పలాస సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన నటుడు తిరువీర్. ఇప్పుడిప్పుడే ప్రధాన పాత్రల స్థాయికి ఎదుగుతున్నాడు. థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తిరువీర్ కు నటుడుగా మంచి పేరుంది. అతనితో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత, గంగోత్రిలో బాలనటిగా కనిపించిన కావ్య, అఖిల ప్రధాన పాత్రల్లో మసూద అనే సినిమాలో నటించారు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అంతకు మించి ఈ చిత్ర నిర్మాతల టేస్ట్ పై టాలీవుడ్ లో ఓ పేరుంది. ఇంతకు ముందు మళ్లీరావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమాను స్వయంగా వచ్చి తనే రిలీజ్ చేస్తానని చెప్పి రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ నెల 18న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.


మసూద మూవీ టీజర్ వచ్చినప్పుడు ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీలా కనిపిస్తోంది. అయితే వీళ్లు చెప్పినంత కొత్తదనం ఈ ట్రైలర్ లో కనిపించడం లేదు. ఇలాంటి సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఎవరో ఒకరికి దెయ్యం పట్టడం.. ఆ దెయ్యాన్ని విడిపించాలని ప్రయత్నించిన వాళ్లంతా చనిపోవడం అనే కాన్సెప్ట్ చాలా పాతదే. కానీ వీరి మేకింగ్ కొత్తగా ఉంది. టేకింగ్ పరంగానూ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మాత్రం చూడగానే ఆకట్టుకునేలా ఉంది కానీ.. కంటెంట్ మాత్రం కొత్తగా ఏం కనిపించడం లేదు. అయితే ట్రైలర్ లో హీరోయిన్ కావ్య పాత్రను చాలా పరిమితం చేశారు. అంటే తను సినిమాలో ఏమైనా ట్విస్ట్ లు ఇస్తుందేమో.. అవే చిత్రానికి హైలెట్ అవుతాయో.. ఆ కోణంలో సినిమా కొత్తగా ఉంటుందేమో అని ప్రస్తుతానికి మనం సినిమాను ఊహలకు వదిలేయొచ్చు.
సాయి కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రాహుల్ యాదవ్ నిర్మించాడు. దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ తానుగా ముందుకు వచ్చిన రిలీజ్ చేస్తున్నాడంటే ఈ సినిమాలో ట్రైలర్ లో కనిపించని విశేషం ఇంకేదో ఉండే ఉంటుందనుకోవచ్చు. మరి అదేంటో ఈ నెల 18న తేలిపోతుంది.