రాధేశ్యామ్ రివ్యూ.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టించి భారీ పీరియాడిక్ ల‌వ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాహుబ‌లి, సాహో చిత్రాల‌తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో రాధేశ్యామ్ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన రాధేశ్యామ్ అన్ని అడ్డంకుల‌ను దాటుకుని ఈ రోజు అన‌గా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. మ‌రి.. రాధేశ్యామ్ ఆడియ‌న్స్ ని మెప్పించిందా..? బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాహుబ‌లి, సాహో రేంజ్ లో స‌క్స‌స్ అవుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ – విక్రమాదిత్య (ప్రభాస్) ఫేమస్‌ పామిస్ట్‌. ఒక్క‌సారి చేయి చూసి జాత‌కం చెప్పాడంటే.. జ‌రిగి తీరాలి అంతే. ఇంకా చెప్పాలంటే ఆయ‌న మాటే శాస‌నం. అయితే.. ఇండియాకి ఎమ‌ర్జ‌న్సీ వ‌స్తోంద‌ని ముందే చెప్ప‌డంతో ఇండియా వ‌దిలి ఇట‌లీ వెళ్లిపోవాల్సి వ‌స్తోంది. త‌న జీవితంలో ప్రేమ‌, పెళ్లి లేవ‌ని బ‌లంగా న‌మ్ముతాడు విక్ర‌మాదిత్య‌. అయితే.. ఓ రోజు ట్రైన్ లో అనుకోకుండా ప్రేర‌ణ (పూజా హేగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. ఒక‌రికొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. అయితే.. త‌న లైఫ్ లో ప్రేమ‌, పెళ్లి లేవ‌ని తెలిసిన విక్ర‌మాదిత్య త‌న‌తో ఉండే రోజులు సంతోషంగా ఉండాల‌నుకుంటాడు.

అయితే.. ఓరోజు ప్రేర‌ణ చేయి చూసి ఆమె జీవితం చాలా బాగుంటుంద‌ని లాంగ్ లైఫ్ ఉంటుంద‌ని చెబుతాడు. దీనిని ప్రేర‌ణ ఏమాత్రం న‌మ్మ‌దు. ఎందుకంటే.. ఆమె ఎక్కువ రోజులు బ‌త‌క‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. ఇదిలా ఉంటే.. విక్ర‌మాదిత్య గురువు ప‌ర‌మ‌హంస (కృష్ణంరాజు) విక్ర‌మాదిత్య చేయి చూసి షాక్ అవుతాడు. ఇంత‌కీ ఎందుకు ప‌ర‌మ‌హంస ఎందుకు షాక్ అయ్యాడు..? విక్ర‌మాదిత్య జాత‌కంలో ఏముంది..? ప్రేర‌ణ జీవితం విష‌యంలో విక్ర‌మాదిత్య చెప్పింది నిజ‌మైందా..? డాక్ట‌ర్లు చెప్పింది నిజ‌మైందా..? ప్రేమ‌, విధి మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో చివ‌రికి ఏం జ‌రిగింది..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్
ప్ర‌భాస్ న‌ట‌న‌
పూజా హెగ్డే అందం, అభిన‌యం
థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం
విజువ‌ల్ బ్యూటీ

మైన‌స్ పాయింట్స్
పాత క‌థ‌
నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
పాట‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోక‌పోవ‌డం

విశ్లేష‌ణ – విక్ర‌మాదిత్య పాత్ర‌లో ప్ర‌భాస్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ప‌ర్ ఫెక్ట్ అన్న‌ట్టుగా న‌టించాడు. అలాగే ప్రేర‌ణ పాత్ర‌లో పూజా హేగ్డే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ప్ర‌భాస్, పూజా హేగ్డే మ‌ధ్య కెమెస్ట్రీ వ‌ర్క‌వుట్ అయ్యింది. జగపతిబాబు, సచిన్ ఖేదేకర్, భాగ్యశ్రీ తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా చూస్తుంటే.. మ‌న‌కు గీతాంజ‌లి సినిమా గుర్తొస్తుంటుంది. అందులో గిరిజ లేచిపోదామా.. అంటుంటుంది. ఇందులో పూజా హేగ్డే నా బ‌రువు మోయ‌గ‌ల‌వా..? అని అడుగుతుంటుంది.

అందులో క‌థానాయికకు జ‌బ్బు ఉండ‌డం.. ఆమె తండ్రి డాక్ట‌ర్ కావ‌డం.. హీరోయిన్ కి ఆప‌రేష‌న్ జ‌రుగుతుంటే.. హీరో డోర్ అద్దాల నుంచి చూడ‌డం.. ఇలా ఒక‌టేమిటి… చాలా స‌న్నివేశాలు గీతాంజ‌లి సినిమాని గుర్తుచేస్తుంటాయి. కాక‌పోతే.. ఇందులో పామిస్ట్ అనేది కాస్త కొత్త‌గా క‌నిపిస్తుంటుంది. ఇక మురారి సినిమాలో మ‌హేష్ బాబు అన్నింటికంటే.. సంక‌ల్పం గొప్ప‌ది.. నేను బ‌తుకుతాను.. బ‌తికి తీర‌తాను అంటాడు. విధిని ఎదురించి బ‌తుకుతాడు. ఇందులో కూడా అలాగే ప్ర‌భాస్ విధిని ఎదురించి బ‌తికి తీర‌తాడు.

ఇలా రాధేశ్యామ్ చూస్తుంటే.. గీతాంజ‌లి, మురారి సినిమాలు గుర్తుకువ‌స్తాయి. ఫ‌స్టాఫ్, సెకండాఫ్ అని కాకుండా ఫ‌స్ట్ నుంచి ఒకేలా వెళుతుంది త‌ప్పా.. క‌థ‌లో ఎక్క‌డా స్పీడు క‌నిపించ‌దు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద‌ర‌గొట్టేసాడ‌ని చెప్ప‌చ్చు. యువి క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచిక్వాలిటీతో నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ క‌థ‌నంలో కూడా కొత్త‌ద‌నం చూపించ‌లేక‌పోయారు. ప్రేమ‌క‌థ‌లు ఇష్ట‌ప‌డేవారికి న‌చ్చుతుంది. అయితే.. ప్ర‌భాస్ సినిమా అంటే.. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సీన్స్, మాస్ డైలాగ్స్ ఆశించే వారికి నిరాశే.

Related Posts