కాంపిటీషన్ ఉంటేనే ఖలేజా తెలుస్తుంది. స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఎప్పుడూ ఆడియన్స్ తోపాటు ఫ్యాన్స్ లో కిక్ ఇస్తుంది. ఆ కిక్ అందరికీ కరెక్ట్ గా ఎక్కితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అలాగే ఒక హీరోను మరో హీరో డామినేట్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ మధ్య సరికొత్త వార్ కు తెరలేస్తుంది. అయితే ఎవరెన్ని చెప్పుకున్నా.. కొన్ని సినిమాల విషయంలో కాలిక్యులేషన్స్ కంటే ఖచ్చితమైన రిజల్ట్ ప్రేక్షకులకు స్పష్టంగా తెలుసు. అలా బాలకృష్ణ, రవితేజ మధ్య గతంలో జరిగిన మూడు బాక్సాఫీస్ వార్స్ లో పూర్తిగా రవితేజ.. బాలయ్యను డామినేట్ చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు.

2008 జనవరి 10న బాలకృష్ణ, వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఒక్క మగాడు. ఎన్నో అంచనాలున్న ఈ మూవీ రెండో ఆటకే తేలిపోయింది.

యూనానిమస్ గా డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని భరించలేకపోయారు అనేది నిజం. ఇక అదే టైమ్ లో జనవరి 12న మాస్ మహరాజ్ రవితేజ, వివి వినాయక్ కాంబినేషన్లో కృష్ణ మూవీ వచ్చింది. బెజవాడ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈమూవీ హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ లా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక నెక్ట్స్ 2009 మే 1న బాలకృష్ణ ”మిత్రుడు” విడుదలైంది. ఫ్లాప్ అని చెప్పలేం కానీ అప్పటి బాలయ్య ఇమేజ్ కు భిన్నంగా ఉండటంతో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుందీ చిత్రం.

ఇక ఆ తర్వాతి వారం రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన కిక్ విడుదలైంది. కిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. పూర్తిగా రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా రూపొందిన ఈ మూవీ కూడా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే రావడం విశేషం. అలా ఒక వారం గ్యాప్ లో వచ్చినా.. బాలయ్యను దాటేశాడు రవితేజ.

ఇక ఈ ఇద్దరూ 2011 జనవరి 12న మరోసారి సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వార్ లో తలపడ్డారు. అది కూడా ఒకే రోజు కావడం విశేషం. బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ టైమ్ దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ”పరమవీర చక్ర” అనే సినిమా చేశాడు.

భారీ తారాగణంతో ఆ టైమ్ కు అత్యంత భారీ బడ్జెట్ గా 32కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. కనీసం 10 కోట్లు కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. కాంబినేషన్ క్రేజ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఇక ఈ మూవీ దాసరికి 150వ చిత్రం కావడం విశేషం.

జనవరి 12నే వచ్చిన రవితేజ సినిమా మిరపకాయ్. షాక్ ఫ్లాప్ తర్వాత హరీష్ శంకర్ తో రవితేజ చేసిన సినిమా ఇది. హరీష్ కు దర్శకుడుగా రెండో చిత్రం. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అలా మూడో సారి కూడా బాలయ్య పై రవితేజ పై చేయి సాధించాడు. ఈ కారణంగానే అప్పట్లో రవితేజను బాలయ్య కొట్టాడు అనే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదు అని చాలామందికి తెలుసు.

ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ బాక్సాఫీస్ బరిలో వార్ కు రెడీ అవుతున్నాడు. ఈ యేడాది దసరా సందర్భంగా బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. అదే రోజు మాస్ మహరాజ్ టైగర్ నాగేశ్వరరావు విడుదలవుతుంది. మరి ఈ ఇద్దరిలో ఈ సారి అప్పర్ హ్యాండ్ ఎవరిదో గానీ.. మరోసారి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం గ్యారెంటీ అనిపిస్తోంది. గతంలో ఏం జరిగినా.. ఈ సారి ఇద్దరూ బ్లాక్ బస్టర్స్ కొట్టాలని మనం కోరుకుందాం.