రామ్ చరణ్ టూ లేట్ అంటున్నాడే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూకుడుగా ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అతను రెండు సినిమాలు కంప్లీట్ చేసి ఉన్నాడు. వీటిలో ఆర్ఆర్ఆర్ జనవరి 7న విడుదల కాబోతోంది. రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మొదటిసారిగా ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చరణ్. అటుపై కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. ఈ మూవీ కూడా మెగాస్టార్ తో కలిసి నటించిన సినిమానే. తండ్రి కొడుకు కలిసి ఫస్ట్ టైమ్ రెండు బలమైన పాత్రల్లో కనిపించడం ఇదే. అందువల్ల ఈ చిత్రంపైనా భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఆచార్య వస్తే 2022లో మరో సినిమా కూడా విడుదల చేసే అవకాశం ఉంది అనుకున్నారు చాలామంది. కానీ ఈ విషయంలో అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి వినిపిస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఇండియాస్ బిగ్ డైరెక్టర్స్ లో ఒకడైన శంకర్ తో సినిమా చేస్తున్నాడు. శంకర్ ఓ తెలుగు హీరోతో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందుకే ఈ మూవీని 2022 దసరాకు విడుదల చేయొచ్చు అనే ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తల ప్రకారం శంకర్ – చరణ్ సినిమా 2023లోనే విడుదలవుతుందంటున్నారు. అలాగని మరీ ఎక్కువ టైమ్ తీసుకోకుండా 2023 సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్ పాత్రలో కనిపిస్తాడని టాక్. సునిల్ తో పాటు కోలీవుడ్ కు చెందిన చాలామంది నటిస్తోన్న ఈ చిత్రం చరణ్ కెరీర్ లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందంటున్నారు. అయితే మరీ విడుదల విషయంలో అంత దూరం వెళ్లడం మాత్రం అభిమానులకు నచ్చడం లేదు. మరీ అంత లేట్ అయితే ఎలా అనుకుంటున్నారాళ్లు.

Related Posts