Vijay Antony : బిచ్చగాడు2 రివ్యూ


తారాగణం : విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్, హరీష్‌ పేరడీ, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరు
సినిమాటోగ్రఫీ : ఓమ్ నారాయణన్
ఎడిటర్, సంగీతం : విజయ్ ఆంటోనీ
నిర్మాత : ఫాతిమా విజయ్
రచన, దర్శకత్వం : విజయ్ ఆంటోనీ

2016లో వచ్చిన బిచ్చగాడు తెలుగులో సంచలన విజయం సాధించింది. అంతకు ముందు కొన్ని డబ్బింగ్ మూవీస్ తో ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు2తో తెలుగులో స్టార్డమ్ కూడా తెచ్చుకున్నాడు. ఆ టైమ్ లో తెలుగు సినిమాలే ఇబ్బంది పడుతుంటే ఈ మూవీ మాత్రం ఏకంగా వంద రోజులు ఆడేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన విజయ్ సినిమాలేవీ తెలుగులోనే కాదు.. తమిళ్ లోనూ ఆకట్టుకోలేదు. దీంతో మళ్లీ తన బిచ్చగాడు అనే అస్త్రాన్ని బయటకు తీశాడు. ఈ సారి ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణం, దర్శకత్వం అంటూ అన్ని కీలక బాధ్యతలూ తనే తీసుకున్నాడు. మరి ఈ బిచ్చగాడు2 ఎలా ఉందో చూద్దాం..

కథ :
విజయ్ గురుస్వామి(విజయ్ ఆంటోనీ) ఇండియాలోనే ఏడో ధనవంతుడు. లక్షకోట్ల ఆస్తికి వారసుడు. కానీ వ్యక్తిత్వం గొప్పగా ఉండదు. ముఖ్యమంత్రి కూడా అతనికి దాసోహం అనేలా ఉంటాడు. తన సెక్రటరీ హేమ(కావ్య థాపర్)ను ప్రేమిస్తుంటాడు. అతని సెక్రటరీలతో పాటు ఫ్యామిలీ డాక్టర్ కలిసి.. అతని బ్రెయిన్ ను మార్చాలని ప్రయత్నిస్తారు. మరోవైపు సత్య ఒక బిచ్చగాడు. చిన్నప్పుడే తప్పిపోయిన తన చెల్లిని వెదుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఒకరిని చంపి జైలుకు వెళతాడు. అదే సమయంలో సత్య బ్లడ్ గ్రూప్ విజయ్ కి మ్యాచ్ అవుతుందని తెలుస్తుంది. విజయ్ బ్రెయిన్ మార్చడానికి అతన్లానే ఉండి.. బ్లడ్ గ్రూప్ తో పాటు మెడికల్ టర్మ్స్ అన్నీ సెట్ అయిన సత్య(విజయ్ ఆంటోనీ)ని కిడ్నాప్ చేసి దుబాయ్ లో విజయ్ బ్రెయిన్ ను తీసి సత్యకు అమరుస్తారు. దీంతో విజయ్ చనిపోతాడు. మరి ఈ సత్య.. విజయ్ లా మారాడా..? సత్య చెల్లి ఎవరు.. తప్పిపోయిన తను దొరికిందా లేదా..? అసలెందుకు విజయ్ ని చంపాలనుకున్నారు.. సత్య విజయ్ కాదు అనే నిజం తెలుస్తుందా లేదా..? విజయ్ స్థానంలో ఉన్న సత్య ఏం చేశాడు.. అనేది మిగతా కథ.

విశ్లేషణ :
బిచ్చగాడు అనగానే తెలుగు ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉందనేది నిజం. విజయ్ ఆంటోనీ సినిమాలు పోయినా.. ఏదో కొత్త కంటెంట్ ప్రయత్నిస్తాడు అనేదీ నిజం. బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ టైటిల్ తో సీక్వెల్ అంటే గత సినిమాలన్నీ పోయినా.. ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగానే మూవీ టేకాఫ్‌ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటాడు. అత్యంత ధనవంతుడు అనే లావిష్ నెస్ ను బాగా మెయిన్టేన్ చేశారు.

మొదటి పావుగంటలోనే వచ్చే పాటలో హీరోయిన్ అందాలారబోత గతంలో విజయ్ సినిమాల్లో కనిపించలేదు. మొదటి సగంలో వచ్చే సత్య చిన్నప్పటి ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్ లో సాగదీశారు. చిల్డ్రన్ ఎపిసోడ్ మరీ అంత సేపు చూడ్డం అంటే కష్టం అనిపిస్తుంది. సత్యను కిడ్నాప్ చేయడం.. అంతకు ముందే విజయ్ ని దుబాయ్ కి తీసుకువెళ్లి ఆపరేషన్ కు రెడీ చేయడం.. వీరి బ్రెయిన్‌స్ ను మార్చడం వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. కాకపోతే ఈ ఎపిసోడ్ అంతా పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ లోని చిప్ లు మార్చడం అనే పాయింట్ నే గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే సత్య బిచ్చగాడే అయినా కోట్లు చూడగానే టెంప్ట్ కాడు. నిజాయితీగా తను వాళ్లు చెప్పినట్టుగా ప్రవర్తించలేను అని చెబుతాడు. దీంతో ఆ విలన్స్ అతన్ని కట్టేసివిపరీతంగా కొడతారు. తను తిరగబడతాడు. ఆ ముగ్గురినీ చంపేస్తాడు విజయ్ శరీరంతో కనిపించే సత్య. ఈ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ కే హై మూమెంట్ లా ఉంటుంది. మరి విలన్స్ పోయాక హీరో ఏం చేస్తాడుఅనే డౌట్ తో సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాడు.

