హిట్ ఉంటేనే పట్టించుకునే పరిశ్రమ సినిమా పరిశ్రమ. ఒకప్పుడు ఎంత పెద్దవాళ్లై.. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా.. ఇప్పుడేంటీ అనేది చూస్తారు తప్ప నిన్న ఎప్పుడూ మేటరే కాదు. అలా మేటర్ లో లేకుండా పోయిన దర్శకులు చాలామంది ఉన్నారు. వారిలో శ్రీను వైట్ల ఒకడు. తన ఫామ్ లో ఉన్న టైమ్ లో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ట్రెండ్ సెట్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ అంటే అతని తర్వాతే అన్న పేరు తెచ్చుకున్న శ్రీను ఇప్పుడు ఫేడవుట్ స్టేజ్ లో ఉన్నాడు. బట్ చివరగా మరో ప్రయత్నం చేస్తున్నాడట. మరి అతని ప్రయత్నానికి సపోర్ట్ చేసే హీరో ఎవరో తెలుసా..?


శ్రీను వైట్ల.. తెలుగులో తిరుగులేని ముద్ర వేసిన దర్శకుడు. అతని సినిమాలు ఒకప్పుడు ప్రభంజనం సృష్టించాయి. కంటెంట్ ఏదైనా కడుపుబ్బా నవ్వించాడు. కంటిన్యూస్ గా కమర్షియల్ సక్సెస్ లు కొట్టాడు. శ్రీను దర్శకత్వంలో నటించిన హీరోలంతా సరికొత్తగా కామెడీ టైమింగ్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అదీ అతని శైలి. ఈ శైలి ఆ తర్వాత మరే దర్శకుడికీ రాలేదు. వచ్చినా ఒకటీ రెండు సినిమాలకే తేలిపోయారు. అలాంటి శ్రీను వైట్ల ఫ్లాప్ లు ముసురుకున్నాయి. అందుకు ప్రధాన కారణం తను ఏ ట్రెండ్ మొదలుపెట్టాడో.. ఆ ట్రెండ్ లోనే ఆగిపోవడం. ఓ ప్రేమకథ, ఫ్యామిలీలో గొడవలు, విలన్ ను బఫూన్ చేయడానికి తన్నులు తినే కమెడియన్. ఈ ఫార్మాట్ దాటేలోగానే అతను దారి తప్పాడు. తర్వాత మారినా.. అందులో అతని మార్క్ లేకపోవడంతో అవీ పోయాయి.


2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా పోయిన తర్వాత శ్రీను వైట్లకు మరే హీరో డేట్స్ ఇచ్చేందుకు సాహసం చేయలేదు. ఓ రకంగా రవితేజ చేసిందే సాహసం. అప్పటి నుంచీ కథలు పట్టుకుని చాలామంది యంగ్ హీరోలను కలిశాడు అంటారు. ఆ మధ్య మంచు విష్ణుతో ఢీ కు కొనసాగింపుగా ఓ సినిమా చేస్తాడు అన్న వార్తలు వచ్చినా అవేవీ వర్కవుట్ కాలేదు. బట్ రీసెంట్ గా శ్రీను వైట్ల.. తనలాగే వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు కథ చెప్పాడట. ఆ కథ గోపీచంద్ కు నచ్చింది. దీంతో పూర్తిగా డెవలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు శ్రీను వైట్ల. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే నిర్మాత మేటర్ తేలాల్సి ఉంటుంది. అయితే గోపీచంద్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలున్నారు. వారితో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. బట్.. ఈ ఛాన్స్ ను కూడా మిస్ చేసుకుంటే ఇక శ్రీను వైట్ల చాప్టర్ ముగిసినట్టే అనేది ఇండస్ట్రీలో వినిపిస్తోన్న ఇన్ సైడ్ టాక్.

, , , , , ,