లవకారులు ఎదురుతిరుగుతారు. భారత హోం మంత్రి సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ (తేజ్‌ సప్రు) ఈ తతంగాన్ని గమనిస్తూ.. చర్యలు తీసుకోవాలనుకుంటాడు. కానీ ప్రధాని నెహ్రూ మాత్రం వేచి చూద్దాం అని చెప్తుంటాడు. ఈ క్రమంలో నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమయ్యిందనేది తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ : తెలంగాణ సాయుధ పోరాటం అనే కాన్సెప్ట్‌ చాలా పెద్దది. అదంతా రెండున్నర గంటల వ్యవధిలో తెరపై చూపించడం అంతా ఆషామాషీ విషయం కాదు. కానీ దర్శకుడు యాటా సత్యనారాయణ మాత్రం ఈ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. కాశ్మీర్‌ ఫైల్స్, కేరళ స్టోరీస్‌ తరహాలో జరిగిన యథార్ధాన్ని ఆసక్తికరంగా ఇంకా చెప్పాలంటే ప్రేక్షకుడు గుండె కదిలేలా తీసాడని చెప్పొచ్చు. చరిత్రలో జరిగిన సంఘటనలను సినిమాగా తీయడానికి చాలా రిస్ట్రిక్షన్స్ వుంటాయి. చెప్పడానికి వీల్లేని , చూపించడానికి వీలుపడని ఎన్నో ఘటనలను సెన్సార్ రూల్స్ ను దాటి, ఇతర పక్షాల విమర్శలకు గురి కాకుండా.. సాధారణ ప్రేక్షకుడు మెచ్చే పూతలు అద్దుతూ తీయడం దర్శకుడికి సవాలే. అయితే ఆ పనిని యాటా సత్యనారాయణ చాలా చక్కగా నిర్వర్తించాడు.
నాటి రజాకార్ల ఉదంతాలను, వారు చేసిన దారుణాలను చూస్తున్న ప్రేక్షకుడి రక్తం మరిగిపోయేలా చిత్రీకరించాడు దర్శకుడు యాటా. మతం మార్పిడి కోసం రజాకార్లు చేసే అరచకాలు కంటతడి పెట్టిస్తాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం.. లాంటి సన్నివేశాలు హృదయాలను బరువెక్కిస్తాయి. అనసూయ బతుకమ్మ పాట ఫస్టాఫ్‌కే హైలెట్‌. రజాకార్ల దాడి ప్రస్థావన వస్తే అందరికి గుర్తొచ్చేది కమ్యునిస్టులు. కానీ ఈ సినిమాలో వారిని హైలెట్‌ చేసి చూపించలేదు. పైగా రజాకార్ల వ్యవస్థను అంతం చేసేందుకు బయలుదేరిన భారత సైన్యాన్ని తెలంగాణ ప్రజలంతా మద్దతుగా నిలిస్తే.. ఆ సమయంలో కమ్యునిస్టులు సైలెంట్‌ అయిపోయినట్లుగా ఓ డైలాగుతో చెప్పించారు. కానీ చివరిలో మాత్రం ఓ పాటతో కమ్యునిస్టులు చేసిన పోరాటాలను గుర్తు చేశారు. సినిమా ముగిసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని గుర్తు చేస్తూ వచ్చే పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.

నటీనటులు :
ఐలమ్మగా ఇంద్రజ, రాజిరెడ్డిగా బాబీ సింహ అద్భుతంగా నటించారు. కొన్నింటిని కొత్తవారు పోషించారు. అయితే తెరపై మాత్రం అందరూ ఎంతో అనుభవం ఉన్నవారిలాగే నటించారు. ఇక విలన్‌ ఖాసీం రజ్వీ పాత్రలో రాజ్‌అర్జున్‌ ఒదిగిపోయాడు. సినిమాలో అతని పాత్రే హైలెట్‌. నిజాం ఏడో రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాత్రకు మకరంద్‌ పాండే న్యాయం చేశాడు. అనసూయ కనిపించేది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర గుర్తిండిపోతుంది. ప్రేమ, వేదిక కూడా డిఫరెంట్‌ పాత్రలు పోషించారు. యాక్షన్‌ సన్నివేశాల్లో వారిద్దరు అదరగొట్టేశారు. ఇక వల్లభాయ్‌ పటేల్‌గా తేజ్‌ సప్రు చక్కగా నటించాడు. తెరపై అచ్చం వల్లభాయ్‌ పటేల్‌లాగే కనిపించాడు. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

టెక్నిషియన్స్‌:
ఈ చరిత్రను తెరకెక్కించే సాహసం చేయడంతో పాటు ఆ ప్రయత్నంలో సక్సెస్‌ అయిన దర్శకుడు యాటా సత్యనారాయణకు ఫుల్ మార్క్స్ ఇవ్వొచ్చు.
ఈ సినిమాకి ప్రధాన బలం మ్యూజిక్ . భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో పాటు బతుకమ్మ సాంగ్, జోహార్లు సాంగ్ కట్టిపడేస్తాయి. సినిమాటోగ్రఫీ మరో హైలెట్, తమ్మిరాజు ఎడిటింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

బోటమ్‌ లైన్ : చరిత్రను కళ్లకు కట్టిన ‘రజాకార్’

Related Posts