మసూద మూవీ రివ్యూ

రివ్యూ : మసూద
తారాగణం : తిరువీర్, సంగీత, కావ్యకళ్యాణ్ రామ్, అఖిల రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేశ్ తదితరులు
ఎడిటర్ : జెస్విన్ ప్రభు
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ : నగేష్‌ బానెల్
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
దర్శకత్వం : సాయి కిరణ్‌

కొన్ని కథలు ఎలా ఉండబోతున్నాయో ట్రైలర్స్ చెప్పేస్తాయి. మరికొన్ని సినిమాలు ఎలా ఉంటాయో నిర్మాణ సంస్థలుచెబుతాయి. ఈ రెండూ మిక్స్ అయ్యి.. రిలీజ్ కు ముందే ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన మూవీ మసూద. ట్రైలర్ తో హారర్ మూవీ అని తెలిసింది. బ్యానర్ అంతకు ముందు మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి ఉంది. దీనికి తోడు మసూదను తనే రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చాడు దిల్ రాజు. వెరసి రిలీజ్ కు ముందే ఫుల్ పాజిటివిటీ తెచ్చుకున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :
నీలమ్(సంగీత) భర్త నుంచి విడిపోయి కూతురు నాజియాతో ఉంటుంది. వారి పక్కింట్లో ఉండే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గోపీకృష్ణ( తిరువీర్) వీరి కుటుంబానికి చేదుడుగా ఉంటాడు. గోపీ తన ఆఫీస్ లో మిన్నీని ప్రేమిస్తాడు. ఓ రోజు రాత్రి తనను ఇంటికి తీసుకువస్తాడు. అదే టైమ్ లో నీలమ్ హఠాత్తుగా వచ్చి నాజియా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెబుతుంది. మిన్నీని వదిలేసి తనతో వెళతాడు గోపీ. అక్కడ నాజియా అబ్ నార్మల్ గా ప్రవర్తిస్తుంటుంది. తనకి ఏమైందా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా.. మసూద అనే భయంకరమైన ఆత్మ ఆమెను ఆవహించింది అని తెలుస్తుంది. మసూద ఎవరు..? నాజియాను ఎందుకు ఆవహించింది..? ఆ ఆత్మను ఎలా పారద్రోలారు..? గోపీ ప్రేమకథ ఏమైంది అనేది మిగతా కథ.

