పవన్ కళ్యాణ్.. నీకిది తగునా..?

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా.. ముందు ఒప్పుకున్న సినిమాల కంటే వెనక కమిట్ అయిన సినిమాల రిలీజ్ లు ముందుకు వస్తాయి అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ తీరు. అందరికీ న్యాయం చేస్తా అనే వ్యక్తి.. తన నిర్మాతల విషయంలో మాత్రం పక్షపాతం చూపిస్తున్నాడు. ఈ విషయం మీకెందుకు అనే ప్రశ్నలు ఆయన అభిమానుల నుంచి రావొచ్చు. నిజమే.. కానీ అభిమానులే ఓ సారి ఆలోచించండి.. పవర్ స్టార్ నుంచి పవర్ ప్యాక్డ్ మూవీస్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారా లేక గెస్ట్ రోల్స్, మల్టీస్టారర్స్ కావాలనుకుంటున్నారా..? దీన్ని బట్టే పవన్ నిర్ణయాల పై ఓ అంచనాకు రావొచ్చు.

నిజమే.. లేదంటే.. మాంచి బిర్యానీ లాంటి సినిమాలు సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తోంటే.. పవర్ స్టార్ మాత్రం కొన్నాళ్లుగా చప్పిడికూరల మీల్స్ పెడుతున్నట్టుగా కనిపిండచం లేదూ..? ఇక ఈ లోటు హరిహర వీరమల్లుతో తీరుతుంది అని భావిస్తే.. అది కాస్తా ఎప్పుడు వస్తుందో తెలియకుండా పోయింది. అసలు ఉంటుందా లేదా అనే డౌట్స్ కూడా రీసెంట్ గా మొదలయ్యాయి. అయినా ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ ను కాదని.. నెల క్రితం స్టార్ట్ అయిన సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం అంటే ఎలా చూడాలి..? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కాక.. జనసేన ఫండ్ కోసం చిన్న సినిమాలు చేస్తున్నాడా..? ఇలా చేయడం వల్ల తన రెమ్యూనరేషన్ మారదు.. పైగా వర్కింగ్ డేస్ కూడా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నాడా అంటే నిజమేనేమో అనిపించక మానదు.


అవును మరి.. అభిమానులు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తోంటే.. ఈయన మాత్రం చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతున్నాడు. రీసెంట్ గా సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతా రీమేక్ లో నటిస్తున్నాడిప్పుడు. ఇందులో పవన్ దేవుడు లాంటి పాత్రలో కనిపిస్తాడు. చిన్న పాత్రే. ప్రధాన పాత్రలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. పవన్ కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ చేశాడు.

రీసెంట్ గా ఆయనకు సంబంధించిన పార్ట్ కూడా చిత్రీకరణ పూర్తయింది. ఇక సాయితేజ్ రోల్ మాత్రం ఉంది. పైగా సముద్రఖని దర్శకత్వం అంటే సీరియల్స్ తీసినట్టుగా రోజుకు పది సీన్స్ వరకూ తీసేస్తాడట. అందుకే ఇంత వేగంగా పూర్తయిందంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన ఆనందం కలిగించేదే అయినా.. అభిమానులు కోరుకునేది మాత్రం ఇలాంటి సినిమాలు కాదేమో..?

Related Posts