తొలి నుంచీ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సరికొత్త కథ, కథనాలతో సినిమాలను నిర్మించడం, నటించడం కళ్యాణ్ రామ్ శైలి. ఈకోవలోనే ఇప్పుడు తన కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఆమధ్య కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్ గా ప్రకటించిన తన 21వ సినిమాకి తాజాగా ముహూర్తాన్ని పూర్తిచేశాడు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా సయీ మంజ్రేకర్ నటిస్తుంది. కీలక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి కనిపించబోతుంది. ‘కాంతార, విరూపాక్ష‘ చిత్రాలతో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్స్ పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.