నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వైజాగ్ లో సక్సస్ మీట్ ను భారీగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ… మంచి సినిమాలను ఆదరిస్తామని నాన్న గారి ఉన్నప్పటి నుంచి నిరూపిస్తూనే ఉన్నారు.
ప్రేక్షకుల అభిరుచికి నా కృతజ్ఞతలు. అఖండ విజయం చలన చిత్ర పరిశ్రమ సాధించిన విజయం. అభిమానుల్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నా నుంచి వాళ్లు ఏమీ ఆశించరు. విజయాలు ఇచ్చినా పరాజయాలు ఇచ్చినా నా వెన్నంటే ఉండి ప్రొత్సహించారు. దర్శకుడు బోయపాటి నాకు ఏ సినిమాకి పూర్తి కథ చెప్పలేదు. ఒకట్రెండు సన్నివేశాలు చెబుతారు అంతే.. మా ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉంటుంది. అందుకే ఇంత పెద్ద విజయం సాధ్యమైంది అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ప్రేక్షకుడికీ, థియేటర్ కి బంధం తెగిపోతుందనే భయాలు నెలకొన్న దశలో ఒక మంచి సినిమా తీస్తే.. మళ్లీ మళ్లీ చూసి పెద్ద విజయాన్ని అందిస్తామని అఖండతో ప్రేక్షకులు నిరూపించారు. ఈ సినిమాతో ప్రేక్షకుల మాకు డబ్బులు ఇవ్వడమే కాదు పరిశ్రమకే ధైర్యాన్ని ఇచ్చారు. మామూలుగా నటులు ఒక మంచి పాత్ర చేస్తున్నారంటే.. వాళ్లు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు. అదే బాలయ్య పాత్ర చేస్తున్నారంటే.. ఆ పాత్రే ఉత్సాహపడుతుంది అన్నారు.