మైఖేల్ రివ్యూ

రివ్యూ : మైఖేల్
తారాగణం : సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు.
సంగీతం : శ్యామ్ సిఎస్
సినిమాటోగ్రఫీ : కిరణ్‌ కౌశిక్
నిర్మాతలు : భరత్ చౌదరి, రామ్మోహనరావు పుష్కర్
దర్శకత్వం : రంజిత్ జెయకోడి.

అన్ని పరిశ్రమల్లోనూ అండర్ రేటెడ్ ఆర్టిస్టులుంటారు. కొన్ని పరిశ్రమల్లోనే అండర్ రేటెడ్ హీరోలుంటారు. తెలుగులో అలాంటి కుర్రాడు సందీప్ కిషన్. చాలాకాలంగా పరిశ్రమలో ఉన్నా.. సరైన హిట్ లేక ఇంకా చాలా వెనకబడిపోయే ఉన్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లోనే వేళ్లమీద లెక్కించే అన్ని విజయాలు మాత్రమే ఉన్న సందీప్ కిషన్ ఇప్పుడు మైఖేల్ గా వచ్చాడు. ఇది అతనికి ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా. ప్రస్తుతం దేశంలో ఉన్న ట్రెండ్ కు తగ్గట్టుగా గ్యాంగ్ స్టర్ కథతో వచ్చాడు. మరి ఈ గ్యాంగ్ స్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడా లేదా అనేది చూద్దాం.

గురునాథ్(గౌతమ్ మీనన్) ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. ఓ సారి అతనిపై ఎటాక్ జరిగితే పదేళ్ల మైఖేల్(సందీప్ కిషన్) కాపాడతాడు. అప్పటి నుంచీ మైఖేల్ ను తన వద్దే ఉంచుకుంటాడు గురునాథ్ అలియాస్ గురు. గురు గ్యాంగ్ లో అత్యంత కీలకమైన మెంబర్ గా ఎదుగుతాడు మైఖేల్. దీంతో గురు తనయుడు అమర్ నాథ్( వరుణ్ సందేష్) ఈర్ష్యగా ఫీలవుతుంటాడు. అయినా గురు పూర్తిగా మైఖేల్ ను మాత్రమే నమ్ముతాడు. అలాంటి గురుపై మరోసారి ఎటాక్ జరుగుతుంది. అది చేసింది ఎవరో తెలుసుకుని.. అతనితో పాటు అతని కూతురును కూడా చంపేయమని మైఖేల్ ను ఢిల్లీకి పంపిస్తాడు గురు. ఢిల్లీ వెళ్లిన మైఖేల్ తను చంపాల్సిన అమ్మాయి పేరు తీర(దివ్యాంశ కౌశిక్) అని తెలుసుకుంటాడు. ఆమెను కలుసుకునేందుకు వెళ్లి ప్రేమలో పడతాడు. మరోవైపు ఆమె తండ్రినీ చంపాలని ప్రయత్నించినా విరమించుకుంటాడు. బట్ ఓ రోజు ఓ పెద్ద గ్యాంగ్ వచ్చి మైఖేల్ ను కొట్టి తీరను కిడ్నాప్ చేస్తారు. తీరను వెదుక్కుంటూ వెళ్లిన మైఖేల్ ను చంపేస్తారు. అది ఇంటర్వెల్ బ్యాంగ్. తర్వాతేం జరుగుతుందో సగటు ప్రేక్షకులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. అయితే మైఖేల్ ను చంపిన వాళ్లెవరు..? తీర ఎవరు..? అసలు మైఖేల్ లక్ష్యం ఏంటీ..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి..
మైఖేల్ లాంటి కథలు తెలుగు తెరపైనే కాదు ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటికే చాలా వచ్చాయి. ప్రభాస్ మున్నా, ఎన్టీఆర్ కంత్రీ, పవన్ కళ్యాణ్‌ పంజా చిత్రాలు ఈ కోవలోనే కనిపిస్తాయి. కాకపోతే ఈ గ్యాంగ్ స్టర్ కథ డార్క్ మోడ్ లో సాగుతుంది. 1990ల నేపథ్యంలో కథనం సాగుతుంది. హీరోకు ఓ లక్ష్యం అంటూ లేకపోవడంతో ఆ పాత్రకు మొదటి నుంచీ ఆడియన్స్ కనెక్ట్ కారు. అయితే అతని లక్ష్యం చివర్లో చెప్పడంతో అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఇక ఒక్కోసారి కెజీఎఫ్ తరహాలో వాయిస్ ఓవర్ లో కథ చెప్పడం.. మరోసారి డైరెక్ట్ గా చెప్పడం వల్ల స్క్రీన్ ప్లే క్లమ్జీగా మారిపోయింది. స్క్రీన్ ప్లే ఏదో ఒకదానికి స్టిక్ అయి ఉంటే సమస్య ఉండేది కాదేమో. ఎలివేషన్స్ అన్నీ కెజీఎఫ్‌ ను చూసినట్టుగానే కనిపిస్తాయి. కానీ ఆ ఎమోషన్ కనిపించదు. ఉన్నంతలో విజయ్ సేతుపతి, వరలక్ష్మిల ప్రెజెన్స్ ఎక్కువగా వర్కవుట్ అయింది. రిలీజ్ కు ముందే ఈ మూవీపై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. కానీ సినిమాలో అంత మేటర్ లేదనే చెప్పాలి. అలాగని మరీ బోరింగ్ సినిమా కాదు. ఇలాంటి డార్క్ గ్యాంగ్ స్టర్ మూవీస్ కు ఖచ్చితమైన ప్రేక్షకులుంటారు. వారితో పాటు ఆల్రెడీ కెజీఎఫ్‌, విక్రమ్ తరహా చిత్రాలు ఇష్టపడిని వారిని కొంత వరకూ మెప్పిస్తాడీ మైఖేల్.


