విలక్షణ నటుడుగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసిన సహజ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు బంధవులు. కొన్ని రోజుల క్రితమే ఆయన చనిపోయినట్టు పుకార్లు రాగా.. కుటుంబ సభ్యులు ఖండించారు.

తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్ లోనే కన్నుమూశారు. శరత్ బాబు వయసు 70యేళ్లు. ఆయన పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోని ఆముదాలవలసలో.అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేత పిక్చర్స్ వాళ్లు తమ తొలి చిత్ర రామరాజ్యంలో నటుడుగా అవకాశం ఇస్తూ.. ఆయన పేరును శరత్ బాబుగా మార్చారు. విశేషం ఏంటంటే.. ఆ నాటి నటుల్లా శరత్ బాబు రంగస్థలం అనుభవం ఉన్నవాడు కాదు.కానీ చూడగానే ఆకట్టుకునే రూపం, మంచి గొంతు, అంతకు మించి సంభాషణలు పలకడంలోని విశిష్ట శైలి అన్నీ కలిపి శరత్ బాబును అతి త్వరగానే ప్రేక్షకులకు తగ్గర చేశాయి.

శరత్ బాబు కొన్ని సినమాల్లో హీరోగా నటించారు. విలన్ గానూ చేశారు. కానీ ఆయన్ని దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా క్యారెక్టర్ఆర్టిస్ట్ గానే చూశారు. పాత్ర ఏదైనా అత్యంత సహజంగా ఒదిగిపోవడం శరత్ బాబు శైలి. ఆ శైలితోనే ఆ రోజుల్లో అందరు టాప్ హీరోల సినిమాల్లో అత్యంత కీలకమైన పాత్రలు ఎన్నో పోషించారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల, కొన్ని హిందీ చిత్రాలతో కలిపి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని టివి సీరియల్స్ లోనూ యాక్ట్ చేశారు.

శరత్ బాబు చివరి సినిమా నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ కృష్ణగారి పాత్రను పోషించడం విశేషం. తెలుగువాడే అయినా శరత్ బాబు చెన్నైలో స్థిరపడ్డాడు. ఆయన అంత్య క్రియలు కూడా చెన్నైలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కల్మషం లేని నవ్వుతో నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన శరత్ బాబు మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు అనే చెప్పాలి.