రామబాణం


తారాగణం: గోపీచంద్, జగపతిబాబు, ఖుష్బూ, డింపుల్ హయాతి, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళని స్వామి
కథ :భూపతిరాజా
నిర్మాత : టి.జి. విశ్వప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీవాస్

కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఒక రకమైన ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఆ ట్రెండ్ లో గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు పెద్ద విజయం సాధించాయి. వీటిలో లక్ష్యం సినిమాలో అప్పుడు జగపతిబాబు .. గోపీచంద్‌ కు అన్నగా నటించాడు. ఇప్పుడు అదే జగ్గూ భాయ్ ని మళ్లీ రిపీట్ చేస్తూ.. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో రామబాణం అనౌన్స్ అయినప్పుడు అంచనాలు వచ్చాయి. ట్రైలర్ రెగ్యులర్ గా ఉన్నా.. ప్రమోషన్స్ తో మరిన్ని అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. మరి వీరి ప్రయత్నం ఫలించిందా..? ప్రమోషన్స్ లో చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారా లేదా అనేది చూద్దాం.

కథ :
రాజారామ్(జగపతిబాబు), భువనేశ్వరి(ఖుష్బూ) దంపతులు. రాజారామ్ తమ్ముడు విక్కీ(గోపీచంద్). రాజారామ్ సాత్వికుడు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలతో తక్కువ రేట్ కే హోటెల్ నడుపుతుంటాడు. అది గిట్టని పాపారావు(నాజర్)అతన్ని బెదిరించి లైసెన్స్ లాక్కుని వెళతాడు. పోలీస్ లతో కుమ్మక్కయ్యి రాజారామ్ ను అవమానిస్తాడు. రాజారామ్ కు పూర్తి భిన్నంగా కాస్త అగ్రెసివ్ గా ఉంటాడు విక్కీ. పాపారావు గోడౌన్ తగులబెట్టి లైసెన్స్ తీసుకువస్తాడు. ఇది నచ్చని అతని అన్న పోలీస్ లకు అప్పగించడానికి తీసుకువెళుతుంటే తప్పించుకుని కలకత్తా పారిపోతాడు. అక్కడ ఓ డాన్ తో కలిసి తనూ ఓ పెద్ద డాన్ గా ఎదుగుతాడు. ఇటు తమ్ముడి కోసం రోజూ ఎదురుచూస్తుంటాడు రాజారామ్. విక్కీ కలకత్తాలోనే భైరవి(డింపుల్)ని ప్రేమిస్తాడు. పెళ్లి విషయానికి వస్తే ఆమె పేరెంట్స్ కుటుంబం ఉంటేనే అమ్మాయిని ఇస్తాం అని చెబుతాడు. ప్రేమకోసం మళ్లీ సొంత ఊరికి వస్తాడు విక్కీ. అక్కడికి వచ్చాక అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వాటి వల్ల తన అన్న ప్రమాదంలో ఉన్నాడని అర్థం అవుతుంది. మరి అవేంటీ..? రాజారామ్ ను విక్కీ కాపాడాడా..? చివరికి వీరి కథ ఏమైందీ అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ :
ప్రతి భాషలోనూ సినిమాలకు సంబంధించి కొన్ని ఫార్ములాలుంటాయి. ఒక ఫైట్, ఒక పాట, కామెడీ సీన్, సెంటిమెంట్ సీన్, మళ్లీ ఫైట్, పాట.. ఇలా.. రామబాణం.. ఈ ఫార్ములాను అచ్చంగా ఫాలో అయిపోయింది. అయితే ఫార్ములా ఎలా ఉన్నా ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఆడియన్స్ పాత పద్ధతిలో ఉన్నా కొత్తగా మెచ్చుకుంటారు. బట్ రామబాణం విషయంలో అది జరిగిందా అంటే వందశాతం అవునని చెప్పలేం. కథలోనే కాదు.. కథనంలో కూడా అనేక లోపాలున్నాయి.

అసలు భూపతిరాజా అనే కథకుడి నుంచి కొత్త కథ ఆశించడమే తప్పు అన్నట్టుగా చాలా పాత కథనే రకరకాలుగా చెప్పాలని చూశాడు. పైగా సేంద్రియ పద్ధతి గురించి.. ఆల్రెడీ భీష్మ అనే సినిమా వచ్చింది. అందులోనూ కొందరు దాన్ని వ్యతిరేకిస్తుంటారు. వాళ్లు విలన్స్ అన్నమాట. అక్కడ పెద్దాయనకు అండగా నితిన్ ఉన్నట్టు ఇక్కడ అన్న కోసం గోపీచంద్ ఉంటాడు. అంతే. ఒక్క ప్రేమకథ తప్ప మిగతా అంతా సేమ్.

