చిరంజీవి ప్రాణం ఖరీదు దర్శకుడు కె వాసు మృతి

టాలీవుడ్ లో విషాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా ఒక్కొక్కరు చనిపోతూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆ తర్వాత రోజు నటుడు శరత్ బాబు కన్నుమూశారు. తాజాగా సీనియర్ దర్శకుడు కె వాసు కన్నుమూశారు. ఒకప్పటి టాప్ డైరెక్టర్ అయిన ప్రత్యగాత్మ గారి అబ్బాయిగా దర్శకత్వంలోకి అడుగుపెట్టాడు కె వాసు. ఆయన తొలి చిత్రం ”ప్రాణం ఖరీదు”తోనే చిరంజీవి కూడా నటుడుగా కెరీర్ ప్రారంభించడం విశేషం.

ఆ తర్వాత చిరంజీవితో చాలా సినిమాలు చేశారు కే వాసు. తండ్రి అడుగుజాడల్లో సినిమకు ఓ సామాజిక బాధ్యత ఉండాలని నమ్మే వ్యక్తి వాసు. చివరి వరకూ ఆ తరహా చిత్రాలు తీయడానే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రమోషన్స్ కు కాస్త దూరంగా ఉండటం వల్ల ఈ తరానికి ఆయన గురించి పెద్దగా తెలియలేదు అని చెప్పొచ్చు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఆయనతో మంచి స్నేహం కూడా ఉండేదని చెబుతారు. అలాగే కృష్ణంరాజుతోనూ మంచి స్నేహ సంబంధాలు కొనసాగించారు. కథా బలం ఉన్న సినిమాలతో పాటు యాక్షన్, కామెడీ మూవీస్ లోనూ తనదైన ముద్రను వేశారు వాసు. ఆయన చిత్రాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉండేవి.

చిరంజీవితో ప్రాణం ఖరీదుతో పాటు కోతల రాయుడు, ఆరని మంటలు చిత్రాలను రూపొందించారు. కృష్ణ – చిరంజీవి హీరోలుగా తోడుదొంగలు, చంద్రమోహన్ – చిరంజీవితో అల్లుల్లొస్తున్నారు చిత్రాలను రూపొందించారు. ఇక ఈయన డైరెక్షన్ లోనే వచ్చిన గ్రేట్ మూవీ శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం. ఈ చిత్రంతో నటుడు విజయ్ చందర్ అభినవ షిరిడీ సాయిగా మారారు. చివరగా పోసాని కృష్ణమురళితో తింగరోడు అనే చిత్రాన్ని రూపొందించాడు కే వాసు.


తనతరం దర్శకుల్లో గౌరవప్రదమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న కే వాసు కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స తీసుకుంటూనే కిమ్స్ హాస్పిటల్ లో ఈ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగు 70ఎమ్ఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Related Posts