గుణశేఖర్ కథ ముగిసిపోయినట్టే.. నా..?

ఒకప్పుడు క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. సెట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. కెరీర్ ఆరంభంలోనే ప్రయోగాలూ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఎవరికీ సాధ్యం కాని రీతితో బాలలతో రామాయణం తీసి ఔరా అనిపించుకున్నాడు. మహేష్ బాబుకు కెరీర్ లో ఫస్ట్ మాసివ్ హిట్ ఒక్కడు ఇచ్చింది గుణశేఖర్. మెగాస్టార్ కు చూడాలని ఉంది అంటూ డిఫరెంట్ హిట్టూ ఇచ్చాడు. మనోహరం లాంటి మూవీస్ తోనూ ఆకట్టుకున్నాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి ఘనాపాఠీలైనా ఒక్కసారి ట్రాక్ తప్పితే మళ్లీ ట్రాక్ ఎక్కడం చాలా చాలా కష్టం.

ఈ కష్టాన్ని చాలాకాలంగా అనుభవిస్తూ వస్తున్నాడు గుణశేఖర్. మహేష్ బాబుతో వరుసగా మూడు సినిమాలు చేశాడు. ఒక్కడు బిగ్గెస్ట్ హిట్. అర్జున్ హిట్. సైనికుడు ఫ్లాప్. అప్పటి నుంచే గుణశేఖర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకూ మళ్లీ హిట్టెక్కలేదు అతను. సైనికుడు పోయిన నాలుగేళ్లకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తే.. ఐదు రోజుల పెళ్లి అంటూ నానా హడావిడీ చేసిన ఆ మూవీ వరుడు ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో నిలిచింది. రవితేజ కూడా ఆఫర్ ఇచ్చాడు.

అందుకోసం మరో దర్శకుడు వైవిఎస్ చౌదరి నిర్మాతగా మారి గుణశేఖర్ కు డైరెక్టర్ చైర్ ఇస్తే.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఈ క్రేజీ కాంబోలో వచ్చిన ‘నిప్పు’ డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ లాంగ్ గ్యాప్ తీసుకుని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ రుద్రమదేవిని తలకెత్తుకున్నాడు. ఎన్ని ఫ్లాపులు ఉన్నా.. గుణశేఖర్ డైరెక్షన్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. అభిమానులూ ఉన్నారు. అందుకే అనుష్క అతనికి ఎస్ చెప్పింది.


రుద్రమదేవి టూ డీ వరకూ ఓకే. కానీ ఎవరు చెప్పినా వినకుండా త్రీడీలో తీసి చేతులు కాల్చుకున్నాడు. పైగా అప్పటికే బాహుబలి వంటి విజువల్ వండర్ చూసిన ఆడియన్స్ నాసిరకం గ్రాఫిక్స్ తో ఉన్న రుద్రమదేవి నచ్చలేదు. అయినా కొంత వరకూ విమర్శలను మెప్పించాడు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఆడియన్స్ టేస్ట్ మారింది. అది దాటి చేసే ఆలోచనే ఫస్ట్ ఫెయిల్యూర్.

ఇద్దరు లెజెండ్స్ రియల్ స్టోరీని ఫిక్షన్ గా మార్చి రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో విజయం అందుకున్నాడు.నిజానికి అవి ఇండివిడ్యువల్ స్టోరీస్ అయితే చాలా మైనస్ లు వెదికేవాళ్లు జనం. బట్ ఫిక్షన్ మాయలో అన్నీ కొట్టుకుపోయాయి. ఈ విషయంలో గుణశేఖర్ ఆలోచన సరిగా లేదు అనేందుకు తాజాగా వచ్చిన శాకుంతలం ఒక నిదర్శనం.


మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే కావ్యాన్ని దృశ్యంగా మార్చాలనుకున్నాడు. అంత పెద్ద కావ్యాన్ని సినిమాగా చేయాలనుకోవడమే సాహసం. భారీ బడ్జెట్ ఉంటే తప్ప సాధ్యం కాదు. అదీ కాక అసలు ఏం చూపించాలి.. ఏ కోణంలో తను అనుకున్న పాత్రలను ప్రెజెంట్ చేయాలి అనే క్లారిటీ ఉండాలి. ఈ కథలో రెండూ మిస్ అయ్యాయి.

దీంతో తనేం అనుకున్నాడో తెలియదు కానీ.. ఆడియన్స్ కు ఏదీ కన్వే కాలేదు. దీంతో సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం మొదటి ఆటకే తేలిపోయింది. అన్నట్టు ఈ చిత్రాన్ని కూడా మళ్లీ త్రీడీలోనే తీశాడు. మన రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో ఈ సౌకర్యం లేదు. అయినా అనవసరమైన ఖర్చుపెట్టి అదనంగా బడ్జెట్ పెంచుకున్నాడు.


మొత్తంగా కాళిదాసు శాకుంతలం మహా కావ్యం అనిపించుకుంటే.. గుణశేఖర్ తీసిన శాకుతంలం ‘ఖాళీ బాస్’అనిపించుకుంది. కథను ఎత్తుకోవడం నుంచి శకుంతల పుట్టుకను చెప్పే ప్రధాన ఘట్టంలోనే ఫెయిల్ అయ్యాడు. ఏ పాత్రకూ సరైన ఔన్నత్యం కనిపించలేదు అనే టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ పాత్రకు అసలు సమంత రాంగ్ ఛాయిస్ అని యూనానిమస్ గా చెబుతున్నారు.

నిజానికి తెలుగులో శాకుంతలాన్ని ఓ ప్రణయ కావ్యంలానే చూస్తారు. కానీ గుణశేఖర్ మాత్రం శకుంతలలోని ధీరత్వాన్ని చూపించాలనుకున్నాడు. అది ఒరిజినల్ కావ్యంలో ఒక చిన్న భాగంగా కనిపిస్తుంది. దాన్ని పెద్దగా చూపించాలనుకున్నప్పుడు అందుకు తగ్గ కసరత్తు పేపర్ పైనే చేయాలి. మొత్తంగా రుద్రమదేవి టైమ్ కే గుణశేఖర్ ను ఇక కష్టం అనుకున్నారు. ఈ శాకుంతలం తర్వాత అతని కథ ముగిసిపోయినట్టే అనే కంక్లూషన్ కు వస్తున్నారు.. జనమే కాదు. ఇండస్ట్రీ కూడా.

Related Posts