పవన్ కళ్యాణ్ ‘వారాహి’కి లైన్ క్లియర్

వాహన వివాదంపై స్పందించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పవన్ కల్యాణ్ ‘వారాహి’ వాహనం పై అభ్యంతరం ఏమి లేదు: స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ అజయ్

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి వివాదంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పందించారు. డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ లోని టోలి చౌకి నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారాహి వాహనానికి TS13EX 8384 నంబర్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని పేర్కొన్నారు.

అలాగే వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ గా నిర్ధారించామని ఈ మేరకు వాహనం ఆర్ సీ మీద దీని వివరాలు ముద్రించినట్లు మంత్రి పువ్వాడ ప్రకటించారు.

వాస్తవానికి వాహనాల రంగులకు కోడ్స్ ఉంటాయి అని భారత ఆర్మీ సంస్థ ఉపయోగించే కలర్ కోడ్ అంటే ఆర్మీ కలర్: 7B8165 కాగా.. ఇప్పుడు జనసేన అధినేత ఎన్నికల వాహనం వారాహి కలర్ కోడ్ :445c44 అని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో వారాహి వాహనం రంగుపై ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

జనసేన వాహనం రంగు ‘ఆలివ్ గ్రీన్’ కాదని, ‘ఎమరాల్డ్ గ్రీన్’ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ స్పష్టత ఇచ్చారు ఇది నిబంధనలకు లోబడే ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.