యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కంటే ముందే టైటిల్ ను దేవరగా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఈ టైటిల్ తో ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందా అనుకున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే ఇమేజ్ తోనే వచ్చాడు కొరటాల శివ. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం అంచున ఆయుధం పట్టుకుని నల్లటి వస్త్రాలతో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోందనే చెప్పాలి. దీంతో పాటు బోల్తా పడిన చిన్న పడవ.. దాని లోనుంచి బయటకు వచ్చిన కత్తి.. ఆ కింద సంహారం ఏదో జరిగినట్టుగా.. రక్తపు మడుగులో పడి ఉన్న శవాలతో తను ఏ రేంజ్ మాస్ మూవీతో వస్తున్నాడో చెప్పకనే చెప్పాడు కొరటాల.
అన్నిటికీ మించి ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ తో పాటు అతని లుక్ కొత్తగా ఉన్నాయి. ఇప్పటి వరకూ అతను ఈ తరహా పాత్ర చేయలేదు అని ఈ పోస్టర్ చూడగానే అర్థం అవుతోంది. చిన్న పోస్టర్ లోనే ఎంతో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. చూస్తోంటే ప్రారంభం రోజున కొరటాల చెప్పిన మాటలు అక్షర సత్యాలు అనిపిస్తోంది.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. పూర్తిగా కొరటాల మార్క్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉన్న ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్యాన్ ఇండియన్ మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.