HomeLatestSarath babu : ఒన్ & ఓన్లీ హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ బాబు

Sarath babu : ఒన్ & ఓన్లీ హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ బాబు

-

ఒన్ ఓన్లీ హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్
విలక్షణ నటనకు వినమ్ర రూపం శరత్ బాబు

మూడు దశాబ్ధాల పాటు అత్యంత ప్రభావవంతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై చెరగని ముద్రవేసిన నటుడు శరత్ బాబు. ఎంత సాఫ్ట్ గా కనిపిస్తాడో అంతే క్రూయొల్ గా నటించగలడు. పాత్ర పరంగా అన్ని బంధాల్లోనూ ఆకట్టుకున్న శరత్ బాబు రియల్ లైఫ్ లో మాత్రం ఆ బంధాలు అంత ఎఫెక్టివ్ గా కనిపించవు. ఆముదాల వలస నుంచి మద్రాస్ వెళ్లి హీరోగా మొదలుపెట్టి, విలన్ గా మెప్పించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యి, దక్షిణాది అంతా హ్యాండ్సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అభిమానుల్ని సంపాదించుకున్నారు శరత్ బాబు. 72యేళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన శరత్ బాబు సినీ జీవన ప్రయాణాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.


స్పాట్ : మాంటేజ్ విత్ శరత్ డిఫరెంట్ ఇమేజెస్
శరత్ బాబు పుట్టింది 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో. అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఎగువ మధ్య తరగతి కుటుంబం. వాళ్ల నాన్నగారు హోటెల్ నడిపేవారట. తను కూడా అదే వ్యాపారంలో ఉండాలనేది వాళ్ల నాన్నగారి కోరిక. తనకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరిక ఉండేది. కానీ టెన్త్ క్లాస్ చదివే నాటికే సైట్ వచ్చేసింది. దీంతో కళ్లజోడు తప్పనిసరైంది. అంటే పోలీస్ కు అన్ ఫిట్ కదా. అలా ఆ కోరిక తీరకపోయినా కాలేజ్ లో అందరూ హీరోలా ఉన్నావనేవారట. దీంతో నటుడు కావాలనే కోరక కలిగింది.


ఆ రోజుల్లో అందరూ కొత్తవారితోనే సినిమా తీసి ఆదుర్తి సుబ్బారావు మంచి హిట్ కొట్టాడనే మాట తెలుసుకుని.. తనూ ఆయనకు కొన్ని ఫోటోస్ పంపించాడు. చూడ్డానికి బావుంటాను కానీ నటనతో అనుభవం లేదు. నేర్పిస్తే నేర్చుకుంటానని ఒక లెటర్ కూడా రాశాడట.. అది నచ్చి ట్రైన్ చార్జీలు కూడా పంపించి మద్రాస్ రప్పించారు ఆదుర్తి.

అయితే తను అప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నానని.. ఆరు నెలల తర్వాత తెలుగు సినిమా చేస్తాను అప్పుడు రమ్మన్నాడట. కానీ శరత్ బాబు తిరిగి వెళ్లలేదు. ఓ మిత్రుడి గదిలో ఉంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. అలా అందరూ కొత్తవారే కావాలన్న ప్రకటన చూసి వెళ్లారు. వెయ్యి మంది వరకూ ఉన్న ఆ ప్రాజెక్ట్ లో ఒక హీరోగా తను సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమా పేరు రామరాజ్యం. జగ్గయ్య, ఎస్వీరంగారావు, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలైన నటులున్న సినిమా. తన కాలేజ్ రోజుల్లో ఇష్టపడ్డ చంద్రకళ సరసన జంటగా నటించే అవకాశం రావడం అదృష్టంగా ఫీలయ్యారు శరత్ బాబు..


శరత్ బాబును చూడగానే హీరో మెటీరియల్ లా కనిపిస్తాడు. కానీ అందరు దర్శకులకూ అలాగే కనిపించాలనేం లేదు కదా. దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ శరత్ బాబును భిన్నమైన కోణంలో చూశాడు. ఆయన దృష్టిలో పడ్డ ఆర్టిస్టులు ఏ రేంజ్ కు వెళతారో అందరికీ తెలుసు. అలాగే శరత్ బాబు కూడా. ఆ తర్వాత హీరో అనేం ఫిక్స్ కాకుండా ఏ పాత్ర వచ్చినా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆశ్చర్యంగా సినిమాల్లోకి రాక ముందు ఏ నటనానుభవం లేని శరత్ బాబు.. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయాడు. దీంతో దక్షిణాదిలోని అన్ని భాషల దర్శకులకూ శరత్ బాబు వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయాడు.


