ప్రభాస్ రాముడుగా సెట్ అవలేదా..? ఆదిపురుష్ ట్రైలర్ ఒరిజినల్ రివ్యూ ఏంటీ..?

ఆదిపురుష్‌(Aadipurush) .. ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడుగా నటించిన సినిమా కృతి సనన్(Kriti Sanon) సీత పాత్రలో నటించింది. దర్శకుడు ఓమ్ రౌత్(Om Routh) ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూన్ 16న విడదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది.

అయితే మామూలుగా రామాయణ, భారత ఇతిహాసాలను వెండితెరపై ఎక్కిస్తున్నప్పుడు ఆ పాత్రలను స్టడీ చేస్తారు. ఆయా పాత్రలకు తగ్గ నటీ నటులను ఎంపిక చేసుకుంటారు. ఇక ఇండియాలో మన పురాణాలను, ఇతిహాసాలను దక్షిణ భారతీయలు.. మరీ ముఖ్యంగా తెలుగువాళ్లుతీసినంత గొప్పగా, సహజంగా మరెవరూ తీయలేరు. ఈ విషయంలో డౌటే అక్కర్లేదని ఎన్నోసినిమాలు నిరూపించాయి.

బాలీవుడ్ భారతానికి, రామయణానికి మన సినిమాలకు లేదా సీరియల్స్ కు సహజత్వంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఇప్పుడు రాబోతోన్న ప్రభాస్ ఆదిపురుష్‌ ట్రైలర్ చూసిన తర్వాత ఇది రామాయణం అంటే తెలుగువాళ్లే కాదు.. సౌత్ ఇండియన్స్ ఎవరూ నమ్మలేనంతగా కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు రాముడుగానే సుపరితుడైన ఆయన్ని రాఘవగా మార్చడం చూస్తే మనకు దూరంగా ఆ పాత్ర కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

కాకపోతే తెలిసిన కథ కాబట్టి.. ఇవన్నీ ఆయా పాత్రలు అని మాత్రం ఐడెంటిఫై చేస్తాం. కానీ ఆ పాత్రల ఔన్నత్యం, వ్యక్తిత్వం ఇప్పుడు ఈచిత్రంలో నటించిన వారిలో కనిపిస్తుందా అంటే డౌటే లేదు. అస్సలు కనిపించడం లేదు అని స్పష్టంగా అర్థం అవుతోంది.


ఇక రాముడు అంటే మనకు అనేక పురాణ గాథలైనా.. సినిమాల ద్వారా అయినా తెలిసింది ఏంటీ..? ఆయన ఎంత పరాక్రమవంతుడో అంతిటి సౌకుమార్యుడు. ఎంతటి విలుకాడో అంతటి కరుణామయుడు. కానీ రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ ను చూస్తుంటే ఆయన రాముడులా కాక బాహుబలికి సీక్వెల్ హీరోలా కనిపిస్తున్నాడు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

రాముడుగా కనిపించే నటుడి ఆహార్యం, ఆంగికం, వాచకం, అభినయం విషయంలో మనకు స్పష్టమైన అభిప్రాయాలు, ఉదాహరణలూ ఉన్నాయి. వాటికి ఏ కోశానా ప్రభాస్ కనిపించడం లేదు. డైలాగ్స్ చూస్తే హిందీ రామాయణాన్ని తెలుగులో డబ్ చేసినట్టుగా ఉంది. ఆ పదాలు కానీ, సాహిత్యం కానీ మనవి కాదు. మనం పలికేవీ కావు. అతి ముఖ్యంగా రాముడుగా రామారావు(NTR Sr), హరనాథ్, శోభన్ బాబు, సుమన్ లాంటి వారిని చూసిన కళ్లతో ప్రభాస్ ను చూడటం జీర్ణించుకోలేని విషయం.


తెలుగులో ఇలా చూపించారు అని కాదు కానీ.. రావణుడి ఆహార్యం గురించి రామాయణ కావ్యాల్లోనే అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణణలో వెయ్యో వంతు కూడా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) ఆహార్యం కనిపించడం లేదు. ఓ సగటు కమర్షియల్ సినిమా విలన్ లా ఉన్నాడు సైఫ్‌.

హనుమంతుడు పాత్రధారి కాస్త ఫర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇక సీతగా కృతి సనన్ కు ట్రైలర్ లో సరైన క్లోజప్ పడలేదు. సినిమా చూస్తే కానీ ఆమె నటనా కౌశలం తెలియదు.


చివరగా.. సీతారాములు అరణ్యవాసం చేసినంత కాలం నార బట్టలే ధరించారు అని అన్ని రామాయణాల్లోనూ రాశారు. కానీ ఇక్కడ ప్రభాస్ కుమాత్రం బాహుబలి(Bahubali)లో మిగిలిపోయిన యుద్ధ వస్త్రాలను అందించినట్టుగా ఉన్నాడు దర్శకుడు. ఇది చాలు.. ఆయన ఈ రామాయణాన్ని ఎంత స్టడీ చేశాడు అని చెప్పడానికి. కాకపోతే ఇప్పుడు జై శ్రీరామ్ నినాదం బలంగా ఉంది కాబట్టి.. ఈ చిత్రాన్ని ఆదరిస్తారేమో కానీ.. రాముడుగా ప్రభాస్..కానీ రామాయణంలా ఆదిపురుష్‌ కానీ అస్సలు కనిపించడం లేదు అని నిజమైన రామభక్తులే వాపోతున్నారు.

Related Posts