ముందైతే భీమ్లా నాయక్, వెనకైతే ఎఫ్ 3కి ఎఫెక్ట్

ఒక సినిమా పరిశ్రమలో ఇంత గందరగోళం క్రియేట్ చేయడం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అలాంటి సమస్య రాలేదు. బట్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా సంక్రాంతి సినిమాలన్నీ చెల్లా చెదురయ్యాయి. చివరి నిమిషం వరకూ భీమ్లా నాయక్ పోరాడాడు. కానీ అతనూ తప్పుకోక తప్పలేదు. ఏమైతేనేం చివరికి ఒమిక్రాన్ పేరు చెప్పి ఆ పెద్ద సినిమా కూడా బరి నుంచి తప్పుకుంది. ఓవరాల్గా బంగార్రాజు తప్ప మరో పెద్ద సినిమా లేకుండానే సంక్రాంతి సందడి ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ మరోసారి రెండు పెద్ద సినిమాలకు ఇబ్బందిగా మారబోతోంది.
రాజమౌళి ఈ సారి తెలివిగా రెండు రిలీజ్ డేట్స్ వదిలాడు. ఒకటి మార్చి 18. రెండోది ఏప్రిల్ 28. ఇందులో రెండోది అతనికి ఫేవరెట్ డేట్ అంటారు. అయితే ఈ రెండు డేట్స్ లోనూ కాస్త అటూ ఇటూగా సినిమాలున్నాయి. ముందుగా మార్చి 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ ఉంది. వీళ్లు సంక్రాంతి బరిలో జనవరి 12న రావాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేయించారు బలవంతంగా. దీంతో ఇష్టం లేకున్నా మార్చి 25న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు దానికి ఒక వారం ముందుగా ఆర్ఆర్ఆర్ వేశారు. ఇంతకు ముందు కూడా వారమే గ్యాప్. అయినా పోస్ట్ పోన్ చేయించారు. మరి ఇప్పుడూ అంతే కదా.. అంటే ఇప్పుడూ పోస్ట్ పోన్ చేయిస్తారా లేక బరిలోనే ఉంటారా అనేది తేలాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ సారి వాయిదా వేయడానికి అస్సలు ఒప్పుకోకపోవచ్చు అనేది అందరికీ తెలిసిందే.
ఇక రెండో డేట్ గా ఏప్రిల్ 28ని అనౌన్స్ చేశాడు రాజమౌళి. నిజానికి ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 29న వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఎఫ్3’ఉంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి నెక్ట్స్ డేనే రాజమౌళి కూడా ఒకరోజు ముందు విడుదల అంటూ వేశాడు. సో.. అనివార్యంగా వీళ్లు కూడా వాయిదా వేయాల్సిందే అనేలా సంకేతాలిచ్చినట్టైంది. మొత్తంగా ఈ మూడు సినిమాలకూ మేజర్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. అతని చేతిలో పని కాబట్టి.. ఎవరిని ఎప్పుడు విడుదల చేయాలని ఆదేశిస్తాడో అప్పుడే అది జరుగుతుంది.

Related Posts