ఒకే తరహా పాత్రలు చేసినా ఏ మాత్రం బోర్ కొట్టని ఆర్టిస్టులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో శరత్ బాబు ఒకరు. ఆయన ఎన్నోసార్లు త్యాగపూరితమైన పాత్రల్లో కనిపించారు. మరెన్నోసార్లు బెస్ట్ ఫ్రెండ్ గా నటించారు. కానీ ఎప్పుడూ మొనాటనీ దరి చేరనివ్వని నటనతో అలరించారు. ముఖ్యంగా సాగరసంగమంలో కమల్ హాసన్ ఫ్రెండ్ గా శరత్ బాబు నటన అద్భుతం. ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు.


శరత్ బాబు నవ్వితే ఎంత స్వచ్ఛంగా కనిపిస్తాడో.. కళ్లెర్రచేస్తే అంత క్రూరంగా అనిపిస్తాడు. ఇది చాలా రేర్ కాంబినేషన్. అదే శరత్ బాబు స్పెషాలిటీ. అయితే విలన్ గా మారాలనేది శరత్ బాబు వెంటనే అనుకున్న విషయం కాదు. కానీ ఏవియమ్ వారి నోము సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా చేశారు. కెరీర్ తొలినాళ్లలోనే హీరో ఫీచర్స్ ఉన్న ఆర్టిస్ట్ విలన్ గా చేయడం అంటే కెరీర్ ను రిస్క్ లో పెట్టడమే. బట్.. తనకు ఏది రాసి ఉందో అదే వచ్చింది అంటాడు శరత్ బాబు.


తమిళ్ లో కె బాలచందర్ డైరెక్షన్ లో చేసిన ఫస్ట్ మూవీ నిళల్ నిజమాగిరదు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు శరత్ బాబు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో పాటు అతని పాత్రకూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తమిళ్ లోనూ కంటిన్యూస్ గా ఆఫర్ వచ్చాయి. ఏ తరహా పాత్రైనా చేసుకుంటూ వెళ్లిపోయాడు.


రజినీకాంత్ శరత్ బాబు చాలా సినిమాల్లో నటించాడు. అప్పటికి రజినీకాంత్ కు ఇంత ఇమేజ్ లేదు కాబట్టి.. చాలా సినిమాల్లో పోటాపోటీగా నటించారు. కొన్ని సినిమాల్లో రజినీ కంటే శరత్ బాబుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సందర్భాలూ లేకపోలేదు. అయితే ఆ పాత్రలకు కెమెరా ముందు వరకూ మాత్రమే కానీ మనసు వరకూ రానివ్వలేదు శరత్ బాబు.


హీరోగా ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా హీరోలకు ఉన్నంత ఇమేజ్ సంపాదించుకున్నాడు శరత్ బాబు. కొన్ని సినిమాల్లో ఆయన పాత్రలు, నటన చూస్తే మరెవరూ చేయలేనివిగా కనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగులో సీతాకోక చిలుక, అన్వేషణ, నీరాజనం,సంకీర్తన, ఓ భార్యకథ, అభినందన వంటి ఎన్నో మెమరబుల్ మూవీస్ చేశారు శరత్ బాబు. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన నటనే చూపించారు. అదే శరత్ బాబును మనకున్న నటుల నుంచి ప్రత్యేకంగా నిలుపుతుంది.


శరత్ బాబు ఓ పాత్ర చేస్తున్నాడంటే దాని ఔన్నత్యం, హుందాతనమూ పెరుగుతుంది. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా.. ఆయన పాత్రలో లీనమయ్యే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. సితార సినిమాలో ఆస్తులు కోల్పోయినా హోదా విషయంలో రాజీపడని జమిందార్ పాత్రలో శరత్ బాబు నటనను ఇష్టపడని వారుంటారా..? పాడుపడ్డ రాజావారి బంగ్లాకు, స్థితికి ప్రతీకగా ఉంటుంది ఆయన నటన.. అభినందన కూడా శరత్ బాబు ఇమేజ్ ను మరింత పెంచిన సినిమాల్లో ఒకటి. ఆడియో కంపెనీ అధినేత అయిన ఆ పాత్ర భార్య చనిపోతే తన పిల్లల కోసం మరదల్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పటికే వేరే వ్యక్తిని ప్రేమించిన ఆమె బాధను అర్థం చేసుకుని ఆఖర్లో తను ఆత్మహత్య చేసుకుని ఆ ఇద్దరినీ కలిపే ఉదాత్తమైన పాత్రలో శరత్ బాబును తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేం. నీరాజనంలో పాత్ర పూర్తిగా భిన్నమైనది.

