ad

నందమూరి కళ్యాణ్‌ రామ్.. బాలగోపాలుడుగా బాల్యంలోనే నటన మొదలుపెట్టాడు. హీరోగా తొలిచూపులోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసి తెలుగు సినిమా కురుక్షేత్రంలో అభిమన్యుడు కావాలనుకున్నాడు. చివరికి అతనొక్కడే బరిలో నిలిచి గెలిచాడు. అసాధ్యుడులా తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో పటాస్ లా దూకుడు చూపిస్తూ వెళుతున్నాడు. జయాపజయాలతో పనిలేకుండా కళ్యాణ్ రామ్ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయిగానే పేరు తెచ్చుకున్నాడు. తమ్ముడు ఎన్టీఆర్ కు బాసటగా నిలుస్తూ.. తనదైన దారిలో వెళుతోన్న కళ్యాణ్‌ రామ్ బర్త్ డే ఈ మంగళవారం. ఈ సందర్భంగా అతని కెరీర్ ను బ్రీఫ్‌ గా చూద్దాం..ఒక తరం నందమూరి కుర్రాళ్లంతా హీరోలుగా మారుతోన్న తరుణంలోనే కళ్యాణ్‌ రామ్ కూడా ఆ రూట్ ను ఎంచుకున్నాడు. తండ్రి హరికృష్ణ తోడుగా అడుగులు మొదలుపెట్టాడ. తొలినాళ్లలో ఆ అడుగులు తడబడ్డాయి. హీరో మెటీరియల్ కాదన్న విమర్శలు వచ్చాయి. అయినా తలవంచక తనే నిర్మాతగా మారి అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డిని దర్శకుడుగా పరిచయం చేశాడు. ఆ తర్వాత అదే దూకుడు చూపిస్తూ అసాధ్యుడు అనిపించుకున్నాడు.కళ్యాణ్‌ కెరీర్ లో సక్సెస్ ఎప్పుడూ స్థిరంగా లేదు.

అయినా సినిమాలు చేయడం ఎప్పుడూ ఆపలేదు. బయటి నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు సొంత బ్యానర్ లోనే సినిమాలు చేశాడు. ఇంకా చెబితే సొంత బ్యానర్ సినిమాలే పెద్ద విజయాలు సాధించాయి. డ్యూయొల్ రోల్ చేసిన హరేరామ్ అతనికి మరో మంచి విజయాన్నిచ్చింది. అలాగే నిర్మాతగానూ హీరోగానూ ప్రయోగాలూ చేశాడు. ఇండియా నుంచే ఫస్ట్ త్రీడీ యాక్షన్ సినిమాగా ఓమ్ చిత్రాన్ని చేశాడు. పెద్ద అంచనాలతో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా అతను ఆగలేదు. అయినా ఆ తర్వాత చేసిన పటాస్ తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంతో తన కామెడీ టైమింగ్ ను కూడా చూపించాడు. అలాగే పటాస్ తోనే ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడిని దర్శకుడుగా పరిచయం చేశాడు.తన బ్యానర్ ను విస్తరిస్తూ పటాస్ బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కిక్2 చిత్రాన్ని నిర్మించాడు. తను పరిచయం చేసిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన కిక్2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా తమ్ముడు ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రాన్ని నిర్మించి మరో భారీ విజయం సాధించాడు. నిర్మాతగా ఇది కళ్యాణ్‌ కు మంచి ప్రాఫిట్స్ తెచ్చింది. అలాగే ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించింది. ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకూ మరో చిత్రాన్ని నిర్మించలేదు కళ్యాణ్‌ రామ్. అందుకు కారణం తను వరుసగా బయటి బ్యానర్స్ లో హీరోగా నటిస్తుండటమే.కళ్యాణ్‌ రామ్ లో తెగువ కనిపిస్తుంది. అది అతని సినిమా ప్రయాణాన్ని చూస్తే అర్థం అవుతుంది. వరుసగా సినిమాలు పోతున్నా.. అతనిలోని స్థిరత్వం పోదు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన థ్రిల్లర్ మూవీ 118 కమర్షియల్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బింబిసార అనే ఫాంటసీ ఫిక్షన్ మూవీతో వస్తున్నాడు. తన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో పాటు డెవిల్ అనే యాక్షన్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాడు. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్ లో మరో సినిమా రాబోతోంది. నిర్మాతగా ఎన్టీఆర్ చిత్రాల్లో భాగస్వామిగానూ కొనసాగుతోన్న కళ్యాణ్‌ రామ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ.. అతను మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుందాం.

, , , , , , ,