రవితేజ, గోపీచంద్ మోసం చేశారు.. ఆ కథ నాదే..

కథా చౌర్యం అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతోంది. కాస్త బలం ఉన్నవాళ్లు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు లేని వాళ్లు లోపల్లోపల కుమిలిపోతున్నారు. మరి ఈ చౌర్యంలో వాస్తవాలేంటీ అనేది చెప్పలేం కానీ.. ఆ మధ్య ఆచార్య కథ నాదే అంటూ ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. ఓ టివి ఛానల్ లైవ్ కు వెళ్లి.. ఆ లైవ్ లో ఉన్న దర్శకుడు ఆచార్యతో నానా వాదనలూ చేశాడు. ఏమైతేనేం.. ఆచార్య పోయింది. ఆ కథ గొడవా పక్కకు వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మరో గొడవ వచ్చింది. ఈ సారి ‘‘క్రాక్’’ సినిమా కథ నాదే అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ కంప్లైంట్ చేశాడు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు ఒప్పుకున్నాడు రవితేజ. అయితే క్రాక్ వచ్చిన దాదాపు యేడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆ కథ నాదే అనడం కాస్త అతిశయంగా ఉన్నా.. ఏమో.. ఏ పేజీలో ఎవరి కథ ఉందో ఎవరికి తెలుసు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరూ అంటే..?

అతని పేరు పోతుకాచి శివసుబ్రహ్మణ్య మూర్తి. ఇతను 2015లో ‘‘బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ’’ అనే పుస్తకాన్ని రాసి తనే ప్రచురించాడట. ఈ పుస్తకాన్ని అప్పటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించానని కూడా చెబుతున్నాడు. అయితే ఈ క్రాక్ టైటిల్ తో పాటు కథ కూడా అతనిదేనట. అప్పట్లో కేవలం టైటిల్ మాత్రమే వాడుకుంటున్నారు అనుకున్నాడట. కానీ సినిమా చూసిన తర్వాతే అతనికి అది తన పుస్తకంలోని ప్రచురించినవే అని అర్థమైందంటున్నారు. కథ, కథనంతో పాటు హీరో పేరు కూడా తన పుస్తకంలోనిదే అంటూ ఇప్పుడు కోర్ట్ మెట్లు ఎక్కాడు.

హై కోర్ట్ అడ్వోకేట్ తో క్రాక్ చిత్రి నిర్మాత మధుసూదన్ రెడ్డి, దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజలతో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ ఛాంబర్స్ వారికి కాపీరైట్ ఉల్లంఘన చట్టం కింద లీగల్ నోటీస్ లు జారీ చేయించాడట. అయితే ఆ నోటీస్ లను క్రాక్ సినిమా హీరో, నిర్మాత, దర్శకుడు స్వీకరించకుండా తిప్పి పంపించారని వాపోతున్నాడు. ఇక తను పంపించిన లీగల్ నోటీస్ లకు స్పందన లేకపోవడంతో క్రాక్ కథ తనదే అంటోన్న శివ సుబ్రహ్మణ్య మూర్తి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఈ గొడవ ఎప్పుడు మొదలైందీ.. ఇప్పుడే ఎందుకు హైలెట్ అవుతుందీ అనేది చెప్పలేం కానీ.. ఈ కంప్లైంట్ కు సంబంధించి క్రాక్ మూవీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Related Posts