మైఖేల్ గా సందీప్ కిషన్ నటన అద్భుతం అని చెప్పాలి. ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. అతని యాటిట్యూడ్ అదిరిపోయింది. హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ బావుంది. కాకపోతే వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ పేలవంగా ఉంది. ఏమంత ఎఫెక్టివ్ గా కనిపించకపోవడం మైనస్. గురు పాత్రలో గౌతమ్ మీనన్, అతని కొడుకుగా వరుణ్ సందేశ్ బాగా చేశారు. అనసూయ పాత్రలో ఓ ట్విస్ట్ ఉంది కానీ.. మరీ ఓవర్ యాక్షన్ లా కనిపిస్తుంది. విజయ్ సేతుపతి పాత్ర కన్విన్సింగ్ గా లేకపోయినా అతను నటనతో దాన్ని మరిపించాడు. మొత్తంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడేవారికి ఓ చాయిస్ లా మైఖేల్ ను తీసుకోవచ్చు. అంతే తప్ప.. వాళ్లు చెప్పినంత గొప్ప స్టఫ్ అయితే సినిమాలో లేదనే చెప్పాలి.
టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉందీ చిత్రం. సినిమాటోగ్రఫీ ఆ డార్క్ మూడ్ ను ఎలివేట్ చేస్తూ అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్, సెట్స్, అన్నీ బాగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అయితే దర్శకుడు మాత్రం పూర్తి క్లారిటీతో లేడు అనిపిస్తుంది. ఇలాంటి కథలకు కాస్త స్పీడ్ నెరేషన్ తో పాటు కరెక్ట్ స్క్రీన్ ప్లే అవసరం. ఈ రెండు విషయంలో అతను మైనస్ మార్కులే సంపాదించుకున్నాడు.

ఫైనల్ గా : వర్కవుట్ కాని గ్యాంగ్ స్టర్

రేటింగ్ : 2.5/5

                - యశ్వంత్ బాబు. కె

Related Posts