నిర్మాతగా రమేష్ బాబుకు కలిసిరాని సోదరుడు మహేష్ స్టార్ డమ్

సోదరుడు రమేష్ బాబు అంటే మహేష్ కు చాలా ప్రేమ, అభిమానం. హీరోగా సినిమాలు మానేసిన రమేష్ బాబును మంచి ప్రొడ్యూసర్ ను చేయాలని మహేష్ ఆలోచించేవారు. 90 దశకం చివరకు వచ్చే సరికి రమేష్ బాబు హీరోగా నటించడం ఆపేశారు. తన కెరీర్ కు స్వస్తి చెప్పారు. అయితే సినిమా పరిశ్రమతో తనకున్న అనుబంధాన్ని మానుకోలేకపోయారు. రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత మురారితో స్టార్ అయ్యాడు మహేష్ బాబు. ఒక్కడు సినిమా తర్వాత మహేష్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ అయ్యాడు. ఈ టైమ్ లోనే మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబుకు నిర్మాతగా బ్రేక్ ఇవ్వాలనుకున్నారు. అప్పటికే రమేష్ బాబు తెలుగు సూర్యవంశం సినిమా హిందీ రీమేక్ సూర్యవంశ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.

ఒక్కడు సూపర్ హిట్ కాంబో మహేష్ బాబు, దర్శకుడు గుణశేఖర్ లతో ఓ సినిమాకు ప్లాన్స్ మొదలయ్యాయి. ఈ చిత్రానికి తన సోదరుడు రమేష్ బాబు నిర్మాతగా ఉంటే బాగుంటుందని మహేష్ ఆలోచన. మహేష్ కు అప్పుడున్న స్టార్ డమ్ కు సినిమా చేసేందుకు నిర్మాతల క్యూ ఉండేది. సోదరుడితో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేయాలని ముందుకొచ్చారు రమేష్ బాబు. అలా అర్జున్ సినిమా ప్రారంభమైంది. అప్పట్లోనే దాదాపు 4 కోట్ల రూపాయలతో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ వేశారు. అక్కా తమ్ముడి సెంటిమెంట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అర్జున్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. పైగా పైరసీ దెబ్బతో సినిమా ఆర్థికంగా కుదేలైంది. టాలీవుడ్ అంతా ఒక్కటై పైరసీకి వ్యతిరేకంగా కదిలింది. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకు బాగా సపోర్ట్ గా నిలబడ్డారు. ఏమైనా అర్జున్ ఆర్థిక నష్టాల పాలైంది.

అర్జున్ కు పరిహారంగా సోదరుడికి మరో సినిమా చేయాలనుకున్నాడు మహేష్. కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే లాంటి హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా ప్లాన్ చేశారు. నమ్రత శిరోద్కర్ ఆలోచనతో బాలీవుడ్ నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ తో కలిసి రమేష్ బాబు కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతిథి నిర్మాణం మొదలుపెట్టింది. లిమిట్ దాటిన ఎమోషన్స్ తో తెరకెక్కిన అతిథి కి ఆడియెన్స్ వెల్కమ్ చెప్పలేకపోయారు. దాంతో ఈ సినిమా కూడా నిర్మాతగా రమేష్ బాబును నిరాశపర్చింది, ఆర్థికంగా దెబ్బతీసింది.

ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరిగాయి. ఈ సినిమాకు రమేష్ బాబు భాగస్వామిగా ఉండాలని మహేష్ బాబు కోరుకున్నాడు. ఈ విషయాన్నే దర్శకుడు రాజమౌళికి చెప్పారు. మరో నిర్మాతకు సోలోగా సినిమా చేస్తానని అప్పటికే చెప్పిన రాజమౌళి మహేష్ కోరికకు అంగీకారం తెలపలేదు. ఆ కారణంగా యమదొంగ టైమ్ లో పట్టాలెక్కాల్సిన రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా రమేష్ బాబు చేసి ఉంటే అది అతనికి సక్సెస్ ఫుల్ సినిమా అయి ఉండేదేమో. కానీ అలా జరగలేదు. సోదరుడు మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ కూడా నిర్మాతగా తనని నిలబెట్టలేకపోయింది.

Related Posts