“బిగ్ బాస్” కు హైకోర్ట్ షాక్ …

బిగ్ బాస్.. వందకు పైగా దేశాల్లో ప్రసారమవుతోన్న టివి రియాలిటీ షో. తెలుగులోనూ కొన్నాళ్ల క్రితం స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఆరో సీజన్ జరుగుతోంది. గత నాలుగు సీజన్స్ ను అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ముందు నుంచీ ఈ షో పై రకరకాల విమర్శలున్నాయి. రాజకీయ నాయకులు సైతం అది బిగ్ బాస్ హౌస్ కాదు.. బ్రోతల్ హౌస్ అంటూ ఘాటుగా కమెంట్ చేశారు. ఆరంభమైన కొత్తలో మంచి రేటింగ్స్ కూడా తెచ్చుకున్న తెలుగు బిగ్ బాస్ కు ఈ సీజన్ లో పెద్దగా రేటింగ్ లేదు. ఈ రేటింగ్ ల కోసం బిగ్ బాస్ తంటాలు పడుతోన్న టైమ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి లాయర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ షోను బూతు షోగా అభివర్ణిస్తూ..

అశ్లీలత ఎక్కువగా ఉందనే ఆరోపణలతో హైకోర్ట్ లో కేస్ వేశాడు. ఈ కేస్ ను ధర్మాసనం విచారణకు తీసుకుని అక్కడా ఘాటుగానే వ్యాఖ్యానించడంతో ఇప్పుడీ కేస్ ప్రాధాన్యతను సంతరించుకుంది.నిజానికి గతంలో కూడా వేర్వేరు రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ రియాలిటీ షో పై కొందరు కేస్ లు వేశారు. కానీ ఎక్కడా ఆగలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోర్ట్ విచారణకు తీసుకుని బిగ్ బాస్ అనేది 70ల్లో వచ్చిన సినిమాల్లా దిగజారుడుగా కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్య చేయడం గమనార్హం. అంతేకాక దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని నిర్వాహకులను కోరుతూ కేస్ ను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.

ఇక ఈ కేస్ లో పిటిషనర్ ప్రధానంగా ఈ షో లో అశ్లీలత, ఎక్స్ పోజింగ్ మితిమీరి కనిపిస్తోందనీ.. ఈ కారణంగా ఈ షోను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ మాత్రమే టివిల్లో ప్రసారం చేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. వీటిని ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫెడరేషన్(ఐబిఎఫ్‌) నిబంధనల ప్రకారమే షోను ప్రసారం చేయాలని కోరాడు. మరి కోర్ట్ వ్యాఖ్యలపై నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారు.. వచ్చే నెల 11న ఎలాంటి నిర్ణయం వస్తుందా అని బిగ్ బాస్ ను వ్యతిరేకించేవారు మాత్రమే కాదు.. అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Related Posts