‘స్వాతి ముత్యం’ ట్రైలర్ విడుదల వేడుక

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం’స్వాతిముత్యం’. ‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్లమ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.

*ఆకట్టుకుంటున్న ‘స్వాతి ముత్యం’ ట్రైలర్

* సహజత్వంతో కూడిన సున్నితమైన వినోదాన్ని పంచేలా ట్రైలర్

“నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు” అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి, ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సన్నివేశాలకు తగ్గట్లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్న నేపథ్య సంగీతంతో పాటు, “మీరు నాకు చూడగానే నచ్చేశారండీ.. అది కూడా ఎంతలా అంటే మిమ్మల్ని చూశాక ఇంకెవరినీ చూడకూడదని ఫిక్స్ అయ్యేంతలా”, “నా ఇంట్లో నాకేం తెలియట్లేదు బాబోయ్”, “ఏమే ఆ స్వీట్లు, జాంగ్రీలు లోపల పెట్టించు”, “ఓవరాల్ గా క్యారెక్టర్ లో మావాడు స్వాతిముత్యం” వంటి సంభాషణలు విశేషంగా ఆకట్టుకంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ దసరాకు కుటుంబమంతా కలిసి చూసి సరదాగా పండగ చేసుకునేలా సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. “ముందుగా నేను గణేష్ కి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందు కలిసింది గణేష్ ని. ఈ కథ అంగీకరించినందుకు గణేష్ కి బిగ్ థాంక్స్. ఈ సినిమా రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కాదు. సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్ లో ఒకబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లి చేసే విధానం, ఆ సిచ్యువేషన్ లో అబ్బాయికి వచ్చే ప్రాబ్లమ్ చూపించబోతున్నాం. చాలా విచిత్రంగా ఉంటుంది. అబ్బాయి లైఫ్ లో ఒక విచిత్రమైన ప్రాబ్లెమ్ వస్తే, ఆ అబ్బాయి ఎలా ఫేస్ చేస్తాడు? ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? మన చుట్టూ ఉండేవారు ఆ ప్రాబ్లెమ్ కి ఎలా రియాక్ట్ అవుతారు? ఇలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గణేష్ కూడా చాలా బాగా చేశాడు. ఈ కథ రాస్తున్నప్పుడే హీరోయిన్ గా వర్ష బాగుంటుందని అనుకున్నాను. ఆమె పేరు సజెస్ట్ చేయగానే ప్రొడ్యూసర్స్ కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించిన రావు రమేష్ గారు, నరేష్ గారు, గోపరాజు రమణ గారు, ప్రగతి గారు, సురేఖా వాణి గారు, వెన్నెల కిషోర్ గారు అందరూ సూపర్ గా చేశారు. ఈ సినిమాలో వారిని చూస్తుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసినట్టు అనిపిస్తుంది. వంశీ(నిర్మాత నాగ వంశీ) అన్నకు బిగ్ థాంక్స్. స్క్రిప్ట్ వినగానే నన్ను చాలా నమ్మారు. ఆయన నా మీద చూపించిన నమ్మకం, నాకు ఇచ్చిన భరోసాకి ధన్యవాదాలు. మహతి స్వర సాగర్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. సినిమాకి పని చేసిన అందరికీ థాంక్స్” అన్నారు.

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. “మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ నవ్వు ముఖాలు చూస్తుంటేనే ట్రైలర్ నచ్చిందని అనిపిస్తుంది. కొత్త ప్రతిభకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో అవకాశం ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. థ్యాంక్యూ వంశీ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. లక్ష్మణ్ గారి గురించి చెప్పాలంటే.. స్మాల్ టౌన్ నుంచి వచ్చిన వారిలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆది ఆయనలోనూ, ఆయన రైటింగ్ లోనూ, ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. గణేష్ కిది మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా చేశాడు. ఆయన క్రమశిక్షణ, సెట్స్ అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది. గణేష్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను” అన్నారు.

గణేష్ మాట్లాడుతూ.. ” 2020 లో కరోనా వచ్చిన టైంలో ఒక సినిమా స్టార్ట్ చేద్దామని కంగారు పడుతున్న టైంలో లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడు. ఈ కథ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి సితార దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. ఇంత భారీ తారాగణంతో సినిమా అద్భుతంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే దానికి ప్రధాన కారణం వంశీ గారు. ఆయనకు నా కృతఙ్ఞతలు. నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. టెన్షన్ గా ఉంది. ఏం చెప్పాలో, ఎలా ఉండాలో కూడా నాకు అర్థంకావట్లేదు. కానీ ట్రైలర్ లో చూసినట్టుగానే ఈ సినిమా చాలా సరదాగా.. మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథ లాగా ఉంటుంది. సినిమా చాలా బాగుంది. మంచి మ్యూజిక్ అందించిన మహతి గారికి, నేను ఇంత అందంగా ఉంటానా అని నాకు నేనే అనుకునే అంత అందంగా చూపించిన డీఓపీ సూర్య గారికి, నేషనల్ అవార్డు విన్నర్ ఎడిటర్ నవీన్ నూలి గారికి థాంక్స్. ఇంత మంచి స్టొరీ నాకు ఇచ్చిన లక్ష్మణ్ బ్రదర్ కి థాంక్స్. వర్ష నన్ను కొత్త హీరోలాగా ట్రీట్ చేయలేదు. సెట్ లో చాలా సపోర్ట్ గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్స్ లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: అవినాష్ కొల్ల

పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ

Related Posts