విశ్లేషణ :
హారర్ సినిమా అనగానే ఏ భాషలో అయినా ఓ ప్రిపరేషన్ ఉంటుంది. ఇదీ అలాగే 1989లో మొదలవుతుంది కథ. విపరీతమైన హత్యలు చేసే ఓ మంత్రగత్తె కనిపిస్తుంది. ఆ తర్వాత 1999లో ఓ పెద్ద హత్యతో కథ డైరెక్ట్ గా ఈ కాలానికి వస్తుంది. ఇక్కడ నీలమ్, గోపీ, నాజియా, మిన్నీల కథ కనిపిస్తుంది. ప్రిపరేషన్ విషయంలో జాగ్రత్తగానే ఉన్న దర్శకుడు కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. పైగా అవన్నీ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసి ఉన్నట్టే కనిపిస్తాయి. అయినా భయపెడుతూనే ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయిపోతారు. దీంతో ఫస్ట్ హాఫ్‌ బావుంది అన్న ఫీల్ తో బయటకు వస్తాం. ఇక ఆ తర్వాత పీర్ బాబా(శుభలేఖ సుధాకర్) ఎంట్రీతో కథ మొత్తం ఊహించడం పెద్ద కష్టమేం కాదు. కానీ హారర్ మూవీస్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి సెట్ ఆఫ్ సీన్స్ కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడు వచ్చినా.. ఎన్నిసార్లు వచ్చినా ఉలిక్కి పడకుండా ఉండలేం. అలాంటి సీన్స్ కు ఇందులో కొదవ లేదు. ఎవరో ఎటో చూస్తూ.. వెనక్కి తిరగ్గానే పెద్ద ఆర్ఆర్ తో అక్కడో దెయ్యం ప్రత్యక్షం.. ప్రేక్షకులు జడుసుకోవడం సహజంగా వెళ్లిపోతుంటాయి. అయితే మసూద పేరు చెప్పగానే పీర్ బాబా కూడ తనెవరో తెలియక ఓ ఎంక్వైరీ చేయించడం.. అందులో భాగంగా గోపీకృష్ణ డిటెక్టివ్ లా అంతా తెలుసుకునే ప్రయత్నంలో మసూద నేపథ్యం తెలుస్తుంది. అయితే అది అప్పటి వరకూ సన్నివేశాలను దాటి పెద్దగా కనిపించదు. చాలా సాధారణంగా ఉంటుంది. అందుకు కారణం మసూద నేపథ్యాన్ని దర్శకుడు పూర్తిగా వదిలేయం. నాజియాకు పట్టిన దెయ్యం తనే అని తెలుస్తుంది. 1989 నుంచి ఉంటూ.. 1999లో చనిపోయినట్టు చూపించినా.. తనను కేవలం ఓ మంత్రగత్తె అని మాత్రమే వదిలేశాడు. దీంతో అంత ఎఫెక్టివ్ గా కనిపించదు. ఇక సెకండ్ హాఫ్‌ లో చాలా ఎక్స్ పెక్ట్ చేస్తే.. అన్నీ మన ఊహలకు దగ్గరగా సాగే సీన్సే కనిపిస్తుంటాయి. ఇక్కడ దెయ్యం వస్తుంది.. ఇక్కడ హీరోను భయపెడుతుంది అని ముందే ప్రేపేర్ అయ్యేలా కనిపిస్తుంది. అందుకు కారణం.. స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ ఉండటమే. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ సగం నుంచి లాగ్ మరీ ఎక్కువైంది. ఒకటీ రెండు సార్లు అనుకోవచ్చు. అదే పనిగా అవే సీన్స్ రిపీట్ అవుతుంటే.. భయం ప్లేస్ లో చిరాకు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే వీలైనంత ఎక్కువగా సాగదీశారు. వాళ్లు సాధిస్తారు అని తెలిసిన తర్వాత కాస్త క్రిస్ప్ గా రాసుకోవాల్సిందీ సీన్స్.
భయంకరమైన దెయ్యం.. చేసే హత్యలు అలాగే ఉంటాయి. విపరీతమైన రక్తపాతం ఉంది. ఇంత రక్తపాతం మన రెగ్యులర్ తెలుగు హారర్ మూవీస్ లో కనిపించదు. మసూద అనే నేపథ్యం మాత్రమే కొత్తగా ఉంది తప్ప.. ఇలాంటి కథలు తెలుగులో ఇప్పటికే చాలా అంటే చాలానే వచ్చాయి. దెయ్యం పట్టడం.. ఆ దెయ్యాన్ని వదిలించేందుకు పూజారి, మాంత్రికుడు వంటి గెటప్స్, సెటప్స్ చాలా ఉన్నాయి. వాళ్లు ఆత్మను బంధించి నీకేం కావాలంటే తీరని కోరికలు చెప్పడం.. లేదా తను హత్యకు గురయ్యాను అనడం.. తర్వాత వాళ్లు ఆత్మను వదిలించడం.. దీనికోసం కొన్ని హారర్ సీన్స్ కనిపించడం వెరీ కామన్. మసూద అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదు. ఎటొచ్చీ.. దెయ్యంతో పాటు ఆమె పట్టిన వాళ్లు.. విడిపించాలని ప్రయత్నించిన వాళ్లు.. అంతా ముస్లీం కావడం వల్ల ఆ “సంప్రదాయం”లో దెయ్యాన్ని వదిలించారు. అంటే.. మిగతా అంతా సేమ్ టు సేమ్..
ఇన్ని రొటీన్ థింగ్స్ ఉన్నా కూడా మసూద చాలా చాలా భయపెడుతుంది. అందుకు కారణం ఆర్టిస్టులు. గోపీకృష్ణ పాత్రలో తిరువీర్ ఒదిగిపోయాడు. ఒంటరి మహిళగా సంగీత, తన కూతురు పాత్రలో అఖిల చాలా సహజంగా నటించారు. గంగోత్రి ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ను ముందుంచారు కానీ.. తనది గెస్ట్ పాత్రకు ఎక్కువ హీరోయిన్ పాత్రకు తక్కువ. ఈ సినిమా కథకు తనకు అస్సలేమాత్రం సంబంధమే లేదు. మిగతా పాత్రల్లో సత్యం రాజేశ్, శుభలేఖ సుధాకర్ తో పాటు నర్గిస్ పాత్రలో నటించిన సురభి ప్రభావతి నటన చాలా బావుంది. అలాగే మోర్తజా పాత్రలో నటించిన అతనూ బాగా చేశాడు.
టెక్నికల్ గా నెక్ట్స్ లెవెల్ కనిపిస్తుందీ చిత్రం. ప్రశాంత్ ఆర్ విహారి నేపథ్య సంగీతం బ్యాక్ బోన్ లా నిలిచింది. పాటలతో పనిలేని సినిమా అయినా ఒకటో రెండో ఉంటాయి. అవి లెంగ్త్ ను పెంచాయి తప్ప ఉపయోగం లేదు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇలాంటి కావాల్సిన మూడ్ క్రియేట్ అయ్యేలా మంచి లైటింగ్ కూడా కనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా 20 నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు. ఈ లెంగ్త్ వల్లే సినిమా బాగా ల్యాగ్ అయినట్టు కనిపించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా సాయి కిరణ్‌ తను రాసుకున్న కథను హానెస్ట్ గా తెరకెక్కించాడు. కాకపోతే కొత్త సీసాలో పాత సారాలా కనిపించిన ఈ కథ కావాల్సినంత కిక్ ను మాత్రం ఇస్తుంది. అదే స్పెషల్ అనుకోవచ్చు. సీక్వెల్ కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు. బట్.. అంత సీన్ ఉండకపోవచ్చు.

ఫైనల్ గా : మసూద … కొత్త సినిమాలో పాత భయాలు

రేటింగ్ : 3/5

                    - యశ్వంత్ బాబు. కె

Related Posts