గొయ్యి తవ్వుకుంటున్న చైనా ఇండియాకి బంపర్ ఆఫర్….!!
Latest

గొయ్యి తవ్వుకుంటున్న చైనా ఇండియాకి బంపర్ ఆఫర్….!!

డ్రాగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే.. కరోనా మహమ్మారి ఆ దేశం నుండి ఏ ముహూర్తాన బయటకు వచ్చిందో కానీ, నాటి నుండి ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది.. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం… ఆ దేశ జాతి సమస్తం… కరోనా మహమ్మారి పీడితం.. ప్రపంచ దేశాలన్నీ ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో అల్లాడుతుంటే… ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లు ఆ దేశం తన కంపెనీలపై తానే ఉక్కుపాదం మోపుకుంటోంది.. తన దేశీయ కంపెనీలను ఎదగకుండా అణగదొక్కుతోంది.. ఇది భారత్ కి వరంలా మారే చాన్స్ కనిపిస్తోంది..

ఇటీవల చైనాకి చెందిన పలు ఆన్ లైన్ ఎడ్యుటెక్ కంపెనీలపై పలు ఆంక్షలు విధించింది.. ఈ కంపెనీలను పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా నిషేధం విధించింది.. దీంతో, అప్పటిదాకా లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన పలు కంపెనీల ధరలు ఒక్కసారిగా వందల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి.. టీఎల్ ఎడ్యుకేషన్ మార్కెట్ విలువ 59 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు నాలుగు లక్షల కోట్లు.. చైనా నిషేధం విధించిన వెంటనే దీని విలువ ఒక్కసారిగా ఇరవై వేల కోట్ల దిగువకు డౌన్ అయింది.. మరో ఆన్ లైన్ విద్యా సంస్థ గవోటు ఎడ్యుటెక్ ది సైతం సేమ్ స్టోరీ.. ఈ సంస్థ మార్కెట్ విలువ అప్పటిదాకా 38 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు 2 లక్షల కోట్లకుపైమాటే.. డ్రాగన్ అధినాయకత్వం ఈ ఆన్ లైన్ కంపెనీల మార్కెట్ పై నిషేధం విధించింది. అంతే, దీని విలువ సడెన్ గా నాలుగు వేల కోట్లకు పడిపోయింది.. ఈ సంస్థలనే కాదు.. గతంలో డ్రాగన్…. చైనా బిల్ గేట్స్ గా భావించే జాక్ మా కంపెనీలపై సైతం ఇలాంటి నిషేధమే విధించింది..

డ్రాగన్ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే తన కంపెనీలపై తానే ఉక్కుపాదం మోపుతోందట.. దీనికి పలు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.. ముఖ్యంగా చైనాలో జాక్ మా తోపాటు టిక్ టాక్ యజమాని ఝూంగ్ యిమింగ్ ని సైతం ఎదగనీయకుండా అణగదొక్కుతోంది.. ఇందుకు ప్రధాన కారణం.. చైనాని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తోన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నేతలను మించి… ఈ కంపెనీల యజమానులకు పాపులారిటీ పెరుగుతోందట.. ప్రజలు ముఖ్యంగా అక్కడి యువతలో జాక్ మా, ఝూంగ్ యిమింగ్ ఫాలోయింగ్ పెరుగుతుండడం, వారిపై ఆరాధన భావం ఎగసిపడుతుండడంతో….. తమను మించి వారికి పబ్లిసిటీ రావడాన్ని సహించలేకపోతుందట కమ్యూనిస్ట్ నాయకత్వం.. త్వరలో ఇది ప్రజాస్వామ్య భావనలకు ఊపిరిపోయడం ఖాయమని భావిస్తున్నారట.. భవిష్యత్తులో అది కమ్యూనిస్ట్ పార్టీకి పెను సవాల్ గా మారడం గ్యారంటీ అని అంచనాకు వచ్చిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారట..

మరోవైపు, చైనా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వెళ్లి .. విదేశాల నుండి నిధులను సేకరిస్తే.. ఫారిన్ కంపెనీలు వాటిలో పెట్టుబడులు పెడితే, తమ దేశ ప్రజల వివరాలు వారికి వెళతాయని, ఇది పెను సవాల్ గా మారుతుందని, వారికి మెస్సేజ్ లు పెట్టడం, వారి డేటాని మిస్ యూజ్ చేసే చాన్స్ ఉందని భావిస్తున్నారని అంచనా వేస్తోందట చైనా అధినాయకత్వం..

తన కంపెనీలపై తానే ఆంక్షలు వేస్తోన్న డ్రాగన్ అడుగులు భారత్ కంపెనీలకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు ఆర్ధిక నిపుణులు.. తమ పెట్టుబడులను చైనా కంపెనీల నుండి ఉపసంహరించుకొని భారత్ వైపు అడుగులు వేస్తారని లెక్కలు కడుతున్నారట.. మరి, రాబోయే రోజులలో వీటి పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో, అటు చైనాలో, ఇటు ఇండియాలో సీన్ ఎలా మారుతుందో చూడాలి..

Post Comment