ఆర్జీవీ ‘ఐస్ క్రీమ్ 3’ మేకింగ్ వెనక ప్లాన్ ఇదేనట..?
Latest Movies Tollywood

ఆర్జీవీ ‘ఐస్ క్రీమ్ 3’ మేకింగ్ వెనక ప్లాన్ ఇదేనట..?

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ఈమధ్య కాలంలో చెప్పుకోదగ్గ సినిమా రాలేదు.లాక్ డౌన్ ముందు నుంచి కూడా ఆయన నుంచి వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదు. ఆయన ఎంత పబ్లిసిటీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. జయాపజయాలకు అతీతమైన క్రేజ్ వర్మకు ఉంది. అందుకనే ఆయన సినిమాలు కోసం ఎదురు చూసేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వర్మ ఏం మాట్లాడినా.. ఏం చేసినా.. గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్లకు ఏం తక్కువ లేరు. వీళ్లంతా వర్మ మళ్లీ ఏ సినిమా చేస్తాడా..? ఎలాంటి వివాదస్పద సినిమాతో వస్తాడా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపే ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఐస్ క్రీమ్ 3 తీయబోతున్నాడట వర్మ. వర్మ దర్శకత్వంలో 2014లో ఐస్ క్రీమ్ సినిమా వచ్చింది. ఇదో డిఫరెంట్ మూవీ. ఈ సినిమా యూత్ ని ఓ మాదిరిగా ఆకట్టుకుంది. నవదీప్, తేజస్వి, మృదుల ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటిలానే విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సస్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహాంతో ఆతర్వాత కొంత గ్యాప్ లోనే వర్మ ఐస్ క్రీమ్ 2 తీశారు.

ఈ సినిమాలో జెడి చక్రవర్తి, నవీన, నందు, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా ఓ మాదిరిగానే ఉందని చెప్పుకున్నారు. కమర్షియల్ గా ఫరవాలేదు అనిపించింది. ఈ రెండు సినిమాలను నిర్మించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలోనే వర్మ ఐస్ క్రీమ్ 3 తీయనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తారట. మరి.. వర్మ ఐస్ క్రీమ్ 3 ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Post Comment