నాగచైతన్యకు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసా..?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. మొదట్లో కాస్త తడబడ్డా.. కొన్నాళ్లుగా స్థిరమైన హిట్లు కొడుతున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ.. రీసెంట్ గా సదరు హీరోయిన్ కు విడాకులు ఇచ్చాడు. ఆ విషయంలో చాలామంది చైతూనే సపోర్ట్ చేయడం విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే అతని క్యారెక్టర్ అలాంటిది అంటారు. ఏ హీరో అయినా ఒకటీ రెండు హిట్లు పడగానే నానా హడావిడీ చేస్తూ.. చుట్టూ పదిమందిని పెట్టుకుని ఓ హంగామాగా కనిపిస్తారు. కానీ చైతూ విషయంలో అలాంటిది ఎప్పుడూ కనిపించలేదని ఎవరైనా చెబుతారు. ప్రస్తుతం బంగార్రాజు, థ్యాంక్యూతో పాటు బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా చిత్రాల్లో నటిస్తున్నాడు చైతన్య. అలాగే ఓ వెబ్ సిరీస్ ను కూడా ఓకే చేసినట్టు సమాచారం.
ఇక నాగార్జున తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన చైతూ తల్లి రామానాయుడు కూతురు. నాగచైతన్య పుట్టిన తర్వాత వారు విడిపోయారు. కానీ చైతూ పుట్టక ముందే ఆ పేరు పెట్టాలని నాగార్జున డిసైడ్ అయ్యాడట. అంటే నాగచైతన్య అనే పేరుకు ఓ చరిత్ర ఉంది. మరి ఆ చరిత్ర ఏంటో తెలియాలంటే నాగార్జున అరణ్య కాండకు వెళ్లాల్సిందే. నాగార్జున హీరోగా నిలదొక్కుకుంటోన్న దశలో ‘అరణ్యకాండ’అనే సినిమా చేశాడు. ఫేమస్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన క్రాంతికుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో నాగ్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ‘మేన్ ఈటర్’అయిన ఓ పులిని పట్టుకునే క్రమంలో సాగే కథ ఇది. ఈ కథను అప్పటి(అఫ్ కోర్స్ ఇప్పటికీ) ఫేమస్ రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావు రాశారు. ఆయన తన హీరోకు చైతన్య అనే పేరు పెట్టారు. అంటే అరణ్యకాండలో నాగార్జున పాత్ర పేరు చైతన్య అన్నమాట.
చైతన్య అనే పేరు నాగ్ కు విపరీతంగా నచ్చిందట. దీంతో కొమ్మనాపల్లి గణపతిరావుతోనే ఈ పేరు నాకు నచ్చింది.. ఒకవేళ నాకు కొడుకు పుడితే(అప్పటికి చైతన్య తల్లి ప్రెగ్నెంట్) చైతన్య అనే పేరే పెడతాను అన్నారట. అన్నట్టుగానే తన తండ్రి నాగేశ్వరరావు కలిసొచ్చేలా నాగ ముందు పెట్టినా తర్వాత చైతన్య అనే పెట్టాడు. ఈ విషయం ఆ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. సో చైతూ పేరు వెనక ఇంత పెద్ద కథ ఉందన్నమాట.

Related Posts