సాధారణంగా ఓ పెద్ద హీరో సినిమా వస్తోందంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు బరిలో నిలిచేందుకు భయపడతాయి. అలాంటిది మెగాస్టార్ లాంటి హీరో సినిమా వస్తోంటే ఇంకా ఊరూపేరూ లేని ఓ చిన్న హీరో సినిమాను ఆయనకు పోటీగా వేయడానికి ఓ నిర్మాత.. మరో మెగా హీరో ఫ్రెండ్ ధైర్యం చేశాడు. అయితే చాలామంది దీన్ని తప్పని పరిస్థితిగానే భావిస్తున్నారు. మెగాస్టార్ సినిమా అంటే ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. యస్.. గాడ్ ఫాదర్. దసరా బరిలో అక్టోబర్ 5న ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రాబోతోంది. దీంతో పాటు మరో రెండు పెద్ద సినిమాలు నాగార్జున ఘోస్ట్ తో పాటు మంచు విష్ణు జిన్నా కూడా లైన్ లో ఉన్నాయి. ఘోస్ట్ డిఫరెంట్ జానర్ సినిమా. జిన్నా విష్ణు మార్క్ ఎంటర్టైనర్. వీటితో పాటు అస్సలే మాత్రం ఆడియన్స్ కు తెలియని హీరో సినిమాను వీరికి పోటీగా నిలుపుతూ మెగా, అండ్ కింగ్ నాగ్ కు ఛాలెంజ్ విసిరినంత పనిచేస్తున్నాడీ ప్రొడ్యూసర్.


ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరూ అనుకుంటున్నారా.. వరుస విజయాలతో ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ అనిపించుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఈయన పేరు చెప్పగానే అటు త్రివిక్రమ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు బాగా దగ్గరివాడుగా అందరికీ తెలిసిపోతాడు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్‌ తో భీమ్లా నాయక్ తీసి హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ లో కూడా నాగవంశీపై ఓ రకమైన అభిమానం ఉంది. అయినా లేటెస్ట్ గా తన బ్యానర్ లో రూపొందిన స్వాతిముత్యం చిత్రాన్ని గాడ్ ఫాదర్ తో పాటు థియేటర్స్ లో వదలబోతున్నాడు. ఇది మెగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే కంటే అతను ఆ పరిస్థితిలోకి వెళ్లిన సిట్యుయేషన్ ను మాత్రమే చూడాలి అంటున్నారు చాలామంది.


బెల్లంకొండ సురేష్‌ రెండో కొడుకు గణేష్‌ హీరోగా రూపొందిన సినిమా స్వాతిముత్యం. ఇలాంటి డెబ్యూ హీరో సినిమాతో మెగాస్టార్ ను ఢీ కొట్టడం అంటే అదో పెద్ద సాహసం అనే చెప్పాలి.. మామూలుగా నాగవంశీకి వివాదరహితుడుగా పేరుంది. ఇలాంటి విషయాలో తను తగ్గే గుణం కూడా ఉంది. కానీ తన బ్యానర్ లో వరుసగా సినిమాలున్నాయి. అందుకే కొన్ని రిలీజ్ డేట్స్ ను మిస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ కారణంగానే సాహసం అని తెలిసినా గాడ్ ఫాదర్ తో పాటు స్వాతిముత్యం చిత్రాన్ని విడుదల చేస్తన్నాడు. గాడ్ ఫాదర్ లో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాంటి హీరోలతో పాటు తన చిత్రాన్ని విడుదల చేయడం అనివార్యం వల్లే తప్ప మరోటి కాదనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి వినిపిస్తోన్న వెర్షన్. మరోవైపు స్వాతిముత్యం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా.. పండగ టైమ్ లో కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ వినోదం అందించే సినిమాగా రూపొందింది. ఓ రకంగా ఆ కాన్ఫిడెన్స్ కూడా వీరిలో ఉంది.
ఏదేమైనా గణేష్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అలాంటిది మెగాస్టార్, నాగ్ లాంటి హీరోలతో ఢీ కొట్టడం అంటే అది తమ ప్రోడక్ట్ పై నమ్మకమే అనుకోవాలి.. మరి ఇది తన ప్రాజెక్ట్ పై కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అతి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఏదేమైనా మెగాస్టార్ ను ఢీ కొట్టడానికి ఈ యువ నిర్మాత వెనకాడకపోవడం కొంత ఆశ్చర్యంగానే కనిపిస్తోంది.