పవన కళ్యాణ్‌ పై పోటీ చేస్తానంటోన్న అలీ

సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. సినిమాల్లో స్నేహితులు రాజకీయాల్లో ప్రత్యర్థలవుతారని నాటి ఎన్టీఆర్, కృష్ణ నుంచి నేటి రోజా, చిరంజీవి వరకూ తెలుస్తూనే ఉంది. అది “అధిస్టానం ఆదేశిస్తే.. పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేస్తా..” అనే అలీ స్టేట్మెంట్ తో మరో అడుగు ముందుకు పడింది అంతే. యస్.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ ప్రతి సినిమాలోనూ అలీ ఉన్నాడు. అతనికి పాత్ర లేకపోయినా దర్శకులతో చెప్పి సెపరేట్ ట్రాక్ వుండేలా చేశాడు పవన్ కళ్యాణ్‌. అలీ కంపెనీ అంటే అతనికి అంత ఇష్టం.

బాల నటుడుగా వచ్చి.. యవ్వనంలో ఎక్కువగా పవన్ సినిమాల్లో నటించడం వల్ల కేవలం పవన్ కళ్యాణ్‌ వల్లే అలీ అనేవాడు ఉన్నాడు అనే అపోహ అటు పవన్ ఫ్యాన్స్ లో ఉంది. ఎంత స్నేహితులైనా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకరు సాయం చేశారనో లేక.. ఇంకేదో చేశారనో సొంత అభిప్రాయాలు ఎవరూ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. అందులో వారు తీసుకునే నిర్ణయాలకు సామాజిక అంశాలను అంటగట్టి చూడటం అవివేకం, ఇమెచ్యూరిటీ. ప్రస్తుతం అలీ విషయంలో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చేసే కమెంట్స్ కు ఈ రెండు మాటలూ వర్తిస్తాయి.


ఇక అదే టైమ్ లో కేవలం సెన్సేషనలిజం కోసమే పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేస్తా అనడం అలీ వివేచనారహిత రాజకీయాన్ని సూచిస్తుంది. నిజానికి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అవసరం లేదు. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థాయి ఇంకా అలీకి రాలేదు. తను గెలవకపోయినా.. పార్టీ పెట్టిన రోజు నుంచి పవన్ కళ్యాణ్‌ ప్రజల్లోనే ఉంటున్నాడు. వారి సమస్యలు వింటున్నాడు. తోచిన సాయం చేస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా.. తనదైన పొలిటికల్ స్ట్రాటజీని చూపిస్తున్నాడు. కేవలం అధికార పార్టీ ప్రాభవంలోకి వెళ్లి.. వారి ఆశిస్సుల కోసమే ఇలాంటి అడ్డమైన కమెంట్స్ చేస్తూ అటెన్షన్ తెచ్చుకునే పొలిటీషియన్స్ చాలామంది ఉంటారు.

ఆ మందిలో అలీ ఒకడు. అంతే తప్ప అతని కమెంట్స్ కు రాజకీయంగా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం అటు జనసేనకు లేదు. అలాగే వైసీపీలో పట్టించుకుంటారు అని కూడా అనుకోలేం. ఆ మధ్య తన కూతురు ఫంక్షన్ కు చివరి నిమిషంలో ఫ్లైట్ మిస్ అవడం వల్ల రాలేకపోయాడు.. తప్ప మేం స్నేహితులమే అని చెప్పాడు అలీ. అది వ్యక్తిగత అంశం. నిజానికి అలీ అంటే పవన్ కు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా ఈ ఇద్దరి మధ్య ఏ అంశమూ ప్రస్తావనలో లేకపోయినా అలీ ఆ కమెంట్ చేయడం అతని రాజకీయ నిస్తేజానికి అర్థం చెబుతోంది.

వైసీపీలో ఉన్నా తననెవరూ పట్టించుకోవడం లేదు అనే నైరాశ్యంలో నుంచే ఇలాంటి మాటలు పుట్టుకు వస్తాయి. ఏదేమైనా అలీ చేసిన కమెంట్స్ జనసేన వర్గాల్లో రాజకీయ విశ్లేషణకు కాకుండా కేవలం బూతులకు మాత్రమే పరిమితమైతే అది అలీకే మేలు చేస్తుంది.. అభిమానుల పేరుతో బూతుల దాడికి దిగితే జనసేనకు ఏ కొద్దో అయినా మైనస్ అవుతుంది. ఇంతకు మించిన రాజకీయాంశం ఈ కామెంట్స్ లో ఏమీ కనిపించడం లేదు. సో.. అలీని.. అతని కమెంట్స్ ను జనసేన అండ్ సైనిక్స్ లైట్ తీసుకుంటే బెటర్.

Related Posts