కృతిశెట్టిది కేవలం అదృష్టమేనా..?

ఏ రంగంలో అయినా 99శాతం కృషికి ఒక శాతం అదృష్టం కావాలంటారు. కానీ సినిమా పరిశ్రమలో అది రివర్స్. 99శాతం అదృష్టమే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కేవలం అందం అనే ఎంట్రీ కార్డ్ ఉంటే చాలు.. టాలెంట్ మేటర్ ఎవరూ పట్టించుకోరు. దీనికి లక్ కూడా కలిసొస్తే.. ఇక స్టార్డమ్ దానంతట అదే వస్తుందని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్ల విషయంలో చూశాం. ఇప్పుడు కృతిశెట్టి వంతు వచ్చింది. అమ్మడు వరుసగా హాట్రిక్ విజయాలు నమోదు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు అతి తొందరలో ఉంది. బట్ తరచి చూస్తే ఈ మూడ విజయాల్లో తన పాత్ర ఏంటీ అనేది తన టాలెంట్ ను బయటపెడుతుంది.
కృతిశెట్టి మొదటి సినిమా ఉప్పెనలో తన అందం మాత్రమే హైలెట్ అయింది. నటన పరంగా మార్కులు వేయాల్సి వస్తే చాలామంది క్లైమాక్స్ గురించి మాట్లాడతారు కానీ.. ఆ క్లైమాక్స్ సీన్ కోసం ఏకంగా పన్నెండు రోజులు టైమ్ తీసుకున్నారంటే నమ్ముతారా..? యస్.. ఈ సీన్ కే 12 చిత్రీకరణ చేశారు. అంటే అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ కు సెట్ అంతా ఎంతలా జుట్టు పీక్కుని ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆ సీన్ లో ఎదురుగా ఉంది విజయ్ సేతుపతి. తనను అలా ఉత్సవ విగ్రహంలా నిలబెట్టి అతని సజెషన్ లో షాట్స్ తీయడం అంటే దర్శకుడి బుర్ర ఎంతలా హీటెక్కి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక పాటలు, అటు కుర్రాడు వైష్ణవ్ తో పాటు విజయ్ సేతుపతి వంటి ఇతర ప్యాడింగ్ వల్ల సినిమాకు అదనంగా కలిసొచ్చింది కానీ.. కృతిశెట్టి టాలెంట్ వల్ల ఈ చిత్రానికి వచ్చిన అదనపు మైలేజ్ ఏం లేదంటే ఒప్పకోవాల్సిందే.
ఇక శ్యామ్ సింగరాయ్ లోనూ అంతే. ఆర్టిఫిషియల్ ఎక్స్ ప్రెషన్స్ తోనే తను నెట్టుకొచ్చింది. కేవలం ఆ బోల్డ్ సీన్ వల్లే తను కాస్త కనిపించింది కానీ.. ఇతర సన్నివేశాల్లో అయితే తన నటన చూస్తే ఓనమాలు కూడా వచ్చినట్టు అనిపించదు.
లేటెస్ట్ సంక్రాంతి హిట్ బంగార్రాజులో కృతిశెట్టి నటన మరీ దారుణం అంటే దారుణం అనే చెప్పాలి. ఏ నటికైనా, కనీసం మోడల్ కు అయినా తను చేస్తోన్న విషయం ఏంటీ తన పాత్రేంటీ, సీనేంటీ.. అనే అంశాల్లో కనీసం ప్రాథమిక అవగాహన అయినా ఉండాలి. దాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ అనే మరో మెట్టుకు చేరతారు. అసలు ప్రాథమిక అవగాహనే లేనప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా వస్తుంది. అందుకే బంగార్రాజులో సర్పంచ్ నాగలక్ష్మిగా కృతిశెట్టి నటన ఎంత కృతకంగా ఉందో చెప్పలేం. అయినా తనిప్పుడు లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ తగిలించుకుంది.
కానీ తరచి చూస్తే ఈ మూడు సినిమాల విజయాల్లో కృతిశెట్టి పాత్ర అత్యల్పం. కేవలం అదృష్టం వల్లే తను ఆ సినిమాల్లో కనిపించింది. అంతే కానీ నటించింది అనలేం. మరి ఇక ముందైన అమ్మడు కాస్త యాక్టింగ్ లో కనీసం అ ఆ లైనా నేర్చుకుంటే బెటర్. లేదంటే ఆ ఆర్టిఫిషియల్ ఫేస్ బోర్ కొట్టడానికి జనానికి పెద్ద టైమేం పట్టదు.

Related Posts