ఇక సెకండ్ హాఫ్‌ కు వచ్చాక.. అంత పెద్ద కోటీశ్వరుడు చిన్న అయ్యప్ప మాల లాంటి బట్టలు ధరించి బిచ్చగాళ్లుండే ప్రదేశంలో తన చెల్లి 20యేళ్ల క్రితం ఫోటో పట్టుకుని వెదుకుతూ ఉంటాడు. ఆవెదుకులాటలో తను సమాజానికి ఏదో చేయాలనే సంకల్పం దొరుకుతుంది. దీంతో విజయ్ లా మారిపోయి.. యాంటీ బికిలీ అనే ఒక సంస్థను స్థాపిస్తాడు. సమాజంలో ఏ ఒక్కరూ కూడు, గుడ్డ, గూడూ లేకుండా ఉండేందుకు ఈ యాంటి బికిలీ పనిచేస్తుంటుంది. అదే సమయంలో అతను విజయ్ కాదు అన్న విషయం ముఖ్యమంత్రికి తెలిసి.. అతన్ని ఒక బిచ్చగాడుగా, హంతకుడుగా కోర్ట్ ముందు దోషిలా నిలబెడతాడు. మరి ఆ తర్వాత ఈ యాంటి బికిలీ ఏమైందీ అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

బిచ్చగాడు2 మొదలుపెట్టడం బావుంది. కానీ కథన మాత్రం ఓ పద్ధతిలో సాగినట్టు అనిపించదు. కన్ స్ట్రక్టివ్ స్క్రీన్ ప్లే లేకపోవడం మైనస్ లా మారింది. 20యేళ్ల క్రితం తప్పిపోయిన చెల్లి కోసం ఆ ఫోటో పట్టుకుని వెదకడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే యాంటీ బికిలీ పేరుతో చేసిన ఉపన్యాసాలు బోరింగ్ గా అనిపిస్తాయి. పైగా అతను చెప్పిన అంశాలతో అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కాన్సెప్ట్ లో చిన్న మార్పులు కనిపిస్తాయి అంతే. క్లైమాక్స్ లో కోర్ట్ ఎపిసోడ్ కూడా మరీ పేలవంగా ఉంది. ఒక దోషి తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా అతని ఏడుపు చూసి జడ్జి కరిగిపోవడం.. డిఎన్ఏ టెస్ట్ అంటూ కొత్త పాయింట్ ఏదో చూపుతున్నట్టుగా మరొకరు ఎంటర్ అవడం అన్నీ.. పేలవంగానే కనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లో ఇందుకోసమే అతను ఇదంతా చేశాడు అనే పాయింట్ కు జస్టిఫికేషన్ ఇవ్వడానికి చెల్లిని తీసుకువస్తారు. ఇది కూడా సహజంగా అనిపించదు.

మొత్తంగా చూస్తే బిచ్చగాడు2 ఒక పద్ధతిలో కనిపించదు కానీ.. చాలా సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే బోర్ కొట్టిస్తాయి కూడా. ఇక బిచ్చగాడుతో పోలిస్తే మాత్రం అస్సలు సరిపోదు అనే చెప్పాలి.
నటన పరంగా విజయ్, సత్య పాత్రల్లో వేరియేషన్ చూపించేందుకు విజయ్ బాగానే ట్రై చేశాడు. మామూలుగానే తనేం గొప్ప నటుడు కాదు. కానీ ఈ మూవీలో కాస్త ప్రయత్నించాడు. కావ్య థాపర్ ఒక పాట కొన్ని సీన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ కు పరిమితం. తనూ ఓకే. మిగతా పాత్రలన్నీ వెరీ రొటీన్.
టెక్నికల్ గా మాత్రం హై స్టాండర్డ్స్ లో ఉంది సినిమా. చెల్లి సెంటిమెంట్ తో వచ్చే పాట బావుంది. నేపథ్య సంగీతం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పాటలు, మాటలు కూడా బాగా రాశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. దర్శకుడుగా విజయ్ ఆంటోనీకి ఇది తొలి చిత్రం. అయినా చాలా కమాండ్ తో తీశాడు. కథనం పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఖచ్చితంగా పెద్ద విజయమే అందుకుని ఉండేవాడు…

ప్లస్ పాయింట్స్ :
విజయ్ ఆంటోనీ
సంగీతం, సినిమాటోగ్రఫీ
ఫైట్స్
డైలాగ్స్

మైనస్ పాయింట్ :
సాగదీత సన్నివేశాలు
ఫస్ట్ హాఫ్ లో చిల్డ్రన్ ఎపిసోడ్
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
హెవీ మెలోడ్రామా.

ఫైనల్ గా : బిచ్చగాడు2 అక్కడక్కడా ఇబ్బంది పెట్టినా ఓకే

రేటింగ్ : 2.5/5

                - బాబురావు. కామళ్ల

Related Posts