మేజర్ పై మేజర్ డెసిషన్ తీసుకున్నారు

అడవి శేష్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘మేజర్’. శశికిరణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం 26/11 ముంబై తాజ్ హోటెల్ దాడిలో వీరమరణం చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా రూపొందుతోంది. అప్పట్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు చేసిన ఈ దాడిని అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొని ఎందరో ప్రాణాలను కాపాడి తను మరణించాడు సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన చూపిన అసమాన త్యాగం గురించి దేశం వేనోళ్ల కొనియాడింది. అలాంటి వీర జవాన్ కథతో వస్తోన్న సినిమా అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు హడావిడీగా విడుదల చేయకుండా తమ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది మేజర్ మూవీ టీమ్.
మేజర్ చిత్రాన్ని మన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ రకంగా ఇది ప్యాన్ ఇండియన్ సినిమానే. కథ కూడా ఆ మేరకే ఉండబోతోంది. కేవలం తాజ్ హోటెల్ దాడిని మాత్రమే కాక.. మేజర్ సందీప్ లైఫ్ లో జరిగిన అత్యంత కీలకమైన కొన్ని అంశాలన కూడా ఈ మూవీలో చర్చించబోతున్నారు. అతని ప్రేమకథ, వైవాహిక జీవితం కూడా మూవీలో కనిపిస్తుంది. ఇక ఫిమేల్ లీడ్ గా సాయీ మంజ్రేకర్ నటిస్తోంది.
మామూలుగా అయితే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నాం అని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. దీంతో తమ చిత్రాన్ని పరిమితుల మధ్య చూడటం కష్టం. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే.. దేశవ్యాప్తంగా ఏ సమస్యా లేదు అనుకున్నప్పుడే విడుదల చేస్తాం.. అప్పటి వరకూ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటించింది మూవీ టీమ్. ఓ రకంగా ఇది సినిమా కోసం ఎదురుచూస్తోన్న వారిని నిరాశ కలిగించినా.. వారి నిర్ణయమూ సరైందే అని చెప్పాలి.

Related Posts