కాకపోతే హీరోగోపీచంద్ కాబట్టి.. భారీ ఫైట్స్ ఉండాలి కాబట్టి పెట్టేశారు అన్నట్టుగా ఉంది తప్ప.. అవేవీ సహజంగా కనిపించవు. అయినా ఫార్ములా ప్రకారం సాగే సన్నివేశాలు కాబట్టి.. రొటీన్ గా ఉన్నా మరీ బోర్ కొట్టవు. వెన్నెల కిశోర్ తో చేయించిన కామెడీకి కాలం చెల్లి దశాబ్ధం అవుతోంది. యాక్షన్ లోని బౌన్స్ లు కూడా పాతవే.


కలకత్తా ఎపిసోడ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి అనాథ నుంచి డాన్ గా మారే కథలు అన్ని భాషల్లోనూ అనేకం వచ్చి ఉన్నాయి. ఇక హీరోయిన్ ను వీడియో వ్లాగర్ అన్నారు. ఆమె కెమెరా పట్టుకుని కనిపించడమే తప్ప ఏ ప్రత్యేకతా లేదా పాత్రకు. అలాంటి తనను చూసి హీరో ప్రేమలో పడటమే పెద్ద మైనస్ గా ఉంది. అదేదో హీరో చేసిన ఫైట్స్ చూసి హీరోయిన్నే ప్రేమలో పడిందంటే ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో.

విక్కీ కలకత్తా వదలి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ ఫైట్.. దాన్ని విలన్ లైవ్ లో చూడటం.. రీసెంట్ గానే వచ్చిన ఏజెంట్ లోనూ ఉంది. ఏదేమైనా సేంద్రియ పంటలు, అనాథ శరణాలయం లాంటి కథలే ఇంకా చూసేందుకు జనం సిద్ధంగా ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. కాకపోతే ఆర్గానిక్ ఫుడ్, మన పురాతన సంప్రదాయాలు చెప్పడానికి ఇప్పటికే అనేక యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అదే కంటెంట్ ను అవసరం లేని ఊరమాస్ మసాలాలు దట్టించి.. కథ విడిచి సాము చేస్తూ.. కథనంలో ఏ కొత్తదనం లేకుండా చెబుతాం అంటే కూడా చూసే ఆడియన్స్ ఉంటే అది ఆ దర్శకుడు, హీరో అదృష్టమే తప్ప మరోటి కాదు. ఏదేమైనా ఈ తరహా కథలు కొన్ని వేల వరకూ వచ్చాయి. అందులో మరోటి ఈ రామబాణం. అంతే తప్ప ఏ కొత్తదనమూ కనిపించదు.


అన్నదమ్ముల మధ్య ఎమోషన్ కూడా గొప్పగా ఎలివేట్ కాలేదు. ఒదిన మరిది మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఫర్వాలేదు. అయినా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ బి, సి సెంటర్ ఆడియన్స్ కు కొంత వరకూ నచ్చే అవకాశం కూడా లేకపోలేదు.నటన పరంగా ఈ పాత కథ కోసం గోపీచంద్ ఎప్పట్లానే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అసలు పస లేనప్పుడు ఇలాంటివి పెద్దగా ప్లస్ కావు. జగపతిబాబు ఎందుకో.. ఈ పాత్ర చేయడం తనకు ఇష్టం లేదు అన్నట్టుగా ఒక్కటే ఎక్స్ ప్రెషన్ తో సినిమా అంతా లాగించేశాడు. ఖుష్బూ తరహా పాత్రలు అనేకం చూశాం. తను బానే చేసింది. హీరోయిన్ గురించి చెప్పడానికేమీ లేదు. పాటలు, స్కిన్ షో. అంతవరకే తను పరిమితం అయింది. తరుణ్ అరోరా, నాజర్ ల విలనిజం రావుగోపాలరావు కాలం నాటిది. వెన్నెల కిశోర్ కామెడీ నీరసంగా ఉంది. హాస్యానికి అయినా కనీసం అలీని సరిగా వాడుకోలేదు. ఇతర పాత్రలన్నీ వెరీ వెరీ రొటీన్.. ఈ సినిమాలాగా.


టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ గా ఉంది. మిక్కీ జే మేయర్ పాటలు గొప్పగా లేవు కానీ.. తన స్టైల్ కు భిన్నంగా మాసివ్ రీ రికార్డింగ్ ఇచ్చాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. డైలాగ్స్ బాలేదు. ఆర్ట్ వర్క్, సెట్స్ ఓకే. దర్శకుడుగా శ్రీవాస్ మరోసారి ఫెయిల్ అయినట్టే.

కేవలం హీరోల ఇమేజ్ ను మాత్రమే పట్టుకుని కూర్చుంటే పనులు కావడం లేదు. ఈ విషయంలో టాప్ హీరోలు కూడా మారారు. అంతెందుకు రిజల్ట్ ఎలా ఉన్నా గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్.. ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాసే రాధేశ్యామ్ లాంటి ప్రయోగం చేశాడు. బట్ దర్శకుడుగా శ్రీవాస్ టేకింగ్ కూడా ఏ మాత్రం బాలేదు. ఈ సినిమా అతని కెరీర్ నే ప్రశ్నార్థకం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఫైనల్ గా : గురి తప్పిన రామబాణం

రేటింగ్ : 2/5

            - బాబురావు. కామళ్ల.

Related Posts