నాగచైతన్య కస్టడీ మూవీ ట్రైలర్ రివ్యూ

అక్కినేని నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోన్న కస్టడీ మూవీ టీమ్ లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న ఈ ట్రైలర్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉందనే చెప్పాలి.

శివ అనే ఓ సాధారణ కానిస్టేబుల్ గా చైతూ నటించాడు. ట్రైలర్ చూస్తోంటే ఇది పీరియాడిక్ మూవీలా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే విజువల్స్, సెట్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి బందోబస్త్ కు వెళ్లిన కానిస్టేబుల్ ఆ ముఖ్యమంత్రి కాన్వాయ్ నే ఆపేస్తే అతని పై అధికారుల తీరు ఎలా ఉంటుంది.

అలాగే ఓ కరడు కట్టిన క్రిమినల్ చేసే హత్యలు, దోపిడీలను డిపార్ట్ మెంట్ అంతా లైట్ తీసుకుంటే ఈ కానిస్టేబుల్ ఎందుకు బాధ్యత తీసుకుని అతన్ని జైలుకు పంపించాలనుకుంటున్నాడు.

పోలీస్ అయినా క్రిమినల్ కు సపోర్ట్ చేసే ఓ పై ఆఫీసర్ కానిస్టేబుల్ ను ఎలా ఇబ్బంది పెట్టాడు.. అతన్ని చంపాలని ఒక వ్యవస్థ అంతా ఎందుకు పనిచేస్తుంది.. మధ్యలో అతని ప్రేమకథ, దానికి ఎదురైన ఇబ్బందులు.. ఇలా ఎన్నో ప్రశ్నలకు క్లియర్ గా వదిలిపెట్టింది ట్రైలర్. చూస్తున్నంత సేపూ ఓ ఇంటెన్స్ డ్రామాలా కనిపిస్తోంది.

ట్రైలర్ చూస్తే చైతూ చెప్పినట్టుగా ప్రతి పది నిమిషాలకూ ఓ ట్విస్ట్ ఉండేలా ఉంది. ఆ కాలపు కాస్ట్యూమ్స్, వాహనాలు, ఛేజ్ లు అన్నీ ఈ తరానికి ఖచ్చితంగా థ్రిల్ ఇస్తాయనే చెప్పొచ్చు. అలాగే ఇది పూర్తిగా దర్శకుడు వెంకట్ ప్రభు మార్క్ చిత్రంగానే ఎలివేట్ అవుతోంది.

ఇక కృతిశెట్టి ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించబోతున్నట్టు అర్థమౌతోంది. అలాగే అరవింద్ స్వామి క్రూయల్ విలనీ, శరత్ కుమార్ కూల్ విలనీతో ప్రియమణి పాత్ర కూడా కీలకంగా ఉండబోతోందని అర్థం అవుతోంది.

తండ్రి కొడుకులైన ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం మరో హైలెట్ లా కనిపిస్తోంది. మొత్తంగా చైతన్య మరోసారి ఓ మంచి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడనేది ట్రైలర్ చూడగానే అర్థమైంది. మరి ఈ థ్రిల్లర్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయితే చైతూకు ఓ సాలిడ్ హిట్ పడినట్టే అనుకోవచ్చు.

Related Posts