మూడూ పోయాయి..టాలీవుడ్ కు మరో బ్యాడ్ ఫ్రైడే

శుక్రవారం వస్తోందంటే చాలు.. తెలుగు సినిమా పరిశ్రమ చాలా అంచనాలతో రిజల్ట్స్ కోసం చూస్తుంటుంది. ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందా..? ఏ మూవీ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ కొన్నాళ్లుగా ఈ ఎదురుచూపులన్నీ నిట్టూర్పులతో ముగిసిపోతున్నాయి. కారణం.. మాగ్జిమం మూవీస్ బాక్సాఫీస్ వద్ద తేలిపోతుండటమే. ఈ వారం వచ్చిన మూడు సినిమాలు కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి. మరి ఈ మూడు సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నాయో బ్రీఫ్‌ గా చూద్దాం..ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్ తో అంచానలు పెంచారు. కానీ వాటిని అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు.

ఇంద్రగంటి మార్క్ ఇందులో పూర్తిగా మిస్ కావడంతో పాటు ఏ మాత్రం కొత్తదనం లేని కథ, కథనాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. అలాగని అస్సలు బాలేదు అని చెప్పలేం. బట్.. సాధారణమైన సినిమాగా మాత్రమే మిగిలిపోయింది. ప్రధాన పాత్రల్లో సుధీర్, కృతిశెట్టి మాత్రం తమ నటనతో బాగా ఆకట్టుకున్నారు.బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగే ప్రయత్నం చేస్తోన్న కిరణ్‌ అబ్బవరపు మరో ప్రయత్నంగా చేసిన సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు దివ్యదీప్తి నిర్మించిన ఈ చిత్రం మరీ పురాతన కథ అనిపించుకుంది. ఇప్పటికే వచ్చిన వేలాది సినిమాల ఫార్మాట్లోనే సాగిన కథ, కథనాల వల్ల డిజాస్టర్ గా డిక్లేర్ అయిందీ చిత్రం. ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదని చూసిన వారంతా చెప్పుకుంటున్నారు. పైగా ఇంకా తనకంటూ ఏ ఇమేజ్ తెచ్చుకోని కిరణ్‌ మాస్ హీరోగా చేసిన ఫైట్స్ సైతం ఇబ్బంది పెట్టాయంటున్నారు.

మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన శాకిని డాకిని సైతం బాక్సాఫీస్ వద్ద ఏ ప్రభావం చూపించలేకపోయింది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. సునిత తాటి, సురేష్ బాబు నిర్మించారు. వారి ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాను నిలబెట్టేలేకపోయింది. అంచనాలే లేకుండా వచ్చిన ఈ మూవీ సైతం ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. చెప్పడానికి థ్రిల్లర్ అని చెప్పినా.. అలాంటివేం కనిపించలేదనేది ప్రధాన కంప్లైంట్. మొత్తంగా ఈ వారం వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయి.. టాలీవుడ్ కు మరో బ్యాడ్ వీక్ ను ఇచ్చాయి.

Related Posts