రాజమౌళి అయినా సుకుమార్ తర్వాతే ..?

ఒక సినిమా మొదలైందంటే.. దాని అవుట్ పుట్ బెస్ట్ గా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అలాగే ఆ సినిమా మేకర్స్ నుంచి కూడా అవుట్ పుట్ ఆశిస్తారు. మళ్లీ ఇదేంటీ అనిపిస్తోంది కదా..? నిజమే.. ఒకక సక్సెస్ ఫుల్ మేకర్ ను గుర్తించాలంటే అతను ఎన్ని హిట్ మూవీస్ తీశాడు అని మాత్రమే కాదు.. తనతో పాటు ఇంకెంతమంది హిట్ మూవీస్ తీయగల దర్శకులను అందించాడు అనేది కూడా చూడాలి. అలా చూస్తే ఆస్కార్ వరకూ వెళ్లిన(ఆస్కార్ రాజమౌళికి, అతని సినిమాకు రాలేదు కాబట్టి) రాజమౌళి..

సుకుమార్ కంటే చాలా చాలా వెనకే ఉండిపోయాడు అనేది నిజం. పైగా ఆ నిజం కళ్లముందు కనిపిస్తోంది కూడా. రాజమౌళి తోపు దర్శకుడే. ప్యాన్ ఇండియన్ డైరెక్టరే. కానీ తన శిష్యులెవరూ కనీసం తెలుగు స్టేట్స్ ను అలరించిన వారు ఒక్కరూ లేరు. ఇంకా చెబితే అతనికి మొదటి నుంచీ సపోర్ట్ గా ఉన్న త్రికోటి అనే కో డైరెక్టర్ దర్శకుడైతే.. అస్సలు ఆ మార్కే కనిపించలేదు.

పోనీ ఇతను కొత్త మార్క్ కోసం ప్రయత్నించాడు అనుకున్నా.. అది కూడా కనిపించలేదు. బట్ సుకుమార్ శిష్యులు అలా కాదు. కొన్నాళ్ల క్రితం వచ్చి కుమార్ 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ ఓ రకంగా అప్పుడే సాహసం చేశాడు. హీరోయిన్ తో అలాంటి పాత్ర చేయించడం.. హీరో తప్పును ఒప్పుకుని హీరోయిన్ కోసం నిలబడటం అనేది అప్పుడు చాలా కొత్త పాయింట్. పైగా సినిమా కూడా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయింది.
సుకుమార్ మరో శిష్యుడు బుచ్చిబాబు కూడా అంతే.

ఉప్పెన సినిమాతో పెద్ద సాహసం చేశాడు. పైగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మాత్రమే చూస్తారు అనే పాయింట్ ను దాటి తన ఉప్పెన సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. హీరోగా వైష్ణవ్ కు తిరుగులేని లాంచింగ్ గా నిలిచింది. ఈ విజయమే బుచ్చిబాబుకు ఏకంగా రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ తెచ్చింది.


ఇక లేటెస్ట్ గా దసరా. సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన సినిమా. ఇందులో సుకుమార్ మార్క్ టేకింగ్ కనిపించింది అన్న పేరు వచ్చింది. నిజమే.. గురువు మార్క్ శిష్యుడిలో కనిపిస్తే తప్పేముందీ. ఒకప్పుడు, దాసరి, కె విశ్వనాథ్ లాంటి వారు కూడా వారి గురువుల అడుగు జాడల్లో ప్రయాణం మొదలుపెట్టి.. తర్వాత తమ అడుగుజాడల్లో వేరే వారు నడిచేలా తమను తాము మలచుకున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గురించి అంతా చెబుతున్న మాట ఒక్కటే.

ఇతను ఫస్ట్ టైమ్ డైరెక్టర్ లా లేడు అని. అందుకు కారణం.. అతని వెనక సుకుమార్ అనే ధైర్యం ఉంది. సుక్కూ శిష్యుడిని అనే కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్లే కాదు.. సుకుమార్ స్కూల్ నుంచి ఇంకా చాలామంది దర్శకులు రాబోతున్నారు. బట్.. రాజమౌళి తనలాంటి.. కాదు కాదు.. కనీసం ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ను అయినా తెలుగు సినిమాకు ఇవ్వగలడా అనేది పెద్ద ప్రశ్న. ఇదే టైమ్ లో సుకుమార్ రాజమౌళిలా ఆస్కార్ ను తెచ్చుకోగలడా అనే ప్రశ్నా రావొచ్చు. నిజమే. కానీ ఆస్కార్ అనేది కేవలం ప్రతభకు మాత్రమే తార్కాణం కాదు అని ఇదే సినిమాకు సంబంధించి అనేకానేక చర్చలు నిరూపించాయి కదా..? సో అదన్నమాట.

Related Posts