అందులో ప్రేమను ద్వేషించే వ్యక్తిగా శరత్ బాబు వైవిధ్యమైన నటన చూపిస్తాడు. తనే కాదు.. తన వాళ్లెవరూ ప్రేమించకూడదని.. తనలా భగ్న ప్రేమికులుగా మిగిలిపోకూడదని.. ఏకంగా సొంత తమ్ముడి ప్రేమను సైతం వ్యతిరేకిస్తూ.. అతన్ని ప్రేమను వదులుకోమని చెబుతుంటాడు.. ఎందుకో ఈ సినిమాలో అతని నటన చూస్తే.. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని వెండితెరపై అభినయించడానికి వచ్చిన అవకాశంగా భావించాడేమో అనిపిస్తుంది.


శరత్ బాబు, నటి రమాప్రభను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య వయసులోనూ వ్యత్యాసం ఉంది. కానీ 14యేళ్ల తర్వాత విడిపోయారు. ఈ పద్నాలుగేళ్లలోనూ కలిసుంది పెద్దగా లేదు. అసలు వీరి పెళ్లే పెద్ద సంచలనం అయితే విడాకులు కూడా సంచలనంతో పాటు వివాదాలు, విమర్శలూ తెచ్చింది. ప్రతి మనిషి జీవితంలో తీపి చేదు ఉంటాయి. చేదు విషయంలో కొన్ని బాధిస్తాయి. కొన్ని గాయంలా మారి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విషయంలో ఇద్దరి వాదనలు భిన్నంగా ఉంటాయి. నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అంటుంది రమాప్రభ. అసలు తమది వాలిడ్ మ్యారేజే కాదంటాడు శరత్ బాబు. వీరి వాదనల్లో నిజానిజాలెలా ఉన్నా.. ఇద్దరూ వ్యక్తిగత జీవితాల్ని కోల్పోయారు అంటారు వారి సన్నిహితులు.


పర్సనల్ గొడవలు ఎన్ని ఉన్నా.. ఎప్పుడూ కెరీర్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు శరత్ బాబు. తెలుగుతో పాటు దక్షిణాదిలో ఎక్కడ అవకాశం ఉన్నా నటించాడు. అయితే 2000ల తర్వాత కొత్త తరం కొత్త ట్రెండ్ అంటూ వచ్చిన మార్పుల్లో శరత్ బాబుకూ అవకాశాలు తగ్గాయి. అయినా ఆయన చేయదగిన పాత్రైతే ఆయన్నే వెదుక్కుంటూ వచ్చింది. అంతకు ముందైనా ఆ తర్వాతైనా.. దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించినా ప్రతి భాషలోనూ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు శరత్ బాబు.

అప్పటికి ఇదో విశేషంగా చెప్పుకున్నారు సినీ జనం. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు మాత్రమే పరభాషా ప్రేక్షకులకు సొంత గొంతు వినిపించారు. అయితే ఏ భాషలో చేసినా అక్కడి ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా నటించడం శరత్ బాబు శైలి. అదే ఆయన్ని ఎంతోమంది ప్రేక్షకులకు అభిమాన నటుడిని చేసింది.


ఏడు పదుల వయసులోనూ ఎప్పుడూ ఉత్సాహంగా చలాకీగా కనిపించేవారు శరత్ బాబు. ఈ యేడాది చివరగా నరేష్‌ – పవిత్ర లోకేష్ నటించిన మళ్లీపెళ్లిలో ఆయన సూపర్ స్టార్ కృష్ణగారి పాత్రలో నటించారు. దీంతో ఆయన బానే ఉన్నారు అనుకున్నారు. అలాంటిది మే నెల 1న సడెన్ గా అనారోగ్యం పాలయ్యారు. చెన్నై నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ మే 3నే ఆయన చనిపోయారు అంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అప్పుడు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దీంతో ఆయన మళ్లీ తిరిగి ఆరోగ్యంతో వస్తారు అనుకున్నారు చాలామంది. కానీ ఆయన తిరిగి రాలేదు. తిరిగిరాని తీరాలకు తరలిపోయారు.


శరత్ బాబు లాంటి నటులు ఒక్కో భాషలో ఒక్కొక్కరు ఉంటారు. కానీ దక్షిణాదిలోని అన్ని భాషలకూ తనే ఉండటం అనేది ఆయన సాధించుకున్న ఘనత. ఆయన ప్రతిభకు దక్కిన గౌరవం. ఆ గౌరవాన్ని ఆఖరి వరకూ నిలబెట్టుకున్న విలక్షణ నటుడు శరత్ బాబుకు తెలుగు 70ఎమ్ఎమ్ హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది..

                                - బాబురావు. కామళ్ల

ఇవీ చదవండి

English News